చిన్నారులను నిద్రపుచ్చడం చిటికెలో పని!
ముద్దులొలికే బుజ్జాయిలు ఆడుకుంటూ ఉంటే చూడ్డానికి ఎంతో సరదాగా ఉంటుంది. కానీ, ఎంతసేపని అలా...? రాత్రి 11 అవుతున్నా... నిద్రపోకుండా అలాగే అల్లరి చేస్తూ ఉంటే...? గుక్కపట్టి ఏడుస్తుంటే...? అందుకే చిన్నారులను నిద్రపుచ్చే కళ తెలిసి ఉండాలి.
చిన్న పిల్లలు పడుకోరు సరికదా, తల్లిదండ్రుల్ని పడుకోనివ్వరు కూడా. అందుకే చంటి పిల్లలు ఉన్న ఇళ్లల్లో అర్ధరాత్రి అయినా లైట్లు వెలుగుతూనే ఉంటాయి. వాస్తవానికి చిన్నారులు రోజంతా శారీరకంగా చాలా చురుగ్గా ఉంటారు. కనుక రాత్రి వేళ వారికి తగినంత నిద్ర అవసరం. దానివల్ల శారీరక, మానసిక ఎదుగుదల సరిగ్గా ఉంటుందట. చిన్న పిల్లల వైద్యులు, మానసిక వైద్య నిపుణుల సూచనల మేరకు చిన్నారులను నిద్రపుచ్చడం ఎలాగో తెలుసుకుందాం.
రాయ్ పూర్ కు చెందిన ప్రముఖ చిన్న పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ గ్రేస్ చెబుతున్న దాని ప్రకారం... చిన్నారులు నిద్ర పోకపోవడానికి కారణాలు అనేకం ఉంటాయి. ఆకలి, అసౌకర్యం, నొప్పి లేదా మరేదైనా కారణం అయి ఉండవచ్చు. అందుకే సమస్యను గుర్తించే ప్రయత్నం చేయాలి. ఆకలి అయితే పాలు పట్టడం, అసౌకర్యం లేకుండా రాత్రి వేళ గోరు వెచ్చటి నీటితో స్నానం చేయించాలి. వారు ఏదైనా నొప్పితో బాధపడుతున్నారని అనుకుంటే చిన్న పిల్లల వైద్య నిపుణుడికి చూపించాలి.
జో అచ్యుతానంద... జోజో ముకుందా
జోలపాట పాడండి. జోకొట్టండి. చిన్నారి నిద్రలోకి జారుకునే వరకూ అలానే చేయాలి. సాధారణంగా భారతీయ కుటుంబాల్లో తల్లులు ఎక్కువగా ఇదే విధానాన్ని అనుసరిస్తుంటారు. నిజానికి ఇది చాలా మంచి ఫలితాన్నే ఇస్తుంది. చిన్నారుల కోసం లాలిపాటలు పాడడం క్రీస్తు పూర్వం 2000 నుంచే ఆచరణలో ఉంది. లాలిపాటలు విశ్రాంతికి దారితీస్తాయి. వారికి నచ్చిన పాటే రోజూ పాడడాన్ని చిన్నారులు సైతం ఇష్టపడతారట. పాట గురించి చిన్నారులు అడిగితే (అడిగే వయసులో ఉన్న వారు) వారికి వివరంగా చెప్పి పాటను కొనసాగించాలని నిపుణులు సెలవిస్తున్నారు.
తల్లి స్పర్శ
చిన్నారులతో కలసి ఒకే బెడ్ పై పక్కనే నిద్రించడం కూడా మంచి ఫలితాన్నిస్తుంది. వారిని హత్తుకుని పడుకోవాలని చెబుతున్నారు నిపుణులు. తల్లి స్పర్శ చిన్నారులకు ఎంతో ఇష్టమట. దీనివల్ల ఎలాంటి సమస్య లేకుండా వారు చక్కగా నిద్ర పోతారట. అంతేకాదు చిన్నారుల నిద్ర వేళకు అనుగుణంగా పెద్దల నిద్ర వేళను కూడా మార్చుకోవడం మంచిది. అయితే, చిన్నారుల నిద్ర వేళ పెద్దలతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. దాంతో వారు ముందుగా నిద్రలేస్తారు. దీనివల్ల పెద్దలకు కొంత నిద్రాభంగం తప్పదు.
ఏడవనివ్వండి..!
రాత్రి నిద్ర వేళలకు ముందు చిన్నారులు ఏడుస్తున్నారా...? ఏడవనివ్వండి. పాశ్చాత్య దేశాల్లో ఇదే విధానాన్ని పాటిస్తుంటారు. పిల్లలు అలా ఏడ్చి ఏడ్చి అలసి నిద్రలోకి జారుకుంటారట. ఏడుస్తుంటే చూడలేక దగ్గరకు తీసుకోకుండా కొంత సేపు వేచి చూడాలట. ఎంతకీ ఏడుపు మానకుంటే అప్పుడు నొప్పి వంటి సమస్య ఏమైనా ఉందేమో చూడమని నిపుణుల సూచన.
