గ్లూకోజ్ మానిటర్లు పనిచేసే తీరు... కొనే ముందు చూడాల్సిన అంశాలు
జీవన విధానం, తీసుకునే ఆహారం, పని ఒత్తిడి, క్రమం తప్పిన జీవన వేళలతో నేడు మధుమేహం (డయాబెటిస్) ఎంతో మందిలోకి వచ్చి చేరుతోంది. ఒక్కసారి దీని బారిన పడితే జీవితాంతం మందులు వాడుకుంటూ, ఆహార జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం తెలిసిందే. పైగా ఇన్సులిన్ తీసుకునేవారు రక్తంలో గ్లూకోజు స్థాయులను ప్రతి రోజూ గమనిస్తూ ఉండడం ఎంతో అవసరం. మందులతో నియంత్రణలో ఉంచుకున్న వారు సైతం వారానికోసారైనా పరీక్షించుకోవాలి. ప్రతి సారీ రక్త పరీక్ష కోసం ల్యాబ్ వరకు వెళ్లే పని లేకుండా ఇంట్లోనే సులభంగా చెక్ చేసుకునేందుకు ఎన్నో రకాల బ్లడ్ గ్లూకోజు మానిటర్లు అందుబాటులోకి ఉన్నాయి. వీటి గురించి తెలుసుకుందాం.
రక్తంలో గ్లూకోజు పరిమాణాన్ని బ్లడ్ గ్లూకోజు మానిటర్ల ద్వారా సులువుగా తెలుసుకోవచ్చు. రక్తంలో షుగర్ ఎంతుందో చుక్క రక్తంతో మానిటర్లు చెప్పేస్తాయి. సాధారణంగా ఈ పరికరాల్లో మూడు భాగాలుంటాయి. వేలి నుంచి రక్తాన్ని సేకరించేందుకు వీలుగా ఓ సూది ఉంటుంది. పరీక్ష కోసం వాడి పారేసే స్ట్రిప్, రక్తంలో షుగర్ ఎంతుందో తెలియజేసే మానిటర్ ఉంటుంది. ముందుగా మానిటర్ కు తాజా టెస్ట్ స్ట్రిప్ ను అటాచ్ చేయాలి. సూదితో వేలిపై గాటు పెట్టడం ద్వారా ఓ చుక్క రక్తాన్ని టెస్ట్ స్ట్రిప్ పై సేకరించాలి. అనంతరం రక్తంలో షుగర్ ఎంతుందన్నదీ సెకండ్లలోనే మానిటర్ లో స్కోరు కనిపిస్తుంది.
షుగర్ ఎంతున్నదీ ఆటోమేటిక్ గా ఎలా తెలుస్తుంది?
టెస్ట్ స్ట్రిప్ పై రక్తపు బొట్టు పడిన వెంటనే అక్కడ రసాయనిక చర్యలు జరుగుతాయి. రక్తంలో ఉన్న గ్లూకోజు, టెస్ట్ స్ట్రిప్ పై ఉన్న గ్లూకోజు ఆక్సిడేస్ మధ్య చర్య కారణంగా ఫెర్రోసైనైడ్ అనే సాల్ట్ విడుదల అవుతుంది. దాన్నుంచి విద్యుత్ శక్తి గ్లూకోజు మానిటర్ కు ప్రసారం అవుతుంది. ఈ కరెంటు స్థాయులను బట్టి రక్తంలో షుగర్ ఎంతుందో మానిటర్ లో కనిపిస్తుంది.
ఫలితాలు 100 శాతం కచ్చితమేనా...?
బ్లడ్ గ్లూకోజు మానిటర్లన్నీ ఒకే విధమైన టెక్నాలజీతో పనిచేస్తుంటాయి. ఎంత మంచి పరికరమైనా ప్రతికూలతలు లేకపోలేదు. ఈ మానిటర్లలో చూపించే రీడింగ్ కచ్చితమైనది కాదన్న సందేహాలు ఉన్నాయి. ల్యాబ్ లలో నిర్వహించే పరీక్షల్లో వచ్చే ఫలితాలకు, ఈ మానిటర్లలో వచ్చే ఫలితాలకు మధ్య 10 శాతం వరకు తేడా ఉండవచ్చని నిపుణుల అంచనా. అయినప్పటికీ డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు సులువుగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తెలుసుకునేందుకు ఈ పరికరాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఒకవేళ ఫలితాల్లో కొంత శాతం తేడా చూపించినా... రక్తంలో షుగర్ పరిమాణం సుమారుగా ఎంతుందన్నది తెలుస్తుంది. దాంతో తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి వీలవుతుంది.
