'షుగర్' ఉన్న వాళ్లు కూడా మామిడిపండు తినవచ్చట!
మామిడి పండ్ల సీజన్ వచ్చేస్తోంది. మామిడి పండును చూసినా... ఆ పండు వెదజల్లే పరిమళం ముక్కుపుటాలను చేరినా తినకుండా ఉండడం కష్టతరం. అయితే, ఇంతటి మధురమైన పండును తినే విషయంలో షుగర్ వ్యాధి ఉన్నవారికి ఎన్నో సందేహాలు వస్తుంటాయి. తింటే బ్లడ్ షుగర్ పెరిగిపోతుందేమోనన్న భయం వారిని వేధిస్తుంటుంది. మరి మామిడి పండును నిర్భయంగా తినవచ్చా...?
నిశ్చింతగా తినవచ్చు అంటున్నారు ప్రముఖ ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ పంకజ్ అగర్వాల్. కాకపోతే, ఎక్కువ కాకుండా చూసుకోవాలి అంతే. మామిడి పండ్లలో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి6, పొటాషియం, ఫోలిక్ యాసిడ్ ఉన్నాయి. ఒక మ్యాంగోలో ఉన్న కేలరీలు ఒకటిన్నర రోటీలో ఉండే కేలరీలతో సమానం. ఒక మామిడి పండు తిన్నంత మాత్రాన రక్తంలో గ్లూకోజ్ పెద్దగా పెరిగిపోదు.
కాకపోతే అన్నం తిన్న వెంటనే లేదా, అన్నంతోపాటు మామిడి పండు తినకూడదు. స్నాక్స్ టైమ్ లో స్నాక్స్ కు బదులు మామిడి పండు సగం మేర తీసుకోవచ్చు. దానివల్ల తగినంత శక్తి లభిస్తుంది. పైగా తీసుకుంటున్నది కొద్ది పరిమాణంలోనే కాబట్టి రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ కూడా పెరగవు. కనుక రోజులో నాలుగు గంటల విరామంతో మూడు పర్యాయాలు మామిడి పండును, ప్రతిసారి సగానికి మించకుండా తీసుకోవచ్చు. వేయించిన శనగలు లేదా పెసరపప్పుతో పాటు మామిడి పండును తీసుకున్నట్లయితే ప్రొటీన్స్, ఫైబర్ తగినంత లభించి రక్తంలో గ్లూకోజ్ పెరిగిపోకుండా నియంత్రణలో ఉంటుంది.