ఒక కేసులో దర్యాప్తు ఎలా కొనసాగుతుంది...? అందులో ఉండే అంశాలేంటి...?
ఎఫ్ఐఆర్ నమోదయ్యాక ఒక కేసులో దర్యాప్తు ఎలా సాగుతుందన్నదానిపై చాలా మందిలో గందరగోళం ఉంటుంది. వాస్తవానికి పోలీసులకు, సామాన్య ప్రజలకు మధ్య చాలా అంతరం ఉంటుంది. పోలీసులంటే చాలా మందిలో భయం. కానీ, ఈ భయాలు అనవసరం. ప్రతి ఒక్కరికీ న్యాయం, చట్టపరమైన విషయాలపై కనీస అవగాహన ఉండాలి. ఉంటేనే అవసరమైన సందర్భాల్లో ప్రశ్నించడానికి, బాధితులకు అండగా నిలిచేందుకు అవకాశం ఉంటుంది.
పోలీస్ స్టేషన్ స్థాయిలో ఇన్ చార్జ్ బాధ్యతల్లో ఉన్న అధికారికి నేర శిక్షాస్మృతి(సీఆర్పీసీ) లోని సెక్షన్ 156 ప్రకారం విచారించతగిన నేరాల్లో (కాగ్నిజబుల్ అఫెన్స్) దర్యాప్తు చేపట్టడానికి సర్వాధికారాలు ఉన్నాయి. అలాగే, కేసు దర్యాప్తులో భాగంగా సమాచారం, ఆధారాల సేకరణ బాధ్యతలను తన కింది స్థాయి అధికారులకు సైతం అప్పగించవచ్చు. పోలీసు అధికారి దర్యాప్తులో భాగంగా విచారణకు హాజరు కావాలంటూ ఎరికైనా సమన్లు జారీచేసే అధికారాన్ని కలిగి ఉంటారు. దర్యాప్తు అధికారికి ఉండే అధికారాల గురించి సెక్షన్ 160, 175లలో పేర్కొన్నారు. దర్యాప్తు అధికారుల పరిమితులు, మార్గదర్శకాలను కోర్టు, ప్రభుత్వం సమయానుకూలంగా ఎప్పటికప్పుడు విడుదల చేస్తుంటాయి. వాటి ప్రకారం దర్యాప్తు అధికారులు నడుచుకోవాల్సి ఉంటుంది.
విచారించతగిన నేరం (కాగ్నిజబుల్ అఫెన్స్) అంటే...?
విచారించతగిన నేరాల విషయంలో పోలీసులు తమంతట తామే ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టవచ్చు. లేదా ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టవచ్చు. దర్యాప్తులో భాగంగా నిందితులను వారెంట్ లేకుండా అరెస్ట్ చేయవచ్చు. సీఆర్పీసీలోని సెక్షన్ 190 ప్రకారం మేజిస్ట్రేట్ కోర్టు ఓ కేసులో దర్యాప్తునకు ఆదేశాలు ఇవ్వగలదు. కాగ్నిజబుల్ కేసుల్లో రెండు రకాలు. బెయిలబుల్, నాన్ బెయిలబుల్.
బెయిలబుల్
బెయిల్ మంజూరుకు వీలైన కేసులను బెయిలబుల్ కేసులుగా పేర్కొంటారు. ఈ కేసుల్లో పూచీకత్తు మీద బెయిల్ మంజూరు చేస్తుంటారు. పూచీకత్తు కింద ఆస్తి లేదా నగదును పోలీసు, కోర్టుల ముందు సమర్పించాల్సి ఉంటుంది. బెయిల్ కు వీలైన నేరాల్లో నిందితులను కోర్టుల ముందు హాజరు పరచకుండానే పోలీసులు బెయిల్ మంజూరు చేయవచ్చు. ఏదేనీ కేసులో ఓ వ్యక్తిని పోలీసులు బెయిల్ పై వెంటనే విడుదల చేశారంటే అది బెయిలబుల్ నేరంగా భావించవచ్చు.
