వేసవిలో ఇంట్లో ‘చల్ల’గా ఉండాలనుకుంటున్నారా..

భానుడు నిప్పులు కురిపిస్తుంటే... ఇంట్లో ఉన్నవారు సైతం గగ్గోలు పెడుతున్న పరిస్థితి. వేసవిలో తార స్థాయికి చేరిన ఉష్ణ తాపానికి తట్టుకోలేక సామాన్యుడు సైతం ఏసీలు, కూలర్లను ఆశ్రయిస్తున్న పరిస్థితి. ఏటేటా వేసవి మరింత హాట్ గా మారిపోతున్న నేపథ్యంలో కాస్త కూల్ గా ఉండేందుకు ఉన్న మర్గాలేంటో తెలుసుకుందాం.  

బిల్డింగ్ వేడెక్కడంతో

వేడి ఇంట్లోకి ప్రవేశించడంలో పైకప్పు, గోడలు ఈ రెండు కీలకంగా వ్యవహరిస్తాయి. ఇంటి పైకప్పు ఎలాంటిది, ఏ మెటీరియల్ తో తయారైందన్న అంశాల ఆధారంగా ఇంట్లోకి ప్రవేశించే వేడి శాతం ఆధారపడి ఉంటుంది. అలాగే, మనం ఉంటున్నది అపార్ట్ మెంటులో అయితే కనుక, పైకప్పు వేడిని గ్రహంచి దాన్ని కింది అంతస్తులకు ప్రసారం చేస్తుంది. అక్కడి నుంచి అది తిరిగి స్లాబ్ కిందకు ప్రయాణిస్తుంది. అందుకే పై అంతస్తులు ఎప్పుడూ వేడిగా ఉంటాయి. 

గోడలు ఏ దిశలో ఉన్నాయన్న దాన్ని బట్టి ఇంట్లోకి ప్రవేశించే వేడి కూడా ఉంటుంది. దక్షిణం వైపు గోడలు ఎక్కువగా వేడిని తీసుకుంటాయి. ఉత్తరం వైపు గోడలు తక్కువగా తీసుకుంటాయి. దాంతో గదిలోని గాలి వేడెక్కుతుంది. అది గదిలోనే ఉండిపోవడంతో ఇంట్లోని ఉష్ణోగ్రత హాట్ గా అనిపిస్తుంది. 

వేడికి దారి తీసే మరికొన్ని... 

ఫర్నిచర్ ఎక్కువగా ఉన్నా ఇంట్లో వేడి వాతావరణం పెరిగిపోతుందట. అందుకే అవసరానికి మించి ఆర్బాటం కోసం ఫర్నిచర్ లేకుండా చూసుకోవాలి. అలాగే, ఇంట్లో రిఫ్రిజిరేటర్లు ఎక్కడ ఉంచామన్నది కూడా కీలకమే. ఇంట్లోని గోడలు ముదురురంగులో ఉంటే, ఇతర వస్తువులు కూడా నల్లటి రంగులో ఉంటే ఎక్కువ వేడిని గ్రహిస్తాయట. 

representation image

వేడి తగ్గించుకోవడానికి ఏం చేయాలి?

టెర్రాస్, బాల్కనీపై, విండోస్, వాల్స్ పక్కన మొక్కల పెంపకం వేడి నుంచి రక్షణనిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇంటిపై మొక్కల పెంపకం కోసం కుండీలు, లేదా బేస్ ప్లాట్ ఫామ్ లలో ఉంచిన మట్టి వేడిని గ్రహిస్తుంది. మొక్కలు సైతం వేడిని గ్రహిస్తాయి. దాంతో ఇంటి పై కప్పుకు వేడి చేరదు. దానివల్ల ఇంట్లో చల్లగా ఉంటుంది. 

కూల్ సిమెంట్ తో చల్లచల్లగా...

