మీ హక్కులకు భంగం వాటిల్లిందా… కమిషన్ డోర్ తట్టండి
భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కొన్ని హక్కులు కల్పించింది. ఈ హక్కులను ప్రతీ ఒక్కరూ విధిగా గౌరవించాలి. భావ ప్రకటనా స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, ఆర్థిక, సామాజిక, సాంసృతిక రాజకీయ హక్కులు… అంటే జీవనం, స్వేచ్ఛ, సమానత్వం, గౌరవం ఇలా ఎన్నో అంశాలకు సంబంధించి ప్రతీ ఒక్కరికీ సమాన హక్కులు ఉన్నాయి. ఇవి ప్రాంతం, మతం, కులం ఆధారంగా మారిపోవు. సమాజంలో మనిషి గౌరవంగా జీవించేందుకు కల్పించబడిన ఈ హక్కులకు విఘాతం కలిగితే ఎందుకొచ్చిన గొడవలే అని మిన్నకుండిపోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. హక్కుల పరిరక్షణకు ప్రత్యేకంగా హక్కుల కమిషన్లు, న్యాయస్థానాలు ఉన్నాయి.
హక్కుల ఉల్లంఘనలు ఇలా...
లైంగిక వేధింపులు, చిన్నారులతో వెట్టి చాకిరీ, మానవ అక్రమ రవాణా, మత హింస, కుల సంబంధిత అంతరాలు ఇలా ఎన్నో అంశాలు హక్కులతో ముడిపడినవే. అలాగే, జైల్లో ఖైదీల గదులను శుభ్రం చేయకపోవడం, నీరు అందుబాటులో ఉంచకపోవడం కూడా వేధింపులు, హక్కుల ఉల్లంఘన కిందే వస్తుంది. నేరస్థులు అయినా సరే వారి హక్కులకు విఘాతం కలిగించరాదని చట్టాలు చెబుతున్నాయి. ఆసియా హ్యుమన్ రైట్స్ అధ్యయనం ప్రకారం దేశంలో 2002 నుంచి 2008 మధ్య కాలంలో రోజుకు నలుగురు నిందితులు పోలీసు కస్టడీలో మృతి చెందారు. అధిక సంఖ్యలో మరణాలు పోలీసుల వేధింపుల వల్లేనని వెల్లడైంది.
తామిచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులుఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదంటూ కమిషన్లకు ఎక్కువగా పిటిషన్లు వస్తుంటాయి. ప్రముఖ, రాజకీయ, అర్థబలం ఉన్న వ్యక్తులపై ఫిర్యాదులు చేసినప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. అయితే, దర్యాప్తునకు వీలు కల్పించే నేరం ఏదైనా సరే ఫిర్యాదు అందితే పోలీసులు తప్పకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. నమోదు చేయకుంటే జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ లేదా మేజిస్ట్రేట్ ను ఆశ్రయించవచ్చు. లేదా నేరుగా రాష్ట్ర, జాతీయ మానవ హక్కుల కమిషన్లకు కూడా ఫిర్యాదు చేయవచ్చు.
ఈ హక్కుల ఉల్లంఘనలకు చెక్ పెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో నేషనల్ హ్యుమన్ రైట్స్ కమిషన్, రాష్ట్రాల్లో స్టేట్ హ్యుమన్ రైట్స్ కమిషన్లను ఏర్పాటు చేసింది. హ్యుమన్ రైట్స్ యాక్ట్ 1993లోని సెక్షన్ 13, సెక్షన్ 12లో జాతీయ, రాష్ట్ర కమిషన్ల విధి విధానాలు ఎలా ఉండాలో పేర్కొన్నారు.
ఫిర్యాదు చేసే విధానం...
ఎవరైనా సరే తమ హక్కులకు భంగం వాటిల్లుతోందని భావిస్తే నేరుగా హక్కుల కమిషన్లను ఆశ్రయించవచ్చు. బాధితుడు లేదా బాధితుల తరఫున ఎవరైనా హక్కుల కమిషన్ లో పిటిషన్ దాఖలు చేయవచ్చు. హిందీ, ఇంగ్లిష్ లేదా రాజ్యాంగం గుర్తించిన ఏదేనీ ప్రాంతీయ భాషల్లో ఈ ఫిర్యాదు ఉండాలి. నేరుగా వెళ్లి ఫిర్యాదు ఇవ్వవచ్చు. లేదా పోస్ట్ లేదా ఫ్యాక్స్, మెయిల్ ద్వారానూ పంపవచ్చు. మొబైల్ ఎస్ఎంఎస్ ను కూడా కమిషన్ పరిగణనలోకి తీసుకుంటుంది. ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన పని లేదు.