నాన్ బెయిలబుల్
ప్రత్యేక పరిస్థితులు ఉంటే తప్ప కొన్ని నేరాలకు సంబంధించిన కేసుల్లో పోలీసులు నిందితులకు బెయిల్ మంజూరు చేయడానికి అవకాశం లేదు. నాన్ బెయిలబుల్ కేసుల్లో నిందితులను 24 గంటల్లోగా సమీప జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచాలన్నది నిబంధన. నిందితుడిని కోర్టు వరకు తీసుకురావానికి అయ్యే సమయానికి మినహాయింపు ఉంటుంది. కోర్టు ముందు నిందితుడిని హాజరు పరిచిన తర్వాత బెయిల్ మంజూరు చేయవచ్చు. లేదా పోలీసు కస్టడీకి లేదా జ్యూడీషియల్ రిమాండ్ కు తరలించవచ్చు. కాగ్నిజబుల్ అఫెన్స్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్, బెయిలబుల్, నాన్ బెయిలబుల్ నేరాలు ఏవేవి అన్నవి తెలుసుకునేందుకు ఈ లింక్ చూడవచ్చు. http://ecourts.gov.in/sites/default/files/classification.pdf
పోలీసు రిమాండ్
పోలీసు రిమాండ్ అంటే చాలా మందిలో ఏదో భయం ఉంటుంది. హింస, వేధింపులు ఉంటాయన్నదే ఈ ఆందోళనకు కారణం. కానీ ఇది నిజం కాదు. చట్ట ప్రకారం రిమాండ్ లో ఉన్న నిందితుడ్ని వేధించరాదు, హింసించరాదు. ఒకవేళ హింసిస్తే అది దర్యాప్తు అధికారులపై కేసు అవుతుంది. నిందితుడిని పోలీసుల రిమాండ్ కు పంపడం అన్నది ఆ కేసు దర్యాప్తులో భాగంగా తగిన వివరాలు సేకరించి విచారణ పూర్తి చేసేందుకు వీలుగా అధికారులకు వీలు కల్పించే ప్రక్రియ. రిమాండ్ సమయంలో పోలీసు స్టేషన్ లాకప్ లో ఉంచుతారు. గరిష్టంగా 14 రోజుల పాటు కోర్టు అనుమతి మేరకు నిందితుడిని పోలీసులు రిమాండ్ (తమ స్వాధీనం)లోకి తీసుకుంటారు.
పోలీసుల థర్డ్ డగ్రీ...?
నిందితుడిని అరెస్ట్ చేయడాన్ని ఫస్ట్ డిగ్రీగా, జైలుకు పంపడాన్ని సెకండ్ డిగ్రీగా పేర్కొంటారు. నిందితుడిని తమ కస్టడీలో భాగంగా పోలీసులు విచారించడాన్ని థర్డ్ డిగ్రీగా చెబుతారు. పోలీసుల థర్డ్ డిగ్రీ పేరు చెబితే నిందితుల వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే థర్డ్ డిగ్రీ విచారణలో భాగంగా పోలీసులు నిందితుల పట్ల కటువుగా వ్యవహరించడం, శారీరక, మానసిక వేధింపులు, క్రూరమైన పద్ధతులను ఆచరిస్తుంటారని వాటిని ఎదుర్కొన్న బాధితులు చెబుతుంటారు. వాస్తవానికి చట్టంలోని నిబంధనల ప్రకారం పోలీసులు నిందితుడిని కొట్టరాదు. కానీ, ఇది ఎంతమాత్రం అమలవుతుందో తెలిసిందే.
విచారణలో భాగంగా నిందితుల నుంచి కేసుకు సంబంధించిన వాస్తవాలను రాబట్టేందుకు పోలీసులు క్రూరంగా వ్యవహరిస్తుంటారు. ఎలాంటి చర్యలు అనేదానికి బాధితులు మానవ హక్కుల కమిషన్లు, మీడియా ముందు, కోర్టు ముందు వ్యక్తీకరించిన వాస్తవాల ప్రకారం చూస్తే... లాఠీతో తీవ్రంగా దండించడం, గాయాలపై కారం చల్లడం, గోళ్లను లోతుగా కత్తిరించడం, సూదులతో గుచ్చడం, అంతర అవయవాల వద్ద బాధకు గురి చేసే చర్యలు, ఐస్ గడ్డలపై కూర్చోబెట్టడం, వేడి నీళ్లు కుమ్మరించడం ఇలా ఎన్నో ఉన్నాయి.
జ్యుడీషియల్ రిమాండ్/కస్టడీ
నిందితుడ్ని కోర్టులో హాజరు పరిచినప్పుడు మేజిస్ట్రేట్ జ్యూడీషియల్ రిమాండ్ కు తరలించే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటప్పుడు నిందితుడ్ని జైలుకు పంపిస్తారు. ఈ కాలంలో ప్రతి 14 రోజులు ముగిసిన తర్వాత నిందితుడ్ని తిరిగి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాల్సి ఉంటుంది. కేసు దర్యాప్తు తీరు, ఇంకా పట్టే కాలం, కేసులోని అంశాల ఆధారంగా రిమాండ్ పొడిగించడం లేదా బెయిల్ మంజూరు చేసే అవకాశాలు ఉంటాయి.