ఇంటి రూఫ్ పై తెల్లటి సున్నం కోటింగ్ వేయించడం ఓ మంచి ఉపాయం. తెల్లటి సున్నంపై పడిన సూర్యకిరణాలు వికరణం చెందుతాయి. దాంతో వేడి కిందకు ప్రవహించకుండా ఉంటుంది. అయితే, వర్షాలు పడితే ఈ లేయర్ ఉండదు. తిరిగి మళ్లీ వేసవి ముందు వేయించుకోవాల్సి ఉంటుంది. మార్కెట్లో ఎన్నో రకాల కూల్ సిమెంట్లు అందుబాటులో ఉన్నాయి. ఎవరికివారు తమ స్తోమతకు తగినది ఎంచుకుని ఇంటి పైన కూల్ సెమ్ కోటింగ్ వేసుకోవచ్చు. వీటివల్ల ఇంటిలోపల ఉష్ణోగ్రత పగటి వేళల్లో 5 నుంచి పది డిగ్రీల వరకు తగ్గుతుందని అధ్యయనాల్లో వెల్లడైంది. సాధారణంగా తక్కువ రకం కూల్ కోటింగ్ లు ఒక వేసవి సీజన్ కే పని చేస్తాయి. అయితే, తక్కువ ధర ఉన్న కూల్ సిమెంట్ వేసుకునే సమయంలో ఐదు కేజీల బ్యాగ్ నకు 500 ఎంఎల్ ఫెవికాల్ (అడెసివ్) కలిపి కోటింగ్ వేసినట్టయితే కనీసం రెండు వేసవి సీజన్ల వరకు ఉంటుంది. 

ఇక ఈ కోటింగ్ ఎలా వేయాలి అన్న దాని గురించి తప్పకుండా తెలుసుకోవాలి. సాధారణంగా సూర్యరశ్మి లేని (సాయంత్రం నుంచి తెల్లవారేలోపు) సమయాల్లో ఈ కోటింగ్ వేయాల్సి ఉంటుంది. ఒక కోటింగ్ వేసిన 24 గంటల తర్వాత రెండో కోటింగ్ కూడా వేసుకున్నట్టయితే మరింత సమర్థవంతంగా వేడిని అడ్డుకుంటుంది. మార్కెట్లో సూర్య కూల్ రెయిన్ అండ్ షెయిన్ పేరుతో కూల్ సిమెంట్ ను విక్రయిస్తోంది. 90 శాతం సూర్యకిరణాలను ఈ కోటింగ్ నిరోధిస్తుందని కంపెనీ పేర్కొంటోంది. వేడి నుంచి రక్షణతోపాటు గాలి కారణంగా నెర్రులు బారకుండా, ఇంటి పైన లీకేజీలను కూడా అరికడుతుందని చెబుతోంది. డ్యులక్స్ బ్రాండ్ కు సంబంధించి డ్యులక్స్ వెదర్ షీల్డ్ సన్ రిఫ్లెక్ట్ పేరుతో వేడి నుంచి రక్షణ కోసం వాల్ పెయింట్ ను విక్రయిస్తోంది. గోడలకు ఈ పెయింట్ వేసుకోవడం ద్వారా ఐదు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను తగ్గిస్తుందని కంపెనీ చెబుతోంది. ఏ ఖర్చూ భరించలేని వారయితే తక్కువ రకం సున్నంపొడిని తీసుకొచ్చి కోటింగ్ లా వేసుకున్నా అధిక ఉష్ణోగ్రతల నుంచి కొద్దిగానైనా ఉపశమనం ఉంటుంది. 

వేసవిలో కిటికీలు తెరిచి ఉంచాలా..?

