బి కాంప్లెక్స్ విటమిన్లతో మానసిక ఆరోగ్యం
శారీరక ఆరోగ్యానికే కాదు మానసిక ఆరోగ్యానికీ బి విటమిన్లు అవసరం. శరీరంలోని అనేక జీవక్రియలు సవ్యంగా కొనసాగాలన్నా... మెదడు, నాడీ వ్యవస్థ సరిగా పనిచేయాలన్నా.. బి కాంప్లెక్స్ విటమిన్లు శరీరానికి అందాల్సిందే. లేకుంటే డిప్రెషన్ దగ్గరి నుంచి ఏ నిర్ణయమూ తీసుకోలేని గందరగోళ మానసిక స్థితి దాకా ఎన్నో సమస్యలు వస్తాయి. అంతేకాదు కళ్లు, చర్మం ఆరోగ్యంగా ఉండడానికి అత్యవసరం. విటమిన్ బి లో మళ్లీ చాలా ఉప రకాలు ఉన్నాయి. వీటన్నింటికీ కూడా వేర్వేరు లక్షణాలు, ప్రయోజనాలు ఉన్నాయి. అన్నింటినీ కలిపి బి కాంప్లెక్స్ విటమిన్ అంటారు. బి కాంప్లెక్స్ విటమిన్లు చాలా వరకు మనం నిత్యం తీసుకునే ఆహార పదార్థాల్లోనే లభిస్థాయి. ముఖ్యంగా మాంసాహారం నుంచి ఎక్కువశాతం అందుతాయి. శరీరంలో పిండి పదార్థాలు జీర్ణం కావడానికి, కండరాల పటుత్వానికి, నాడీ వ్యవస్థ, రోగ నిరోధక వ్యవస్థలు సరిగా పనిచేయడానికి ఇవి తోడ్పడుతాయి. గుండె, కాలేయం, మూత్ర పిండాలు సహా ముఖ్యమైన అవయవాలన్నీ సరిగా పనిచేసేందుకూ ఇవి అవసరం.
బి కాంప్లెక్స్ లోని ప్రధానమైనవి
- బి1- థయమిన్
- బి2- రైబోఫ్లేవిన్
- బి3- నియాసిన్ లేదా నియాసినమైడ్
- బి4 - అడినైన్
- బి5- పాంటోథెనిక్ ఆమ్లం
- బి6- పైరిడాక్సిన్
- బి7- బయోటిన్
- బి8- అడెనోసిన్
- బి9- ఫోలిక్ ఆమ్లం
- బి10- పారా అమినో బెంజోయిక్ ఆమ్లం
- బి12- సయానో కోబాలమైన్
ఇవేగాకుండా మరికొన్ని బి కాంప్లెక్స్ విటమిన్లు కూడా ఉన్నట్లు పలువురు శాస్త్రవేత్తలు గుర్తించారు. కానీ పూర్తిస్థాయిలో నిర్ధారణ కాకపోవడం, వాటి వలన శరీరానికి, మన ఆరోగ్యానికి చెప్పుకోదగిన స్థాయిలో ప్రయోజనం లేకపోవడం వంటి కారణాల వల్ల ఆ విటమిన్ల గురించి ఎక్కువగా ప్రచారం లేదు. బి కాంప్లెక్స్ విటమిన్లలోనూ బి1, బి2, బి3, బి5, బి6, బి9, బి12 అత్యంత ప్రధానమైనవి.
నాడీ వ్యవస్థకు బీ1
బి కాంప్లెక్స్ విటమిన్లలో మొదటగా కనుగొన్నది థయమిన్ నే. అందుకే దీన్ని బి1గా పిలుస్తారు. ఇది చాలా రకాల ఆహార పదార్థాల్లో విస్తృతంగా లభిస్తుంది. నాడీ వ్యవస్థ, గుండె సమర్థవంతంగా పనిచేయడానికి, కండరాల పటుత్వానికి, పేగుల్లో పిండి పదార్థాల సంశ్లేషణకు ఈ విటమిన్ అవసరం. ముఖ్యంగా కండరాల నుంచి నాడులకు, నాడుల నుంచి కండరాలకు సమాచార ప్రసారం చేసే ఎలక్ట్రోలైట్లను రవాణా చేయడంలో దీనిది కీలకపాత్ర. కంటి సమస్యలైన క్యాటరాక్ట్, గ్లకోమాలను నివారిస్తుంది. అల్జీమర్స్ తో బాధపడుతున్నవారికి థయమిన్ అందిస్తే.. వారి జ్ఞాపక శక్తి ఎంతో మెరుగుపడినట్లు అమెరికన్ మెడికల్ రీసెర్చ్ ఫౌండేషన్ పరిశోధకులు నిర్ధారించారు.