పోలీసు లాకప్ జ్యుడీషియల్ లాకప్ మధ్య తేడా ఏంటి?
పోలీసు స్టేషన్లో ఉంచితే పోలీసు లాకప్ అవుతుంది. జైల్లో ఉంచితే జ్యుడీషియల్ లాకప్ అవుతుంది. పోలీసు లాకప్ లో ఉంచితే నిందితులు పోలీసు అధికారుల నియంత్రణలో ఉంటారు. జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా జైల్లో ఉన్న నిందితులపై పోలీసు అధికారులకు ఎలాంటి నియంత్రణ ఉండదు. వారిని విచారించాలంటే కోర్టు అనుమతి పొందాల్సిందే. ఒకసారి ఒక నేరంపై నిందితుడ్ని విచారించి అతడ్ని జ్యుడీషియల్ రిమాండ్ కు పంపితే, అదే కేసులో రెండోసారి నిందితుడ్ని విచారించడానికి వీల్లేదు.
కస్టడీకి పరిమితి లేదా...?
కస్టడీ అనేది 60 నుంచి 90 రోజులకు మించరాదు. పోలీసు కస్టడీ, జ్యుడీషియల్ కస్టడీ రెండూ కలిపితే 90 రోజులకు మించరాదు. ఈ గడువు తర్వాత నిందితుడు బెయిల్ పొందడానికి అవకాశం ఉంటుంది.
విచారించతగని నేరం (నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్)
కోర్టు అనుమతి లేకుండా నాన్ కాగ్నిజబుల్ నేరాలపై దర్యాప్తు చేసే అధికారం పోలీసులకు లేదు. అలాగే, ఇటువంటి నేరాల్లో నిందితులను అదుపులోకి తీసుకునే అధికారం కూడా లేదు. ఇటువంటి నేరాల్లో ఎవరైనా ఫిర్యాదుతో వస్తే పోలీసులు రిజిస్టర్ నంబర్ 2లో నమోదు చేసుకుంటారు. రిజిస్టర్ నంబర్ 1 లో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తుంటారు. రిజిస్టర్ నంబర్ 2లో నమోదు చేసిన తర్వాత దాన్ని ధ్రువీకరిస్తూ ఓ పత్రాన్ని ఇస్తారు. దాంతో ఫిర్యాదు దారులు కోర్టును ఆశ్రయించవచ్చు.
దర్యాప్తు అంటే ఏమిటి?
అసలు దర్యాప్తు అంటే ఏమిటన్నది సీఆర్పీసీ సెక్షన్ 2 (హెచ్)లో తెలియజేశారు. ఎఫ్ఐఆర్ నమోదు తర్వాత నేరానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం, కస్టడీలోకి తీసుకుని వివరాలు, వాంగ్మూలం సేకరించడం, ఆధారాలు సేకరించి సెక్షన్ 173 ప్రకారం కోర్టులో చార్జిషీటు దాఖలు చేయడం వరకు సాగే ప్రక్రియే దర్యాప్తు క్రమం. ఈ దర్యాప్తును పోలీసు అధికారి మాత్రమే కాదు మేజిస్ట్రేట్ నియమించిన మరో వ్యక్తి అయినా నిర్వహించవచ్చు.
నేరం జరిగిన ప్రదేశానికి వెళ్లి కేసుకు సంబంధించిన వాస్తవాలు, ఇతర పరిస్థితుల గురించి తెలుసుకోవడంతోపాటు, నిందితులను అరెస్ట్ చేయడం, కోర్టులో హాజరు పరచడం, ఆధారాలు సేకరించడం, సేకరించిన ఆధారాల వాస్తవికతను నిర్ధారించుకునేందుకు అవసరమైతే నిపుణుల సాయం, ఫోరెన్సిక్ ల్యాబ్ ల సహకారం తీసుకోవచ్చు. నిందితుడితోపాటు అతడి సంబంధీకులు, సాక్షులను విచారించడం, సోదాలు నిర్వహించి కేసుకు ఆధారంగా ఉండే వస్తువులను సీజ్ చేయడం లాంటివన్నీ దర్యాప్తులో భాగంగా అధికారులు చేసే పనులు. అన్ని అంశాలతో కోర్టులో సెక్షన్ 173 ప్రకారం కేసుకు సంబంధించి చార్జిషీటు (దీన్నే చలాన్ అని కూడా అంటారు) లేదా తుది నివేదిక దాఖలు చేస్తారు. నిబంధనల మేరకు చార్జిషీటు లేకుంటే దాన్ని మేజిస్ట్రేట్ ఆమోదించకపోవచ్చు. అవసరమైతే సెక్షన్ 173(8) ప్రకారం తదుపరి విచారణకు కూడా ఆదేశించవచ్చు.