ఫిర్యాదు చేయకపోయినా విచారణ
బాధితుల పిటిషన్ పైనే కాదు మీడియాలో వచ్చిన కథనాలు లేదా ఇతర మార్గాల్లో హక్కుల ఉల్లంఘన సమాచారం తెలిసినా కూడా కమిషన్ స్పందించి సుమోటోగా ఏదైనీ హక్కుల ఉలంఘనపై విచారణకు ఆదేశిస్తుంది. అలాగే కోర్టుల ఆదేశాలతోనూ కమిషన్ జోక్యం చేసుకోవచ్చు. ఉల్లంఘన జరగకుండా చూడడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైనా కమిషన్ స్పందిస్తుంది. మానవ హక్కుల ఉల్లంఘనల ఆరోపణలకు సంబంధించి కోర్టు దగ్గర పెండింగ్ లో ఉన్న ఏ కేసు విషయంలో నైనా కోర్టు అనుమతి మేరకు కమిషన్ జోక్యం చేసుకోవచ్చు.
అస్పష్టంగా ఉన్నా, ఫిర్యాదు దారుడు వివరాలు లేకపోయినా, అప్రధానమైన ఫిర్యాదులను కమిషన్లు స్వీకరించవు. అలాగే రాష్ట్ర హక్కుల కమిషన్ వద్ద ఫిర్యాదు పెండింగ్ లో ఉంటే అదే అంశంపై జాతీయ కమిషన్ ఫిర్యాదును విచారించదు. అలాగే కోర్టు విచారణలో ఉన్న అంశాలపై హక్కుల కమిషన్లను ఆశ్రయించడానికి లేదు. హక్కుల ఉల్లంఘన అంటే సరిపోదు. అందుకు సంబంధించి నిర్ధిష్ట వివరాలు ఇవ్వాలి. ఒకవేళ సివిల్, క్రిమినల్ కేసు అయి ఉండి కోర్టు అప్పటికే ఆ కేసు విచారణను చేపట్టి ఉంటే వాటిపై కమిషన్లు సమాంతరంగా విచారణ చేపట్టడానికి వీల్లేదు. హక్కుల ఉల్లంఘన జరిగి ఏడాది దాటిపోతే దానిపై కమిషన్లు విచారణకు ఆదేశించలేవు. చివరిగా కమిషన్ల తీర్పులు, ఆదేశాలు న్యాయవ్యవస్థ పరిధికి లోబడి ఉంటాయి. ఒకసారి పిటిషన్ దాఖలయ్యాక దానిపై తుది ఆదేశాలు వెలువడే వరకు పలు దశలు ఉంటాయి.
విచారణ క్రమం
బాధితులు లేదా వారి తరఫున తమకు ఏ మార్గంలో పిటిషన్ అందినా దాన్ని కమిషన్ లోని ఇన్ వార్డులో సిబ్బంది నమోదు చేస్తారు. ఒకసారి పిటిషన్ ను నమోదు చేసుకున్న తర్వాత దాన్ని పరిశీలన విభాగానికి పంపుతారు. ఇక్కడ హక్కుల గురించి, చట్టాల గురించి తెలిసిన సిబ్బంది పిటిషన్ లోని అంశాలను పరిశీలిస్తారు. హక్కుల ఉల్లంఘన ఉంటే విచారణకు స్వీకరిస్తారు. లేదనుకుంటే తిరస్కరిస్తారు. స్వీకరించే పిటిషన్ ను కంప్యూటర్ లో నమోదు చేసి ఓ రాండమ్ కోడ్ కేటాయిస్తారు. అదే పిటిషన్ కోడ్ అవుతుంది. అమోదించిన పిటిషన్లకు సంబంధించి కాజ్ లిస్ట్ రూపొందిస్తారు. విచారణ ఏ తేదీన జరుగుతుందో ఈ విభాగం సిబ్బంది తెలియజేస్తారు. ఆ తేదీన పిటిషన్ పై విచారణ చేపడతారు.
కమిషన్ అధికారాలు
కేసుల విచారణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఏ దర్యాప్తు సంస్థ సేవలను అయినా కమిషన్ వినియోగించుకోవచ్చు. కమిషన్ కు స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. కేసు విచారణలో భాగంగా ప్రాథమిక సమాచారం లేదా నివేదిక సమర్పించాలని సంబంధిత ప్రభుత్వ విభాగాలను కమిషన్ ఆదేశిస్తుంది. నిర్ణీత గడువులోపు ఆయా విభాగం నివేదిక ఇవ్వకుంటే కమిషన్ సిబ్బందే నేరుగా సమాచారాన్ని సేకరిస్తారు. ఒకవేళ నివేదిక అందితే దాన్ని పరిశీలిస్తారు. హక్కుల ఉల్లంఘన జరిగినట్టు తేలితే చట్టంలోని సెక్షన్ 18 ప్రకారం... బాధితులకు పరిహారం చెల్లించాలంటూ ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది. హక్కుల ఉల్లంఘన జరగలేదని నివేదిక వస్తే విచారణ నిలిపివేస్తుంది. హక్కుల ఉల్లంఘన జరిగినా, లేదా హక్కుల ఉల్లంఘనను నివారించడంలో ప్రభుత్వ ఉద్యోగి నిర్లక్ష్యం బయటపడినా సంబంధిత వ్యక్తులపై చర్యలకు కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేయవచ్చు.