వేసవిలో కిటికీలు అన్ని వేళలా తెరచి ఉంచకూడదు. సూర్యాస్తమయం తర్వాత సాయంత్రం 7 గంటల అయిన దగ్గర్నుంచి ఇంటి కిటికీలు తెరచి ఉంచడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే పగలు సూర్యుడి ప్రభావంతో వేడెక్కిన గాలి ఇంట్లో ఉండిపోతుంది. సాయంత్రం అన్ని వైపులా కిటీకీ తలుపులు తెరచి ఉంచడం ద్వారా తాజా గాలి ఇంట్లోకి ప్రవేశించి లోపలి వాతావరణాన్ని చల్లబరుస్తుంది. పగలు సూర్యుడు ఉన్నవేళల్లో కిటికీలు తెరచి ఉంచినట్టయితే... వేడి గాలి లోపలికి ప్రసరించి గదిలోపటి ఉష్ణోగ్రతను వెచ్చగా మారుస్తుంది. అందుకే వేసవిలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కిటికీ తలుపులు మూసి ఉంచడమే సరైనది. 

విండో ప్లాంట్స్

కిటికీల దగ్గర పెంచేందుకు విండో ప్లాంట్స్ అని లభ్యమవుతున్నాయి. కిటికీలోంచి ఇంట్లోకి ధారాళంగా గాలి వచ్చేందుకు వీలు కల్పిస్తూనే ఈ మొక్కలను కూడా పెంచుకోవచ్చు. దీంతో వేడిని ఈ మొక్కలు గ్రహించి ఇంట్లోకి రాకుండా చూస్తాయి. విండో ప్లాంట్స్ పెంచడం కోసం విండో ప్లాంట్ బాక్సులను ఏర్పాటు చేసుకోవాలి.  విండో ప్లాంట్స్ తో ఇంటికి అందం కూడా వస్తుంది. అలాగే వట్టివేరు పరదాలు కూడా అందుబాటులో ఉన్నాయి. కిటికీల దగ్గర వీటిని కర్టెన్లలా కట్టుకోవడం వల్ల చల్లదనం ఉంటుంది. ఇవే కర్టన్లను బాల్కనీల్లోనూ వాడుకోవడం చల్లదనాన్నిస్తుంది. లేదా వేడిని నిరోధించే వెదురు బొంగులతో చేసిన పరదాలను కూడా వాడుకోవచ్చు. తూర్పు, పడమర వైపు కిటీకీలకు నీడ ఉండేలా చూసుకోవాలి. 

ఇల్లు సింహ ద్వారం తూర్పు ముఖం అయితే ఇంటి ముందు భాగానికి నీడ వచ్చేలా పందిరి వేసుకోవాలి. వేసవి సమయంలో ఇంట్లో లేతరంగు వస్తువులు ఉపయోగించడం అవసరం. తెల్లటి లేదా లేత రంగు బెడ్ షీట్, కర్టెన్లు ఉపయోగించడం వల్ల వేడిని గ్రహించవు. నల్లటి రంగులో ఉన్నవి ఎక్కువ వేడిని గ్రహిస్తాయి. రిఫ్రిజిరేటర్ తలుపు అస్తమానం తీసి వేస్తూ ఉంటే లోపలున్న చల్లదనం తగ్గి మెషిన్ ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. దాంతో కొంత మేర వేడి ఉత్పత్తవుతుంది. అలాగే, ఇంట్లో వాడని అన్ని ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఆఫ్ చేసి ఉంచుకోవాలి. 

మట్టితో మరింత చల్లదనం

ఇంటి గోడలన్నింటికీ వెలుపల వైపు మట్టిని ఓ పొరలా వేసుకోవడం మంచి ఉపాయమని పర్యావరణ నిపుణుల సూచన. వేసవి అయిన తర్వాత ఆ మట్టి పొర తొలగించి రంగులు వేయించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇలా మడ్ కోటింగ్ వద్దనుకున్నవారు... గోడలపై తీగ జాతికి చెందిన మొక్కలను పెంచుకోవచ్చు. ముఖ్యంగా సూర్యుడి కిరణాలు ఏ దిశ ద్వారా ఎక్కువగా ఇంటిని తాకుతున్నాయో చూసుకుని ఆ దిశలో ఉన్న గోడలపై మొక్కల పెంపకం మంచి ఐడియా అవుతుంది.


More Articles