ఆహారం పాత్ర
పిల్లల నిద్రకు, ఆహారానికీ సంబంధం ఉంది. కార్బోహైడ్రేట్లు, అమినో యాసిడ్లు ఉన్న ఆహారంతో పిల్లలకు గాఢ నిద్ర వస్తుందని డాక్టర్ గ్రేస్ అంటున్నారు. కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే సెరటోనిన్ అనే అమైనో యాసిడ్ విడుదల అవుతుంది. ఆత్మీయులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడిపినా ఈ హర్మోన్ విడుదల అవుతుందట. మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం కూడా నిద్రకు ఉపకరిస్తాయట. అందుకే గోరువెచ్చని పాలు పట్టమని వైద్యుల సలహా. గోధుమలు, బియ్యంతో చేసిన ఆహారం, అరటిపండు, గుడ్డు కూడా మంచిదేనట. నిద్రకు ముందు షుగర్ ఎక్కువగా ఉన్నవి, తేనె వంటివి ఇవ్వకూడదు. దీనివల్ల పిల్లలు ఇంకా యాక్టివ్ గా మారతారు. దాంతో రాత్రంతా జాగారమే అవుతుంది.
వయసును బట్టి నిద్ర సమయం
పెద్దలతో పోలిస్తే చిన్న పిల్లలు ఎక్కువ సమయం పాటు నిద్ర పోతారు. ఈ సమయం వారి వయసును బట్టే ఉంటుంది. పుట్టిన తర్వాత రెండు నెలల వరకు రోజులో 18 గంటల వరకు నిద్రలో ఉంటారు. 3 నెలల నుంచి 12 నెలల వరకు 15 గంటల పాటు నిద్రపోతుంటారు. ఏడాది తర్వాత నుంచి మూడేళ్ల వరకు రోజులో 12 నుంచి 14 గంటల మేర నిద్రిస్తారు. మూడేళ్ల తర్వాత ఐదేళ్ల వరకు వారి నిద్ర సమయం 11 గంటల నుంచి 13 గంటల వరకు ఉంటుంది. ఐదేళ్ల నుంచి 12 ఏళ్ల వరకు 10 గంటల వరకు ఉంటుంది.
చెప్పింది తెలుసుకునే వయసా...?
ఏడాదిన్నర వయసులో పిల్లలకు చెబితే కొంతమేరకు అర్థమవుతుంది. అందుకే మరో అరగంటలో నిద్రపోతామనగా... వారికి కథ చెబుతూ, కథ అయిన తర్వాత నిద్రపోవాలని వారికి చెప్పాలట. రోజుకో ఆసక్తికరమైన కథ చెబుతుంటే రాత్రి నిద్ర సమయం అవగానే పడకమంచం ఎక్కేయడానికి చిన్నారులు ముందుంటారట. అంతేకాదు రోజూ నిర్ణీత వేళల్లో(ఫిక్స్ డ్) నిద్రించడానికి అలవాటు చేసుకోవాలంటున్నారు.
365 రోజులూ ఒకేలా కోరుకోకండి
పెద్దల కంటే చిన్నారుల్లో చురుకుదనం పాళ్లు ఎక్కువ. వారు యాక్టివ్ గా ఉన్న సమయంలో బజ్జోరా బుజ్జినాయనా అంటే మాట వినరు గాక వినరు. పైగా పగలు ఎక్కువ సేపు పడుకుని సాయంత్రం నిద్ర నుంచి లేస్తే రాత్రి నిద్రించడానికి ఆలస్యం అవుతుందట. అలాగే, ఇంటికి కొత్తగా బంధువుల పిల్లలు వచ్చారనుకోండి. ఇక వారిది కొత్తలోకమే. అర్ధరాత్రి అవుతున్నా ఆటల్లోనే మునిగిపోయి ఉంటారు. అందుకే రోజులా కాకుండా వారికి మరికాస్త అదనపు సమయం ఇవ్వండి. ఇంట్లో రోజూ పడుకునే గదికి బదులు వేరే గదిలో పడుకోబెట్టినా కొత్త వల్ల వారిలో వెంటనే నిద్ర రాకపోవచ్చు. అలాగే, కొత్త ప్రదేశాలకు వెళితే పెద్దలకు సైతం ఓ పట్టాన నిద్ర రాదు. చిన్నారులకు కూడా ఇదే వర్తిస్తుందట.