చార్జిషీటులో ఏముంటుంది...?
కేసులో పాత్రధారుల పేర్లు, నిందితులు, బాధితులు, కేసులోని పరిస్థితులతో సంబంధం ఉన్నవారి పేర్లు, కేసులో ఉన్న అంశాల మేరకు నేరం జరిగిందా, ఎవరు చేశారు, నిందితులు అరెస్ట్ అయ్యారా, అరెస్ట్ అయ్యి పూచీకత్తుపై విడుదలై ఉన్నారా, సెక్షన్ 170 కింద కస్టడీకి పంపించారా, సెక్షన్ 376, 376ఎ, 376బి, 376సి సెక్షన్ల కింద వైద్య పరీక్షల నివేదిక, సేకరించిన ఆధారాలు ఇలా అన్ని అంశాలూ చార్జ్ షీటులో ఉండాలి. చార్జిషీటు సమగ్రంగా ఉంటే దానిలోని అంశాలు, నిందితులు, సాక్షులను నేరుగా ప్రశ్నించడం, వారి వివరణ తీసుకోవడం, సాక్ష్యాధారాలను పరిశీలించి చట్టాల ప్రకారం న్యాయమూర్తి తీర్పు జారీ చేస్తారు.
యాంటిసిపేటరీ బెయిల్
నాన్ బెయిలబుల్ నేరం కింద తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని భావిస్తే నిందితులు యాంటిసిపేటరీ బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించవచ్చు. ఒకవేళ అప్పటికే నాన్ బెయిలబుల్ నేరం కింద అరెస్ట్ చేసినా యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ తో కోర్టును ఆశ్రయించి విడుదల దిశగా ఆదేశాలు పొందవచ్చు. సీఆర్పీసీలోని సెక్షన్ 438 ఇందుకు అవకాశం కల్పిస్తుంది. అయితే, కోర్టు ఆదేశాలు ఇచ్చే ముందు ఆరోపణల తీవ్రత, దరఖాస్తు దారుడి గత చరిత్రను పరిగణనలోకి తీసుకుంటుంది.
క్రిమినల్ కేసుల్లో విచారణ క్రమం
ఏదో ఒక నేరం జరిగింది. అప్పుడు బాధితులు లేదా వారి తరఫు వారి ఫిర్యాదుతో అయినా లేక స్వచ్చందంగా అయినా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. తర్వాత దర్యాప్తు ప్రారంభిస్తారు. ఆధారాలు సేకరిస్తారు. నిందితుల స్టేట్ మెంట్ తీసుకుంటారు. సాక్షులను ప్రశ్నిస్తారు. వారి నుంచి వివరాలను తీసుకుని నమోదు చేసుకుంటారు. అవసరం అనుకుంటే ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాల కచ్చితత్వం, ధ్రువీకరణ విషయంలో నిపుణుల సాయం తీసుకుంటారు. దర్యాప్తు పూర్తి చేసి నేరానికి సంబంధించి ఓ స్పష్టతకు వస్తారు. చార్జిషీటు రూపొందించి మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడతారు.
