ఎక్కువ సేపు కూర్చోలేరా.. కాళ్లు కదిలించకుండా ఉండలేరా.. రెస్ట్ లెస్ లెగ్ సిండ్రోమ్ కావచ్చు

కొద్దిసేపు కూడా కుదురుగా కూర్చోలేకపోవడం.. కాళ్లు అటూ ఇటూ కదిలిస్తుండడం.. నిద్రపోయినా కాళ్లు కదిలిస్తూనే ఉండడం.. అటూ ఇటూ తిరిగి పడుకుంటూ కాళ్లు ముడుచుకోవడం.. కాళ్లు కదపకుండా ఉంటే ఏదో అసౌకర్యంగా, ఒక్కోసారి నొప్పిగా కూడా ఉండడం.. కాళ్లు కదపగానే ఈ ఫీలింగ్ తగ్గిపోయి కాసేపు కదలకుండా ఉంటే మళ్లీ రావడం.. ఇవన్నీ ‘రెస్ట్ లెస్ లెగ్ సిండ్రోమ్’ లక్షణాలు. ఇది నాడీ సంబంధిత రుగ్మత. చాలా మంది దీనితో బాధపడుతున్నా.. తమకు ఈ రుగ్మత ఉందని గుర్తించలేరు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ఇబ్బంది పెడుతున్న ఈ సిండ్రోమ్ కారణంగా నిద్రలేమి, కాళ్ల నొప్పులు, కుదురుగా కూర్చుని పనిచేయలేకపోవడం వంటి ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. కొన్ని జాగ్రత్తలు, మందుల ద్వారా దీని నుంచి సులువుగానే బయటపడొచ్చు. అసలు ఈ రుగ్మత ఎందుకు వస్తుంది, లక్షణాలు, సమస్యలు, చికిత్స గురించి తెలుసుకుందాం..

లక్షణాలు ఇవీ..representational image

కూర్చున్నా.. పడుకున్నా కూడా కాళ్లు కదిలిస్తూ ఉండడం ఈ రుగ్మత ప్రాథమిక లక్షణం. ఇది ఎంత తీవ్రంగా ఉంటుందంటే కాళ్లు కదిలించకుండా కనీసం 5 - 10 నిమిషాల పాటు కూడా ఉండలేరు. పడుకున్నా కూడా నిద్రలో అటూ ఇటూ దొర్లుతూ కాళ్లు కదిలిస్తుంటారు. పక్క మీద తిరిగి కాళ్లు ముడుచుకుని పడుకుంటారు. కొద్ది సేపటికే మరోవైపు తిరుగుతారు. ముఖ్యంగా రాత్రిపూట సరిగా నిద్ర పట్టదు. తెల్లవారుతుండగా నిద్ర పోతారు. కాళ్లు కదిలించకుంటే ఏదో అసౌకర్యంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కాళ్లు లాగుతున్న భావన ఉంటుంది. కొందరిలో దురద, మంట లాంటివి కూడా ఉంటాయి. కాళ్లు కదిలించగానే ఈ అసౌకర్యపు భావన తగ్గిపోతుంది. కొద్దిసేపు కదలకుండా కూర్చుంటే.. మళ్లీ మొదలవుతుంది. తొలుత అసౌకర్యంగా, ఇబ్బందిగా మొదలయ్యే ఈ రుగ్మత కొందరిలో నొప్పిగా కూడా మారుతుంది. సాధారణంగా ‘ఆర్ఎల్ఎస్’ సిండ్రోమ్ కాళ్లు, నడుము కింది భాగంలోనే కనిపించినా... భుజాలు, తల భాగంలోనూ ప్రభావం చూపొచ్చు. కొన్నిసార్లు శరీరంలో ఒకవైపే ప్రభావం ఉంటుంది. ఈ రుగ్మత పురుషుల్లో కంటే స్త్రీలలో మరింత ఎక్కువగా కనిపిస్తుంది. ఒకే రుగ్మత అయినా వివిధ దశలుగా ఉండి.. తీవ్ర సమస్యగా పరిణమిస్తుంది.

ఎందుకు వస్తుంది?