లోపిస్తే నాడీ వ్యవస్థకు దెబ్బ
థయమిన్ లోపిస్తే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. నాడీ వ్యవస్థ, మెదడు, కండరాలు, గుండె సంబంధించిన సమస్యలు వస్తాయి. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ వ్యవస్థ దెబ్బతింటుంది. థయమిన్ లోపం వల్ల బెరిబెరి వ్యాధి వస్తుంది. నాడుల పనితీరు దెబ్బతినడం, కాళ్లలో వాపు, గుండె పెద్దది కావడం, తిమ్మిర్లు వంటివి దీని లక్షణాలు. గుండె కొట్టుకునే వేగంలో తీవ్రస్థాయిలో హెచ్చుతగ్గులు నెలకొని.. రక్తపోటు పడిపోతుంది. కాళ్లు, ఊపిరితిత్తుల్లో నీరు చేరుతుంది. ఇది అంతిమంగా మరణానికి దారితీసే ప్రమాదం కూడా ఉంది. కేవలం తల్లిపాలు మాత్రమే తాగే పిల్లల్లో థయమిన్ లోపం ఏర్పడి బెరిబెరి వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. దీనివల్ల పిల్లలు సరిగా స్పందించకపోవడం, గొంతు ద్వారా చేసే ధ్వని స్థాయి తగ్గిపోవడం జరుగుతుంది. చివరికి గుండె విఫలమయ్యే ప్రమాదం ఉంటుంది. ఇక దీని లోపంతో ‘వెర్నిక్-కొర్సాకోఫ్’గా పేర్కొనే మెదడు, నాడీ సంబంధిత వ్యాధి వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల స్వల్పకాలిక మతిమరుపు, ఆందోళన, కలవరపాటు, సరిగా నడవలేకపోవడం, కంటి సమస్యలు తలెత్తుతాయి.
14 ఏళ్లపైన పురుషులకు రోజుకు 1.2 మిల్లీగ్రాముల థయమిన్ అవసరం. అదే 14 నుంచి 18 మధ్య ఉన్న స్త్రీలకు 1 మిల్లీగ్రాము, 19 ఏళ్లు దాటిన స్త్రీలకు 1.1 మిల్లీగ్రాముల చొప్పున థయమిన్ అవసరం.
థయమిన్ (బి1) మాంసం, కాలేయం, పాలు, గుడ్లు, ఓట్స్, ఆరెంజ్, ధాన్యాల పై పొర, వేరుశనగ, ఈస్ట్ లలో లభిస్తుంది. బియ్యం, గోధుమలు వంటి వాటిని పాలిష్ చేసి పై పొర తొలగించడం, వండే ముందు ఎక్కువగా కడగడం వల్ల థయమిన్ వెళ్లిపోతుంది.
థయమిన్ లోపం ఉన్న వారిలో డిప్రెషన్, తీవ్ర ఉద్వేగం, మానసికంగా అస్థిరంగా ఉండడం, భయం, కలవరపాటు, నిద్రలేమి, నీరసం, మగతగా ఉండడం, ఆకలి మందగించడం, చిన్నపాటి నొప్పిని కూడా తట్టుకోలేకపోవడం, వెన్నునొప్పి, కండరాల క్షీణత, మలబద్ధకం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఆహారంలోని థయమిన్ శరీరానికి అందకుండా ఆల్కాహాల్ అడ్డుకుంటుంది. అందువల్లే విపరీతంగా ఆల్కాహాల్ తీసుకునేవారిలో ఆందోళన, మతిమరపు, వణుకు వంటి లక్షణాలు తలెత్తుతాయి. ఆల్కాహాల్ కు దూరంగా ఉండడం శ్రేయస్కరం.
థయమిన్ ను సంగ్రహించలేని జన్యు లోపాలు ఉన్నవారి పిల్లలకు కూడా బెరిబెరి వ్యాధి జన్యుపరంగా సంక్రమించే అవకాశం ఉంటుంది. అందువల్ల వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.