కమిషన్ లో విచారణ ప్రక్రియ కోర్టుల్లో కేసు విచారణ తీరులోనే ఉంటుంది. వేరే అంశాలు కూడా అందులో ఉన్నాయని బావిస్తే కోర్టుకు నివేదించవచ్చు. పిటిషన్ పై విచారణలో భాగంగా సాధారణ కోర్టు వలే కమిషన్ కుడా సాక్ష్యాధారాలను, సాక్షులను ప్రవేశపెట్టాలని కోరవచ్చు. హక్కుల కమిషన్లు న్యాయ వ్యవస్థ పరిధిలోకి రావు. కేవలం విచారణ ప్రక్రియలో భాగంగా సాక్షులు, సాక్ష్యాధారాల ప్రవేశానికి వీలుగా సెక్షన్ 13 కింద కోర్టుల వలే కొన్ని అధికారాలను వీటికి కట్టబెట్టారు.
కమిషన్ పరిధిలో ఈ అధికారాలు కూడా…
ప్రభుత్వ జైళ్లు, హాస్టళ్లు, సంరక్షణ కేంద్రాలు, ఆస్పత్రులు లేదా పోలీస్ స్టేషన్లు, లేదా ఏదేనీ ప్రభుత్వ కార్యాలయాన్ని సందర్శించవచ్చు. జైళ్లలో ఉన్న ఖైదీలకు హక్కుల ప్రకారం అన్నీ అందుతున్నాయా లేదా పరిశీలించగలదు. కమిషన్ చైర్మన్, ఇతర సిబ్బంది నేరుగా తనిఖీ చేయవచ్చు. అక్కడి పరిస్థితులు మెరుగ్గా లేకుంటే ఆ దిశగా ప్రభుత్వానికి తగిన సిఫారసులు చేయగలదు. హక్కుల సంరక్షణకు సంబంధించి చట్టాలను ఎప్పటికప్పుడు సమీక్షించడం ద్వారా సమర్థవంతంగా అమలు చేసే దిశగా తగిన సిఫారసులు చేయవచ్చు. ఎన్ కౌంటర్లు జరిగిన సందర్భాల్లో హక్కుల ఉల్లంఘనల ఆరోపణలు వస్తే సంఘటనా స్థలాలను కూడా కమిషన్ ప్రతినిధి బృందం సందర్శించవచ్చు.
హక్కుల కమిషన్లలో ఉండేది వీరే...
పదవీ విమరణ చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్ పర్సన్ గా సాధారణంగా నియమిస్తుంటారు. అలాగే సుప్రీంకోర్టు జడ్జి ఒకరు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒకరు, మానవ హక్కులపై విస్తృత అవగాహన ఉన్న ఇద్దరిని సభ్యులుగా నియమిస్తుంటారు. వీరితోపాటు మైనారిటీ కమిషన్, ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, మహళా కమిషన్ల చైర్ పర్సన్లు ఎక్స్ అఫీషియో సభ్యులుగా వ్యవహరిస్తారు.
ఇక స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చూస్తే... సాధారణంగా హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తుల్లో ఒకరిని చైర్ పర్సన్ గా నియమిస్తుంటారు. ఇద్దరు సభ్యులు, ఒక సెక్రటరీ కూడా ఉంటారు. ప్రస్తుతం ఏపీ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్ పర్సన్ గా జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూ ఉన్నారు.
హక్కుల గురించి అవగాహన లేనివారు, ఉల్లంఘన జరిగితే కమిషన్ ను ఆశ్రయించడం ఎలా తదితర సమాచారం కోసం రాష్ట్ర, జాతీయ మానవ హక్కుల కమిషన్లలోని ప్రజా సంబంధాల అధికారిని ఆశ్రయించి తెలుసుకోవచ్చు.
National Human Rights Commission, Manav Adhikar Bhawan Block-C, GPO Complex, INA, New Delhi - 110023, Tel.No. 24651330 Fax No. 24651329 E-Mail: covdnhrc@nic.in, ionhrc@nic.in
వెబ్ పోర్టల్ http://nhrc.nic.in/
ANDHRA PRADESH STATE HUMAN RIGHTS COMMISSION
'GRUHAKALPA', M.J. ROAD, HYDERABAD-500001
ఫోన్ నంబర్లు... 24601574, 23301786. ఫాక్స్ నంబర్లు 24601573, 24600722