representational imageవాస్తవానికి ఈ రెస్ట్ లెస్ లెగ్ సిండ్రోమ్ ఎందుకు వస్తుందనేదానికి కచ్చితమైన నిర్ధారణ ఏదీ లేదు. అయితే ముఖ్యంగా ఐరన్ లోపం, శరీరంలో డోపమైన్ ఉత్పత్తి తగ్గిపోవడంతోపాటు జన్యు పరమైన కారణాలతో వారసత్వంగా వచ్చే అవకాశమున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ సిండ్రోమ్ తో బాధపడుతున్నవారిలో ఐరన్ లోపం ఉన్నట్లుగా వారు గుర్తించారు. ముఖ్యంగా కండరాలు సరిగా పనిచేయడానికి తోడ్పడే న్యూరోట్రాన్స్ మిటర్ (నాడీకణాల్లో సమాచార ప్రసారానికి తోడ్పడే రసాయనం) డోపమైన్ ను ఉత్పత్తి చేసే కణాల్లో ఐరన్ లోపం ఉన్నట్లు జాన్ హాప్కిన్స్ శాస్త్రవేత్తలు తేల్చారు. డోపమైన్ లోపం వల్ల మెదడులోని దానిని వినియోగించుకునే బాసల్ గంగ్లియా పనితీరు దెబ్బతింటుందని ‘అమెరికన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూరోలాజికల్ డిజార్డర్స్ అండ్ స్ట్రోక్స్ (ఎన్ఐఎన్ డీ)’ శాస్త్రవేత్తలు గుర్తించారు. కిడ్నీ సమస్యలు, మధుమేహం, నాడీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారిలో ఆర్ఎల్ఎస్ లక్షణాలు కనిపిస్తాయి. కాఫీ, టీలు ఎక్కువగా తాగడం, ఆల్కహాల్, ధూమపానం, పొగాకు ఉత్పత్తుల వినియోగం కూడా ఆర్ఎల్ఎస్ కు కారణమవుతుంది. యాంటీ డిప్రెసెంట్, జలుబు, అలర్జీలకు వినియోగించే మందులు కూడా ఆర్ఎల్ఎస్ లక్షణాలను పెంచుతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. 

పొరపాటు పడొద్దు..

‘హైపర్ యాక్టివిటీ డిజార్డర్ (ఏ పని అయినా తొందరగా, వేగంగా చేసేయడం, ఎప్పుడూ చాలా యాక్టివ్గా ఉండడం, వేగంగా నడవడం, దేనికైనా అత్యంత వేగంగా స్పందించడం వంటి లక్షణాలుండే రుగ్మత)’తో బాధపడుతున్న వారు కూడా అస్తమానం కాళ్లు, చేతులు ఊపుతూ, కదిలిస్తూ ఉంటారు. వారు కూడా కదలకుండా ఒకేచోట కూర్చోలేరు. ఈ డిజార్డర్,రెస్ట్ లెస్ లెగ్ సిండ్రోమ్ (ఆర్ఎల్ఎస్) వేర్వేరనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. హైపర్ యాక్టివిటీని ఆర్ఎల్ఎస్గా పొరపడొద్దు.

ఎన్ని రకాలున్నాయి?

సాధారణంగా ‘ప్రైమరీ రెస్ట్ లెస్ లెగ్ సిండ్రోమ్’ ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇది వంశపారంపర్యంగా వస్తుందని.. దీనికి ఓ జన్యువే కారణమని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ఈ జన్యువు ఉన్నవారందరికీ రుగ్మత కచ్చితంగా వస్తుందని చెప్పలేమని చెబుతున్నారు. ఇక పలు వ్యాధులు, వాటికి ఉపయోగించే మందుల కారణంగా, ఒత్తిడి, వాతావరణ కాలుష్యం వంటి కారణాల వల్ల వచ్చేది ‘సెకండరీ రెస్ట్ లెస్ సిండ్రోమ్’. ఇక గర్భిణుల్లో హార్మోన్ల హెచ్చుతగ్గుల కారణంగా ఆర్ఎల్ఎస్ రుగ్మత కనిపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా డెలివరీకి ముందు ఈ లక్షణాలు ఉంటాయి. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కొద్దిరోజుల్లోనే ఇది తగ్గిపోతుంది.

ఆర్ఎల్ఎస్ ను ఎలా నిర్ధారించవచ్చు?representational image

లక్షణాల ఆధారంగా  రెస్ట్ లెస్ లెగ్ సిండ్రోమ్ ను గుర్తించడం సులభమే. కాళ్లు కదపకుండా కనీసం ఐదు, పది నిమిషాలైనా కూర్చోలేకపోవడం, కాళ్లకు ఏదో అసౌకర్యంగా ఉన్న ఫీలింగ్ కలగడం, పడుకున్నప్పుడు, విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, రాత్రి పూట ఈ ఇబ్బంది మరింత ఎక్కువగా ఉండడం, కాళ్లు కదపగానే రిలీఫ్ గా ఫీలవడం వంటివాటి ఆధారంగా ఆర్ఎల్ఎస్ గా నిర్ధారించవచ్చు. ఈ లక్షణాలతోపాటు ఐరన్, విటమిన్ల లోపాన్ని గుర్తించే రక్త పరీక్షలు చేస్తారు. ఒక రాత్రంతా నిద్రించే విధానాన్ని పరిశీలించడం ద్వారా ఈ రుగ్మతను కచ్చితంగా నిర్ధారించవచ్చు. దీనిని పాలీసోమ్నోగ్రఫీ అంటారు. రాత్రంతా బాధితుడి మెదడులో తరంగాలు, గుండె వేగం, శ్వాస తీరు, కాళ్ల కదలికలను పరిశీలిస్తారు. అయితే ఈ రుగ్మతతో బాధపడుతున్న వారిలో లక్షణాల తీవ్రత ఒకరికి, మరొకరికి.. ఒక రోజుకు, మరో రోజుకు చాలా విభిన్నంగా ఉండే అవకాశముంది. కొందరిలో రోజూ కాకుండా మూడు, నాలుగు రోజులకోసారి లక్షణాలు కనిపిస్తాయి. ఈ రుగ్మత తొలి దశలో ఒక్కోసారి కొన్ని వారాలు, నెలల పాటు కూడా విరామం వచ్చి.. ఆ తర్వాత మళ్లీ లక్షణాలు మొదలవుతాయి. కొంతకాలం తర్వాత లక్షణాల తీవ్రత పెరుగుతుంది.