దీని లోపాన్ని గుర్తించడానికి ప్రత్యేకమైన వైద్య పరీక్షలంటూ ఏమీ లేవు. లక్షణాలు, రక్తంలో ఎలక్ట్రోలైట్ల స్థాయిని పరిశీలించడం ద్వారా వైద్య నిపుణులు లోపాన్ని అంచనా వేస్తారు.
రైబోఫ్లేవిన్ నోటికి మంచిది
శరీరంలో జీర్ణక్రియకు, శక్తి ఉత్పాదన ప్రక్రియకు రైబోఫ్లేవిన్ (విటమిన్ బి2) ఎంతో కీలకం. కండరాలు పెరగడానికి తోడ్పడుతుంది. పిండి పదార్థాలు (కార్బొహైడ్రేట్స్), ప్రొటీన్లు, కొవ్వులు, అమైనో ఆమ్లాలు జీర్ణం కావడానికి.. శరీరం ఆక్సిజన్ ను వినియోగించుకునేలా విటమిన్ బి2 పనిచేస్తుంది. ఇది చాలా రకాల ఆహార పదార్థాల్లో విస్తృతంగా లభిస్తుంది. చర్మ ఆరోగ్యానికి, రక్త కణాల ఉత్పత్తికి ఇది అత్యవసరం. కంటి ఆరోగ్యం కాపాడడంలో రైబోఫ్లేవిన్ ది కీలకపాత్ర. కంటిలో యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసే గ్లుటాథియోన్ ను ఇది రక్షిస్తుంది. క్యాటరాక్ట్ రాకుండా నిరోధిస్తుంది. ముఖ్యంగా రక్తంలో ఇతర విటమిన్లు, మినరల్స్, శరీరానికి అవసరమైన రసాయనాలు ఉండే స్థాయిని రైబోఫ్లేవిన్ ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు విటమిన్ బి6, బి9లను శరీరం వినియోగించుకోవడానికి రైబోఫ్లేవిన్ తప్పనిసరి. అంతేకాదు ఐరన్ ను శరీరం సంగ్రహించడానికి కూడా ఇది తప్పనిసరి. అందువల్లే రైబోఫ్లేవిన్ లోపం ఉన్నవారు తగిన స్థాయిలో ఐరన్ ను తీసుకున్నా కూడా వారిలో రక్త హీనత నెలకొంటుంది. మైగ్రేన్ (పార్శ్వనొప్పి)తో బాధపడుతున్నవారు రైబోఫ్లేవిన్ తీసుకుంటే తగిన ఉపశమనం లభిస్తుంది. నోటి మూలల్లో, పెదవులు పగిలినట్లయితే రైబోఫ్లేవిన్ లోపం ఉన్నట్లుగా గుర్తించవచ్చు.
లోపంతో నోటి పగుళ్లు
సాధారణ పోషకాహారం తీసుకునేవారికి రైబోఫ్లేవిన్ లోపం తక్కువే. కానీ కొన్నేళ్లుగా మాత్రం చాలా మందిలో ఈ విటమిన్ లోపం కనిపిస్తోంది. సాధారణంగా ఇతర బి విటమిన్ల లోపంతోపాటే రైబోఫ్లేవిన్ లోపం కూడా ఏర్పడుతుంది. అనారోగ్యకర ఆహార అలవాట్లు, అతిగా ఆల్కాహాల్ తీసుకోవడం, ధూమపానం వంటివి దీని లోపానికి కారణం. అంతేగాకుండా యుక్త వయసు వారిలో, వృద్ధుల్లో కూడా లోపం కనిపించే అవకాశముంది. రైబోఫ్లేవిన్ లోపం వల్ల రక్త హీనత, గొంతు, నోరు, పెదవుల పగుళ్లు, వాపు, నొప్పి, చర్మం మంట వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముక్కు చుట్టూ, కళ్ల వద్ద ఎరుపు రంగులో మచ్చలు కనిపించవచ్చు. ఇక లేటు వయసులో గర్భం దాల్చినవారిలో రైబోఫ్లేవిన్ లోపం వల్ల అధిక రక్తపోటు సమస్య తలెత్తుతుంది. మూత్ర పరీక్షల ద్వారా ఈ విటమిన్ లోపాన్ని గుర్తించవచ్చు.