ఉష్ణోగ్రత, తేమశాతం కూడా పరీక్షా ఫలితాలను తారుమారు చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయి. టెస్ట్ స్ట్రిప్ అధిక ఉష్ణోగ్రతలకు ప్రభావితం అయితే ఫలితాలు కచ్చితంగా ఉండకపోవచ్చు. అందుకే గ్లూకోజు మానిటర్ ను వాడే ముందు అందులో ఇచ్చిన సూచనలను చదవాలి. పరీక్ష కంటే ముందు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. వేలిపై మాత్రమే కాకుండా ముంజేయి, తొడ భాగాల నుంచి సేకరించిన రక్తంతోతోనూ పరీక్ష చేసుకునే వీలు కొన్ని పరికరాల్లో ఉంటోంది. రోజూ పరీక్ష చేసుకోవాల్సిన వారు వేలిపై సూది పోట్లతో ఇబ్బంది అనిపిస్తే వీటిని వాడుకోవచ్చు. అయితే, వేలి నుంచి సేకరించిన రక్తపు బొట్టుతోనే ఫలితాల్లో కచ్చితత్వం ఎక్కువగా ఉంటుందని వెల్లడైంది.
కొనుగోలుకు ముందు...
గ్లూకోజు మానిటర్ వాడుకునే వారు తరచుగా టెస్ట్ స్ట్రిప్ లు, సూదులను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కొన్ని కంపెనీల టెస్ట్ స్ట్రిప్ లు అధిక ధర కలిగి ఉంటాయి. మానిటర్ కొనే ముందు ఈ విషయాన్ని గమనించాలి. అలాగే, వందలాది రీడింగ్స్ ను సేవ్ చేసి ఉంచే స్మార్ట్ మానిటర్లు నేడు మార్కెట్లో ఉన్నాయి. వీటివల్ల వైద్యుల వద్దకు వెళ్లినప్పుడు రీడింగ్స్ ను చూపేందుకు వీలవుతుంది. మానిటర్ నుంచి కంప్యూటర్ కు డేటా బదిలీ చేసుకునే సౌకర్యం కొన్నింటిలో ఉంది.
అలాగే, కంటి చూపు సరిగా లేని వారి కోసం రీడింగ్ ను పైకి వాయిస్ రూపంలో చెప్పేవి కూడా వస్తున్నాయి. ఇలాంటి ఫీచర్లను బట్టి మానిటర్ల ధర మారుతుంది. మానిటర్ పట్టుకునేందుకు అనువుగా ఉందా, అక్షరాలు కనిపించే స్థాయిలో ఉన్నాయా? అన్నది కూడా కొనుగోలుకు ముందు పరిశీలించాలి. ఎంత రక్తం అవసరం, పరీక్షా సమయం వివరాలు కూడా ప్రొడక్ట్ బాక్స్ పై రాసి ఉంటాయి. వీటిని సైతం గమనించాలి. కొన్ని పరికరాల్లో టెస్ట్ స్ట్రిప్ లను అటాచ్ చేసేందుకు కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ కోడ్ తప్పుగా ఎంటర్ చేస్తే రీడింగ్ కచ్చితత్వం మారిపోతుంది. ఇలాంటివేమైనా ఉన్నాయేమో కొనేముందు విచారించుకోవాలి.
రెండు మూడు నెలలకు ఒకసారైనా ల్యాబ్ లో పరీక్ష చేయించుకుని, ఆ వెంటనే గ్లూకోజ్ మానిటర్ ద్వారానూ పరీక్షించుకుని ఫలితాలను పరిశీలిస్తే గ్లూకోజు మానిటర్ పనితీరు గురించి తెలుస్తుంది.
అందుబాటు ధరల్లో ఉత్తమ పనితీరు గలవి
వన్ టచ్ సెలక్ట్ సింపుల్ గ్లూకోమీటర్. దీన్ని జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తయారుచేస్తోంది. దీనిలో బటన్లు, కోడింగ్ ఇబ్బందుల్లేవు. టెస్ట్ స్ట్రిప్ ను మానిటర్ కు అటాచ్ చేసి దానిపై రక్తపు చుక్క వేస్తే రీడింగ్ ఎంతుందో చెప్పేస్తుంది. ఇందులో గ్లూకోజు ఎక్కువ, తక్కువ నమోదైన సందర్భాల్లో అలార్మ్ హెచ్చరిక ఆప్షన్ ఉంది. వాడుక ఎంతో సులభం. దీని ధర 750 రూపాయలకు పై నుంచి 1200 రూపాయల వరకు ఉంది. వివిధ రకాల ఆన్ లైన్ సైట్లను పరిశీలించడం ద్వారా తక్కువగా కొనుగోలు చేసుకోవచ్చు. 50 టెస్ట్ స్ట్రిప్ ల ధర సుమారు 800 రూపాయలుగా ఉంది. 10 స్టెరిల్ సూదులు మెషిన్ తో పాటు ఉచితంగా లభిస్తాయి.
వన్ టచ్ అల్ట్రా ఈజీ. ఇది జేబులో పెన్నులా ఇమిడిపోతుంది. 500 రీడింగ్ లు స్టోర్ అయి ఉంటాయి. వీటిని కంప్యూటర్ కు బదిలీ చేసుకోవచ్చు. ఐదు సెకండ్లలో ఫలితాన్ని చూపిస్తుంది. జీవితకాలం రీప్లేస్ మెంట్ కు కంపెనీ గ్యారంటీ ఇస్తోంది. ధర సుమారు 1600 రూపాయల వరకు ఉంది.
