పేరు మార్చుకోవాలనుందా...?

చిన్నప్పుడు స్కూల్ మాస్టారి కారణంగా పేరులో తప్పు దొర్లిందా...? పెద్దలు పెట్టిన పేరు బోర్ కొట్టేసిందా...? ప్రస్తుతమున్న పేరు కలసి రావడం లేదనుకుంటున్నారా...? కారణమేదైతేనేమి పేరు మార్చుకోవడం సులభమే.

తమ పేరు మార్చుకోవడం కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుగా జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు రెండు పాస్ పోర్ట్ సైజు కలర్ ఫొటోలు, గెజిటెడ్ అధికారి జారీ చేసిన పౌరసత్వ ధ్రువీకరణ పత్రాలు రెండు కాపీలు అవసరం. ప్రస్తుత పేరు, కొత్త పేరు, పేరు ఎందుకు మార్చదలుచుకున్నదీ నిర్ధిష్ట కారణాన్ని పేర్కొంటూ ఓ అఫిడవిట్ ను దరఖాస్తుకు జతచేయాలి. రూ.10 లేదా రూ.20ల నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్ పై అఫిడవిట్ చెల్లుబాటు అవుతుంది. దీన్ని నోటరీతో అటెస్టేషన్ చేయించాలి.

పోలీసుల ధ్రువీకరణ

ఒకటి నుంచి పదో తరగతి వరకు అన్ని విద్యార్హతల ధ్రువీకరణ పత్రాల నకలు కాపీలను గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించాలి. నిరక్షరాస్యుడు అయితే అతడి పేరు, వయసు తదితర వివరాలను తెలియజేసే రేషన్ కార్డు, వోటర్ ఐడీ, విద్యుత్తు బిల్లు, వాటర్ బిల్లు వీటిలో ఏదైనా ఒక దాని కాపీని కూడా గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించి సమర్పించాల్సి ఉంటుంది. గత ఐదేళ్ల కాలంలో పోలీసుల రికార్డులకు ఎక్కలేదంటూ వారు నివసించే ప్రాంత పోలీసు స్టేషన్ నుంచి ధ్రువీకరణ పత్రాన్ని తీసుకోవాలి. పేరు కలసి రావడం లేదనుకుంటే జ్యోతిషుల నుంచి సర్టిఫికెట్ తీసుకుని సమర్పించాలి. వీటిని జిల్లా కలెక్టర్ పరిశీలించి అన్నీ సవ్యంగా ఉన్నట్టు భావిస్తే పేరు మారుస్తూ ఆదేశాలు వెలువరిస్తారు. 

గెజిట్ లోనూ ప్రచురించాలి

తర్వాత పేరు మార్పునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ గెజిట్ (ప్రభుత్వ సమాచార పత్రిక)లో ప్రకటన జారీ కోసం ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ కమిషనర్ కు దరఖాస్తు చేసుకుని నిర్ణీత ఫీజు చెల్లించాలి. పేరు మారుస్తూ కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వుల కాపీని అందించాలి. ఒకవేళ తమ స్వరాష్ట్రంలో గెజిట్ అందుబాటులో లేకపోతే భారత ప్రభుత్వ గెజిట్ లో ప్రకటన జారీకి దరఖాస్తు చేసుకోవాలి. 

కనీసం రెండు ప్రముఖ స్థానిక దినపత్రికల్లో సైతం పేరు మార్పునకు సంబంధించిన ప్రకటనలు ఇవ్వడం మంచిది. ఈ ప్రకటనకు సంబంధించి ఆధారాలు కూడా దగ్గర ఉంచుకోవడం నయం. ఎందుకంటే దినపత్రికల్లో పేరు మార్పునకు సంబంధించిన ప్రకటన చూసిన వారు తమకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు అవకాశం ఉంటుంది. పేరు మార్పు విషయమై సాధారణంగా ఎలాంటి అభ్యంతరాలు ఎదురుకావు. మైనర్ పేరు మార్చాలనుకుంటే వారి తరఫున తల్లిదండ్రులు లేదా సంరక్షకులు దరఖాస్తు చేసుకోవాలి. మిగతా విధానం అంతా పెద్దల పేరు మార్పు మాదిరిగానే ఉంటుంది. 

ఎన్ఆర్ఐ లకు

representational imageఒకవేళ పేరు మార్చుకునే వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి అయితే కలెక్టర్ ద్వారా ఉత్తర్వులు పొందాల్సిన పనిలేదు. నాన్ జ్యుడీషియల్ స్టాంపు పేపరు (రూ.5)పై సహచర ఉద్యోగులు ఇద్దరితో సాక్షి సంతకాలు చేయించి దాన్ని ప్రభుత్వ గెజిట్ లో ప్రచురణ కోసం గాను దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఓ ప్రముఖ ప్రాంతీయ దిన పత్రికలోనూ సంబంధిత పత్రాన్ని ప్రచురించాలి. ఒకవేళ ఎన్ఆర్ఐలు తమ పేరు మార్చుకోవాలని భావిస్తే వారు తమ దరఖాస్తును భారతీయ ఎంబసీ లేదా హైకమిషన్ అటెస్టేషన్ తో హోంశాఖకు పంపాలి. పేరు మార్పునకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడం తెలియదని భావిస్తే న్యాయవాది సాయం పొందవచ్చు. 

మారిన తర్వాత...

ఒక్కసారి పేరు మారిస్తే పని అయిపోయినట్టు కాదు. తర్వాత ఆ సమాచారాన్ని అవసరమైన వారికి తెలియజేయడం తప్పనిసరి. ఉదాహరణకు ఉద్యోగులు అయితే ఆ విషయాన్ని తన కార్యాలయంలో ఉన్నతాధికారికి తెలియజేయాలి. సర్వీసు రిజిస్టర్ లో నూతన పేరును నమోదు చేయించుకోవాలి. పేరు మారింది కనుక సమీపంలోని పోస్టాఫీసు లేదా పోస్ట్ మ్యాన్ కు కూడా సమాచారం అందించాలి. అలాగే రవాణా శాఖ (డ్రైవింగ్ లైసెన్స్, వాహనాలు కలిగి ఉంటే), పన్ను అధికారులకు కూడా తెలియపరచాలి. పాస్ట్ పోర్టు కార్యాలయానికి వెళ్లి పేరు మార్పించుకోవాలి.

వివాహం అనంతరం మహిళ ఇంటి పేరు భర్త ఇంటి పేరుగా స్థిరపడడం మన దేశంలో సాధారణం. తన మెట్టినింటి వారి పేరును తన ఇంటి పేరుగా సర్టిఫికెట్లలో మార్చుకోవాలని మహిళలు భావిస్తే వివాహ నమోదు పత్రం లేదా భర్తతో కలసి సంయుక్తంగా అఫిడవిట్ ను సమర్పించాల్సి ఉంటుంది.

ఇలా అయితే కుదరదు

అప్పులు చేసి పేరు మార్చుకుని పరారవుదామనుకుంటే కుదరదు. నేరపూరిత ఆలోచనల్లో భాగంగా పేరు మార్పునకు అవకాశం లేదు. ప్రముఖుల పేర్లను పెట్టేసుకుని గందరగోళానికి గురి చేయాలనుకుంటే వీల్లేదు. సంఖ్యలు, విరామ చిహ్నాలతో గందరగోళంగా పేరు పెట్టుకుంటానంటే అవకాశం లేదు.


More Articles