రైబోఫ్లేవిన్ సాధారణంగా పురుషులకు రోజుకు 1.3 మిల్లీగ్రాములు, స్త్రీలకు 1.1 మిల్లీగ్రాములు అవసరం. మూడేళ్లలోపు పిల్లలకు 0.8 మిల్లీగ్రాముల వరకు, గర్భంతో ఉన్న మహిళలకు 1.7 మిల్లీగ్రాముల వరకు అవసరం.
రైబోఫ్లేవిన్ (బి2) ఎక్కువగా గోధుమ మొలకలు, తృణ ధాన్యాలు, సోయాబీన్, ఆకుకూరలు, బాదం, వేరుశనగ వంటి గింజలు, గుడ్లు, మాంసం, పాలు, పాల ఉత్పత్తులు, పుట్టగొడుగులు, బ్రాకొలీ వంటి వాటిలో ఎక్కువగా లభిస్తుంది. ఆహారాన్ని ఎక్కువగా కడిగినా, ఎక్కువ వేడితో ఉడికించినా ఈ విటమిన్ నశిస్తుంది.
రైబోఫ్లేవిన్ లోపం ఏర్పడినప్పుడు దానిని ఇతర విటమిన్లతో కలిపి సప్లిమెంట్ల రూపంలో గానీ, నేరుగా గానీ అందిస్తారు. లోపం తీవ్రంగా ఉన్నప్పుడు నేరుగా కండరాల్లోకి ఇంజెక్షన్ రూపంలోనూ ఇస్తారు.
ఆల్కాహాల్ ఎక్కువగా తీసుకునేవారికి, కేన్సర్ బాధితులు, కాలిన గాయాలైనవారు, దెబ్బలు తగిలిన సమయంలో, చిన్నపేగులు, కాలేయ సంబంధిత వ్యాధులు ఉన్నవారికి, కొద్ది రోజులుగా డయేరియా, జ్వరం, ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నవారికి విటమిన్ బి2 ఎక్కువ మొత్తంలో అవసరం.
రైబోఫ్లేవిన్ ను అధిక మోతాదులో తీసుకున్నా పెద్దగా ప్రమాదకరమేమీ కాదు. ఎందుకంటే ఎక్కువగా ఉన్న ఈ విటమిన్ మూత్రాశయంలో వడగట్టబడి, మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. అయితే కొందరిలో మాత్రం డయేరియా వంటి లక్షణాలు కనిపించవచ్చు.
మెదడుకు పుష్టినిచ్చే నియాసిన్
చర్మం ఆరోగ్యంగా ఉండడానికి, శరీరంలో ఆహార పదార్థాల నుంచి శక్తి ఉత్పత్తి కావడానికి నియాసిన్ (విటమిన్ బి3) అవసరం. దీనిని మొదట్లో నికోటినిక్ యాసిడ్ విటమిన్ గా పేర్కొనేవారు. ఇది నియాసినమైడ్, ఇనోసిటోల్ హెక్సానియోటినేట్ లనే రెండు రూపాల్లో ఉంటుంది. అడ్రినల్ గ్రంథులు హార్మోన్లను, కాలేయం స్రావాలను తయారు చేసుకోవడానికి ఇది తోడ్పడుతుంది. శరీరంలో మంచి (హెచ్ డీఎల్) కొలెస్ట్రాల్ స్థాయులను 30 శాతం వరకు పెంచుతుంది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు మెదడులో దెబ్బతిన్న కణాలను పునరుద్ధరించడంలో నియాసిన్ ది కీలక పాత్ర. ఇక చర్మ కేన్సర్లను కూడా నిరోధిస్తుంది. కాలేయం నుంచి హానికర రసాయనాలను తొలగిస్తుంది. మైగ్రేన్ తో బాధపడుతున్నవారికి నియాసిన్ అందజేస్తే ఉపశమనం ఉంటుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఇక కలరాతో కూడిన డయేరియా లక్షణాలను నియాసిన్ నియంత్రిస్తుంది. పురుషుల్లో అంగస్తంభన సమస్య నుంచి బయటపడేందుకు నియాసిన్ తోడ్పడుతుందని కూడా గుర్తించారు.