ఆక్యూచెక్ యాక్టివ్. రోషే కంపెనీకి చెందిన ఈ పరికరం క్లిక్స్ మోషన్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. ఐదు సెకన్లలోపే ఫలితాన్ని చూపిస్తుంది. ఏడాది వారంటీతో లభించే దీని ధర సుమారు 1450 రూపాయలు. 100 టెస్ట్ స్ట్రిప్ ల ధర రూ.1400 వరకు ఉంది.
డాక్టర్ మోర్పెన్ ఒన్ బీజీ-02. ఈ మానిటర్ బయోసెన్సార్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. ఏడు సెకన్లలో ఫలితాన్ని చెప్పేస్తుంది. మెషిన్ తో పాటు రోజువారీ పరీక్షా ఫలితాలను నమోదు చేసుకునేందుకు లాగ్ బుక్, పది లాన్సెట్స్ (సూదులు), పది టెస్ట్ స్ట్రిప్ లు కూడా ఉచితంగా లభిస్తాయి. దీని ధర సుమారుగా రూ.650 రూపాయల వరకు ఉండగా... 50 టెస్ట్ స్ట్రిప్ ల ధర 800 రూపాయల వరకు ఉంది. ఆక్యూచెక్ అవివా కనెక్ట్ మానిటర్ అయితే బ్లూటూత్ ద్వారా స్మార్ట్ ఫోన్ ను కనెక్ట్ చేసుకోవచ్చు. రీడింగ్ వివరాలన్నీ ఫోన్ లో ప్రత్యక్షమవుతాయి.
బ్యాటరీలు మార్చుకుంటూ ఉండాలి
గ్లూకోజు మానిటర్లన్నీ కూడా బ్యాటరీ ఆధారంగా పనిచేస్తుంటాయి. డిస్ ప్లే సరిగా కనిపించని సందర్భాల్లో బ్యాటరీ పవర్ అయిపోయిందని భావించి వాటిని మార్చి చూడండి. ఏ అర్ధరాత్రో పరీక్ష చేసుకోవాల్సిన అవసరం రావచ్చు. అప్పుడు మానిటర్ ను బయటకు తీసి చూస్తే బ్యాటరీల్లో పవర్ అయిపోయి ఉండవచ్చు. అందుకని స్పేర్ సెట్ ఇంట్లో ఉంచుకోవడం ఇబ్బందులను తప్పిస్తుంది.
కాల వ్యవధి
టెస్ట్ స్ట్రిప్ లకు కాలపరిమితి (ఎక్స్ పయిరీ) ఉంటుంది. సాధారణంగా తయారు చేసిన తేదీ నుంచి ఏడాది పాటు ఈ కాల వ్యవధి ఉంటుంది. కాల వ్యవధి తర్వాత వినియోగిస్తే ఫలితాలు కచ్చితంగా ఉంటాయన్న హామీ లేదు. కొనుగోలు చేస్తున్న తేదీ నుంచి కాల వ్యవధి తీరి పోవడానికి ఇంకా ఎన్ని రోజులుందో చూసుకోవాలి. ఎందుకంటే... 50 స్ట్రిప్ ల ప్యాక్ ను కొనుగోలు చేయడానికి ఫార్మసీ స్టోర్ కు వెళ్లారనుకుందాం. మరో రెండు నెలల్లో గడువు తీరే ప్యాక్ ను షాపు వాడు చేతిలో పెట్టాడు. మరి రెండు నెలల కాలంలో 50 స్ట్రిప్ లు ఖర్చవుతాయా...? ఆలోచించి తీసుకోవాలి.
కాల వ్యవధి తీరితే ఫలితాలు ఎలా ఉంటాయన్న సందేహం కొందరిలో వస్తుంది. ఉదాహరణకు మీ దగ్గర ఓ ఐదు టెస్ట్ స్ట్రిప్ లు ఉన్నాయి. వాటి గడువు జూలై 30, 2016తో తీరిపోతుంది. అంటే జూలై 30 తర్వాత అది పనిచేయదనా...? జూలై 30న కచ్చితమైన ఫలితాలను చూపించి మరుసటి రోజుకు ఫలితాలు మారిపోతాయా..? లేదు. ఒక్కరోజులో మారిపోయేదేమీ లేదు. వాస్తవానికి మరికొన్ని రోజులు పనిచేసే అవకాశం ఉన్నప్పటికీ ఎక్సపయిరీ తేదీని తగ్గించే వేస్తారు. కనుక గడువు తీరిన తర్వాత రెండు మూడు రోజులైనా ఫర్వాలేదు. కానీ మరీ ఓ పది పదిహేను రోజుల తర్వాత వాడకపోవడమే ఉత్తమం.