చార్జిషీటును మేజిస్ట్రేట్ పరిగణనలోకి తీసుకుని అభియోగాలను నమోదు చేస్తే విచారణ మొదలవుతుంది. ఆధారాలను మేజిస్ట్రేట్ పరిశీలిస్తారు. సాక్షులను నిందితుల తరఫు న్యాయవాది క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. నిందితుడిని మేజిస్ట్రేట్ ప్రశ్నిస్తారు. నిందితుడు తనను సమర్థించుకుంటూ ఏవైనా ఆధారాలు సమర్పిస్తే సాక్షులను ప్రాసిక్యూషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తుంది. తర్వాత వాదోపవాదాలు నడుస్తాయి. ఇక్కడ దర్యాప్తు అధికారి వైపు నుంచి ప్రాసిక్యూషన్ లాయర్ వాదనలు వినిపిస్తారు. నిందితుల తరఫున వాదనలు వినిపించే వారిని డిఫెన్స్ లాయర్ అంటారు. వాదనల అనంతరం కోర్టు నిర్ణయాన్ని ప్రకటిస్తుంది. నిర్దోషులుగా ప్రకటిస్తే నిందితులు విడుదల అవుతారు. దోషులుగా ప్రకటిస్తే దానిపై వాదనలు ఉంటాయి. తర్వాత తీర్పు జారీ అవుతుంది. దానిపై సెషన్స్/హైకోర్టు/సుప్రీంకోర్టుల్లో అప్పీలుకు వెళ్లవచ్చు. కోర్టు అభియోగాలను నమోదు చేయగానే నిందితులు వాటిపై ఉన్నత న్యాయస్థానంలో రివిజన్ పిటిషన్ దాఖలు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఒకవేళ దర్యాప్తు అనంతరం ఎలాంటి నేరం జరగలేదని పోలీసు అధికారి భావిస్తే కేసు మూసివేత నివేదికను మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడతారు.
నేరం జరిగిన తర్వాత దానిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి తిరస్కరిస్తే బాధితులు లేదా వారి తరఫు వారు కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు. కోర్టు ఆదేశిస్తే ఆ మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. తర్వాత ప్రక్రియ అంతా పైన చెప్పుకున్న క్రమంలోనే సాగుతుంది. ఎఫ్ఐఆర్ స్వచ్చందంగా నమోదు చేసినా లేక కోర్టు ఆదేశాల మేరకు నమోదు చేసినా... యాంటిసిపేటరీ బెయిల్ కోసం పోలీసుల నిర్బంధంలో ఉన్న వారు సెషన్స్ కోర్టులో దాఖలు చేస్తే కోర్టు కేసులోని అంశాల ఆధారంగా నిర్ణయం వెలువరిస్తుంది. యాంటిసిపేటరీ బెయిల్ కు తిరస్కరిస్తే హైకోర్టుకు అక్కడా ఫలితం లేకుంటే, సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు.
ఇక ఎఫ్ఐఆర్ నమోదు అయిన తర్వాత దర్యాప్తు అధికారి కేసులోని అంశాల ఆధారంగా నిందితులను అరెస్ట్ చేస్తారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు తమ కస్టడీలోకి తీసుకోవడం లేదా జ్యుడీషియల్ కస్టడీకి పంపడం చేస్తారు. కస్టడీకి పంపుతూ ఆదేశాలు జారీ అయితే బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు. బెయిల్ అభ్యర్థన తిరస్కరణకు గురైతే దానిపై ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. అన్ని చోట్లా తిరస్కరణకు గురైత కస్టడీలోనే ఉండాల్సి వస్తుంది. బెయిల్ మంజూరైతే నిందితులు విడుదల అవుతారు. ఇక ఎఫ్ఐఆర్ నమోదు అయితే దాన్ని రద్దు చేయాలని కోరుతూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు క్వాషింగ్ పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశం ఉంటుంది. కేసు ఎఫ్ఐఆర్ ను పరిశీలించి మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేస్తారు.
నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే కోర్టులో పిటిషన్
నాన్ కాగ్నిజబుల్ కేసుల్లో బాధితులు కోర్టులో నిందితులకు వ్యతిరేకంగా క్రిమినల్ కంప్లయింట్ దాఖలు చేసుకోవచ్చు. కోర్టు నేరాన్ని పరిశీలించి విచారణ చేపడుతుంది. ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని భావిస్తే నిందితులను హాజరు కావాలని సమన్లు జారీ చేస్తుది. నిందితులు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకుంటే బెయిల్ మంజూరు చేయవచ్చు. ఆ తర్వాత ఈ కేసులో కోర్టు విచారణ మొదలవుతుంది.
భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ), నేర శిక్షాస్మృతి మధ్య తేడా
ఐపీసీలో నేరాలకు విధించే శిక్షల గురించి పేర్కొన్నారు. సీఆర్పీసీ అనేది క్రిమినల్ కేసుల్లో అనుసరించే దర్యాప్తు, విచారణ ప్రక్రియను తెలియజేస్తుంది. క్రిమినల్ కేసు దాఖలు, మేజిస్ట్రేట్ అధికారాలు, అరెస్ట్ చేసేందుకు పోలీసులకు ఉన్న అధికారాలు, భిన్న రకాల క్రిమినల్ కేసులు ఈ వివరాలన్నీ సీఆర్పీసీలో ఉంటాయి.