లోపిస్తే పెల్లాగ్రా మహమ్మారి దాడి
సరైన పోషకాహారం తీసుకునేవారిలో నియాసిన్ (విటమిన్ బి3) లోపం సాధారణంగా తక్కువే. కేవలం ధాన్యాలను మాత్రమే ఎక్కువగా వినియోగిస్తూ పప్పులు, ఇతర నూనె గింజలు, మాంసం, గుడ్లు తిననివారిలో నియాసిన్ లోపం కనిపిస్తుంది. స్వల్ప స్థాయి లోపం వల్ల తీవ్రమైన నీరసం, పుండ్లు, డిప్రెషన్, అజీర్ణం వంటి వంటి సమస్యలు వస్తాయి. ఇక తీవ్రమైన లోపం కారణంగా పెల్లాగ్రా వ్యాధి వచ్చే ప్రమాదం ఉంటుంది. చర్మంపై ఎర్రగా మారి పొలుసులుగా ఊడిపోవడం, మంటలు, అజీర్ణం సమస్యలు, తీవ్ర విరేచనాలు, మానసిక ఆందోళన దీని లక్షణాలు. చేతులు, పాదాలు, మెడ చుట్టూ ముఖంపై పెద్దగా మచ్చలు ఏర్పడుతాయి. జీర్ణ వ్యవస్థలోని అన్ని అవయవాలపై ప్రభావం పడుతుంది. నోరు, నాలుక వాపు, పగుళ్లు వస్తాయి. గొంతు మంట, రక్త విరేచనాలు కమ్ముకుంటాయి. మెదడు పనితీరు దెబ్బతింటుంది. ఉద్రేకం, లేనిది ఊహించుకోవడం, గందరగోళం, జ్ఞాపక శక్తి క్షీణించడం, నడకలో సమన్వయం కోల్పోవడం, నిద్రలేమి వంటివి నెలకొంటాయి. చివరికి మృత్యువు బారిన పడే అవకాశం కూడా ఉంటుంది.
నియాసిన్ సాధారణ వ్యక్తులకు రోజుకు 14 నుంచి 16 మిల్లీగ్రాముల వరకు అవసరం. శారీరక శ్రమ అధికంగా చేసేవారికి 21 మిల్లీగ్రాముల వరకు అవసరం. మూడేళ్లలోపు పిల్లలకు 8 మిల్లీగ్రాముల వరకు, గర్భిణులు, బాలింతలకు 20 మిల్లీగ్రాముల వరకు అవసరం.
విటమిన్ బి3 ఎక్కువగా ఈస్ట్, మాంసం, చేపలు, పాలు, గుడ్లు, బాదాం వంటి గింజలు, వేరుశనగ వంటి నూనె గింజలు, ఆకుపచ్చని కూరగాయలు, బీన్స్, పప్పు దినుసుల్లో ఉంటుంది.
మొక్కజొన్నలో విటమిన్ బి3గానీ, ట్రిఫ్టోఫాన్ గానీ లభించదు. దీంతో మొక్కజొన్నను ప్రధాన ఆహారంగా వినియోగించే వారిలో దీనిలోపం ఏర్పడి పెల్లాగ్రా వ్యాధి వస్తుంది.
పాలు వంటి కొన్ని పదార్థాల్లో నేరుగా నియాసిన్ లభించదు. వాటిలో ట్రిఫ్టోఫాన్ అనే రసాయనం ఉంటుంది. దీనిని మన శరీరం నియాసిన్ గా మార్చుకుంటుంది.
నియాసిన్ సప్లిమెంట్ల వినియోగంతో పలు స్వల్ప దుష్పరిణామాలు కూడా ఉన్నాయి. చర్మంపై దురద, వేడిగా అనిపించడం, గ్యాస్ సమస్యలు, నోటిలో కొంత నొప్పిగా ఉండడం వంటివి తలెత్తవచ్చు. అందువల్ల వైద్యుల సూచనల మేరకు మాత్రమే వినియోగించాలి.