ఎన్నో సమస్యలు

representational imageరెస్ట్ లెస్ లెగ్ సిండ్రోమ్ (ఆర్ఎల్ఎస్) కారణంగా ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. నిద్రలేమి కారణంగా అలసట, చికాకు, డిప్రెషన్ వంటి వాటికి లోనవుతారు. ఆఫీసులోనూ కుదురుగా కూర్చుని పనిచేయలేకపోవడం ఇబ్బందిగా పరిణమిస్తుంది. పనిపై శ్రద్ధ పెట్టలేకపోతారు. చేయాల్సిన పనులు మరిచిపోతుంటారు. ఈ రుగ్మత ఉన్నవారిలో 80 శాతం మంది ‘పీరియాడిక్ లింబ్ మూమెంట్ ఆఫ్ స్లీప్ (పీఎల్ఎంఎస్)’ సమస్యతో బాధపడుతుంటారు. ప్రతి 15 నుంచి 40 సెకన్లకోసారి కాళ్లు అటూ ఇటూ కదిలించడం ఈ సమస్య ప్రధాన లక్షణం. దీనివల్ల నిద్రలేమితోపాటు ఉదయం లేవగానే ఫ్రెష్ గా ఉండడానికి బదులు నీరసంగా ఉంటారు. 

ఆహారం, ఔషధాలతో చికిత్స..representational image

  • మొదట బాధితుల్లో ఆర్ఎల్ఎస్ రుగ్మతకు కారణాలేమిటనేది వైద్యులు నిర్ధారించి దానికి తగిన చికిత్స అందజేస్తారు. సమస్య మెదడులోనా, కండరాల్లోనా అన్నది గుర్తిస్తారు.
  • మధుమేహం, నాడీ సంబంధిత వ్యాధుల కారణంగా ఈ రుగ్మత వచ్చినట్లు గుర్తిస్తే అందుకు సంబంధించిన మందుల ద్వారా తగ్గించవచ్చు.
  • మెదడులో డోపమైన్ ఉత్పత్తిని పెంచేందుకు మందులు ఇస్తారు. లేదా డోపమైన్ ఉత్పత్తి పెరిగేందుకు తోడ్పడే టైరోసిన్, ఫెనైలలనైన్ వంటి అమైనో ఆమ్లాలు, విటమిన్ బీ1, బీ9 (ఫోలిక్ యాసిడ్), క్రోమియం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
  • కండరాలు, వాటిల్లోని నాడుల్లో సమస్యల కారణంగా ఆర్ఎల్ఎస్ సమస్యను తలెత్తినట్లు గుర్తిస్తే మెగ్నీషియం, పొటాషియం అందేలా మందులు, ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. కండరాలు రిలాక్స్ అయ్యేందుకు తోడ్పడే మందులూ ఇస్తారు.
  • ముఖ్యంగా ఆర్ఎల్ఎస్ తో బాధపడుతున్న వారిలో రక్త హీనత ఉండే అవకాశముంది. అందువల్ల ఐరన్ సప్లిమెంట్లు, ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

ఈ జాగ్రత్తలు పాటిస్తే ఆర్ఎల్ఎస్ నుంచి ఉపశమనంrepresentational image

  • రెస్ట్ లెస్ లెగ్ సిండ్రోమ్ తో బాధపడుతున్నవారు వారి జీవన విధానంలో పలు మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.
  • కాఫీలు, ఆల్కాహాల్, పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని బాగా తగ్గించాలి.
  • కండరాలకు విశ్రాంతి కలిగేలా, ఒత్తిడి తగ్గేలా చేసే వ్యాయామం, మసాజ్ లు, వేడి నీళ్ల స్నానం, యోగా, మెడిటేషన్ వంటి వాటితో ఆర్ఎల్ఎస్ లక్షణాల నుంచి ఉపశమనం లభిస్తుంది.
  • అతిగా వ్యాయామం చేయడం వల్ల సమస్య ఎక్కువవుతుంది.
  • కాళ్లకు ఒకసారి వేడి కాపడం, మరోసారి చల్లగా మంచుతో మర్దన చేయడం మంచిది.
  • నిద్రపోయే చోటు పూర్తి అనుకూలంగా ఉండేలా చూసుకోవాలి. రోజూ దాదాపు ఒకే సమయంలో పడుకుని, ఒకే సమయంలో మేల్కోవాలి.
  • వైద్యులు సూచించిన మందులు కచ్చితమైన వేళల్లో, కచ్చితమైన మోతాదుల్లో వాడాలి. మోతాదు ఎక్కువైనా కూడా ఈ రుగ్మత లక్షణాలు మరింతగా పెరుగుతాయి.


More Articles