నిద్ర సమయంలో భయాలు
చిన్న పిల్లలకు పడకగది చీకటిగా ఉంటే భయంగా అనిపించవచ్చు. అందుకే నిద్రకు ఇబ్బంది కలిగించని లైట్ బ్లూ కలర్ బల్బ్ ఆన్ చేసి ఉంచడం మంచిది. అదే సమయంలో పడకగదిలో వెలుతురు ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. చిన్నారులు నిద్రలోకి జారుకున్న తర్వాత వారిని పరిశీలించమని నిపుణుల సలహా. ఉలిక్కిపడడం, కదలడం, మాట్లాడడం చేస్తుంటే వైద్యులను సంప్రదించి సందేహాలను నివృత్తి చేసుకోవాలి. ఇంట్లో, స్కూల్లో బెదిరింపుల వల్ల రాత్రులు కలత నిద్రకు దారితీయవచ్చట. అలాంటివి ఏమైనా ఉన్నాయేమో కనుక్కుని పరిష్కరించడం వల్ల వారిలో భయం తొలగిపోతుంది. ఒకవేళ వెలుగు వల్ల, ఏవైనా శబ్ధాల కారణంగా వారు నిద్రపోలేకపోతున్నారా అన్నది కూడా చూడాలి. ఇంకా ఏవైనా భయాలున్నాయేమో గమనించి తాను కూడా పక్కనే ఉంటానని తల్లి ధైర్యం చెబుతూ వారిపై చేయి వేసి నిద్ర పుచ్చడం వల్ల సమస్య పరిష్కారం అవుతుందంటున్నారు నిపుణులు.
సెల్ ఫోన్లు పడక మంచం దగ్గర లేకుండా చూసుకోవాలి. అలాగే, వైఫై ఉంటే ఆఫ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎలక్ట్రో మేగ్నటిక్ రేడియేషన్ ఆధారంగా పనిచేసే వైఫై చిన్నారుల్లో నిద్రాభంగానికి దారితీస్తుందంటున్నారు. చిన్నారులు ఉన్న పడకగదుల్లో టీవీలను చూడరాదు. ఒకవేళ పడకగదిలో టీవీ ఉంటే వెంటనే దాన్ని తొలగించేయండి. పరుపు మరీ సాఫ్ట్, మరీ హార్డ్ గా ఉండకుండా చూసుకోవాలి. గదిలో మరీ శీతలంగా ఉండడం చిన్నారులకు సరిపడదట. వేసవిలో సైతం గదిలో ఉష్ణోగ్రత సరిపడా ఉండేలా చూసుకోవడమే సరైనదట.
జలుబు ఇతర సమస్యలు ఏవైనా ఉన్నాయా?
గదిలో సరైన గాలి లేకపోయినా, జలుబు వంటి సమస్య ఉన్నా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా పిల్లలు సరిగా నిద్రపోరట. కనుక ఇలాంటి సమస్యలు ఉంటే నివారణకు చర్యలు తీసుకోవాలి.
చిన్నారుల ఎదుగుదలలో నిద్ర కీలక పాత్ర
చిన్నారుల మానసిక, శారీరక ఎదుగుదలలో నిద్ర చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే చిన్న పిల్లలు సరిగా నిద్ర పోకపోతే తర్వాత కాలంలో వారిలో సమస్యలు తలెత్తుతాయంటున్నారు డాక్టర్ గ్రేస్. చిరాకు, అతి చురుకుదనం, ఏకాగ్రత లోపం, ఆకలి మందగించడం వంటి సమస్యలు వస్తాయట. నిద్ర పాళ్లు తక్కువైతే ఒత్తిడి, విశ్రాంతి లేమికి కారణమయ్యే కార్టిసాల్ రసాయనం ఎక్కువ పాళ్లలో విడుదల అవుతుందంటున్నారు నిపుణులు.
డ్రెస్ ల విషయంలోనూ శ్రద్ధ
రాత్రి వేళల్లో పిల్లలకు వేసే వస్త్రాలు చాలా సౌకర్యంగా ఉండాలి. వేసవిలో కాటన్, శీతాకాలంలో ఉన్ని ఇలా అన్నమాట. అలాగే, పిల్లలకు ఇష్టమైన రంగులు, డిజైన్లతో ఉన్న డ్రెస్ లు కూడా వేయడం వల్ల ఉపయోగం ఉంటుందట. తెలుసుకునే వయసు అయితే, రెండు మూడు చూపించి ఏది వేయమంటారో అడిగి వాటిని వేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. పసి పిల్లలైతే డయాపర్లు ఉంటాయి. వారు మూత్ర విసర్జన చేసినా డయాపర్ పీల్చేస్తుంది. అదే మూడేళ్లు పైబడిన పిల్లలకు చెబితే తెలుస్తుంది. కనుక నిద్రకు ముందు వారు మూత్ర విసర్జన చేసేలా అలవాటు చేయాలని నిపుణుల సూచన.