పాంటోథెనిక్ ఆమ్లంతో కొలెస్ట్రాల్ కంట్రోల్
బి కాంప్లెక్స్ కు చెందిన ఇతర విటమిన్ల తరహాలోనే బి5 విటమిన్ (పాంటోథెనిక్ ఆమ్లం) కూడా ఆహారం నుంచి శరీరానికి శక్తిని సమకూర్చడంలో అత్యంత కీలకం. ఇది చాలా రకాల ఆహార పదార్థాల్లో లభిస్తుంది. నాడీ వ్యవస్థ, కళ్లు, చర్మం, కాలేయం, వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండడానికి ఈ పాంటోథెనిక్ ఆమ్లం అవసరం. కణాల్లో జరిగే అనేక రసాయన ప్రక్రియలకు కీలకమైన కోఎంజైమ్-ఏ రూపంలో ఉండేది పాంటోథెనిక్ ఆమ్లమే. ఎర్ర రక్త కణాలు తయారు కావడానికి, జీర్ణ వ్యవస్థ సక్రమంగా కొనసాగడానికి, కొలెస్ట్రాల్ సంశ్లేషణకు తోడ్పడుతుంది. ముఖ్యంగా ఒత్తిడిని తగ్గించడానికి, లైంగిక హార్మోన్లను విడుదల చేయడానికి విటమిన్ బి5 చాలా అవసరం. రక్తంలో కొలెస్ట్రాల్ శాతం తక్కువగా ఉండేలా చేయడం ద్వారా గుండెకు, రక్త నాళాలకు మేలు చేస్తుంది.
లోపిస్తే.. కాళ్లలో మంటలు
సాధారణంగా విటమిన్ బి5 లోపం చాలా తక్కువ. తీవ్రమైన పోషకాహార లోపానికి గురైనవారికే ఈ సమస్య వచ్చే అవకాశముంది. దీని లోపం వల్ల ప్రత్యేకంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలేవీ వస్తున్నట్లుగా గుర్తించలేదు. అందువల్ల దీనిపై ప్రపంచవ్యాప్తంగా పెద్దగా పరిశోధనలు కూడా జరగలేదు. కానీ పాంటోథెనిక్ ఆమ్లం లోపం వల్ల కాళ్లు, పాదాల్లో తీవ్రమైన మంట మండే సమస్య వస్తుంది. ఇక ఆయాసం, చిరాకు, నిద్రలేమి, కుంగుబాటు, కడుపు నొప్పి, కాళ్ల మంటలు, కడుపు నొప్పి, శ్వాస వ్యవస్థ ఇన్ఫెక్షన్లు వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. అయితే బి కాంప్లెక్స్ కు చెందిన ఇతర ప్రధాన విటమిన్లు సమర్థవంతంగా పనిచేయడానికి పాంటోథెనిక్ ఆమ్లం అవసరం. ఏదైనా వ్యాధికి చికిత్స జరుగుతున్న సమయంలో సమర్థవంతమైన ఫలితాలు రావడానికి తోడ్పడుతుంది. గాయాలు త్వరగా మానడానికీ సహాయపడుతుంది.
పుట్టగొడుగులు, చిక్కుడు, బఠానీ వంటి కాయధాన్యాలు, పెసర, ఉలవలు వంటి పప్పు ధాన్యాలు, పాలు, గుడ్లు, కోడి మాంసం, చేపలు, పెరుగు, బ్రాకొలీ, క్యాబేజీ, చిలగడదుంప, తృణ ధాన్యాలు, కాలేయం, కిడ్నీలు వంటి వాటిలో పాంటోథెనిక్ ఆమ్లం ఎక్కువగా ఉంటుంది.
ఆరు నెలల్లోపు శిశువులకు రోజుకు 1.7 మిల్లీగ్రాముల విటమిన్ బి5 అవసరం. 7 నెలల నుంచి మూడేళ్ల చిన్నారులకు 2 మిల్లీగ్రాములు, మూడు నుంచి 13 ఏళ్ల వారికి 3.5 మిల్లీగ్రాములు, 14 ఏళ్లు దాటినవారికి రోజుకు 5 మిల్లీగ్రాములు అవసరం. గర్భిణులు, పిల్లలకు పాలిచ్చే బాలింతలు మరింత ఎక్కువగా ఈ విటమిన్ అందేలా చూసుకోవాలి.
పైరిడాక్సిన్ తో మంచి ఎదుగుదల
శరీర ఎదుగుదలకు, మెదడు ఆరోగ్యంగా ఉండడానికి అత్యంత ఆవశ్యకమైనది విటమిన్ బి6 (పైరిడాక్సిన్). పిండి పదార్థాలు, అమైనో ఆమ్లాలు, కొవ్వులు జీర్ణం కావడానికి ఇతర బి కాంప్లెక్స్ విటమిన్లతోపాటు పైరిడాక్సిన్ కూడా అవసరం. ముఖ్యంగా ప్రొటీన్ల సంశ్లేషణకు, ఎర్ర రక్త కణాలు ఏర్పడడానికి ఇది అత్యవసరం. అసలు భూమిపై మొట్ట మొదటి జీవజాలం ఎదుగుదలకు ఈ విటమినే కారణమని శాస్త్రవేత్తలు పేర్కొంటూ ఉంటారు. మన శరీరానికి పైరిడాక్సిన్ అవసరం ఎక్కువ. దాంతోపాటు ఇది శరీరంలో నిల్వ ఉండని కారణంగా ఎప్పటికప్పుడు అందేలా చూసుకోవడం ముఖ్యం. విటమిన్ బి6 లేకుండా మన శరీరం విటమిన్ బి12ను సంగ్రహించలేదు. వివిధ గ్రంథులు విడుదల చేసే హార్మోన్లను ఉత్తేజితం చేయడానికి, కణాల ఆరోగ్యానికి, శక్తి సద్వినియోగానికి ఇది తోడ్పడుతుంది. రక్తంలో హోమోసిస్టిన్ అనే అమినో ఆమ్లం స్థాయిలను పైరిడాక్సిన్ నియంత్రిస్తుంది. తద్వారా గుండెపోటు, వ్యాధులను దూరంగా ఉంచుతుంది. కిడ్నీలలో రాళ్లు ఏర్పడడాన్ని నిరోధిస్తుంది. మహిళలు, పిల్లల ఆరోగ్యానికి విటమిన్ బి6 కావాలి. గర్భంలో ఉన్న సమయంలో, పుట్టిన తర్వాత కొద్ది రోజుల వరకూ శిశువుల్లో మెదడు ఎదుగుదల కోసం, రోగనిరోధక శక్తి పెంపొందడం కోసం ఇది హెచ్చుస్థాయిలో అవసరం. ఇక మహిళల్లో రుతుక్రమానికి ముందు వచ్చే సమస్యలు (ప్రీ మెన్ స్ట్రువల్ సిండ్రోమ్), గర్భం దాల్చడం కోసం ఆందోళన, మోనోపాజ్ లక్షణాల నుంచి ఉపశమనం కోసం పైరిడాక్సిన్ తోడ్పడుతుంది. ఇక మార్నింగ్ సిక్ నెస్ (గర్భంతో ఉన్న మహిళల్లో వాంతులు కావడం) లక్షణాలను తగ్గించడానికి విటమిన్ బి6 తోడ్పడుతుందని స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ పరిశోధకులు గుర్తించారు.
నాడీ వ్యవస్థకు అత్యంత కీలకం
బి కాంప్లెక్స్ విటమిన్లు అన్నింటిలోకీ బి6 ప్రత్యేకమైనది. మెదడులో కొన్ని రకాల న్యూరో ట్రాన్స్ మిటర్లను ఇది తయారుచేస్తుంది. నాడీ కణాల్లో ఒక దాని నుంచి మరొకదానికి సమాచారాన్ని సరఫరా చేసే రసాయనాలనే న్యూరోట్రాన్స్ మిటర్స్ అంటారు. మెదడు ఆరోగ్యంగా ఉండడానికి, సమర్థవంతంగా పనిచేయడానికి, శరీరంలో వివిధ గ్రంథులు హార్మోన్లు తయారుచేయడానికి, మన భావావేశాలకు, నిద్ర స్థాయిలను నిర్దేశించేందుకు ఈ రసాయనాలు ఎంతో కీలకం. ఈ న్యూరో ట్రాన్స్ మిటర్స్ తగిన స్థాయిలో ఉత్పత్తి కాకపోవడం వల్ల కుంగుబాటు, గందరగోళం వంటి మానసిక సమస్యలు తలెత్తుతాయి. పెద్ద వయసు వారిలో అల్జీమర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లల్లో ఈ విటమిన్ లోపం కారణంగా ఫిట్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.
లోపిస్తే ఎన్నో సమస్యలు
ఇతర బి కాంప్లెక్స్ విటమిన్ల తరహాలోనే విటమిన్ బి6 (పైరిడాక్సిన్) కూడా చాలా రకాల ఆహార పదార్థాల్లో విస్తృతంగా లభిస్తుంది. కానీ ఇది శరీరంలో నిల్వ ఉండే అవకాశం లేనందున చాలా మందిలో స్వల్ప స్థాయిలో లోపం కనిపిస్తుంది. సరైన పోషకాహారం తీసుకోనివారు, ఆల్కాహాల్ ఎక్కువగా తీసుకునేవారు, హైపర్ థైరాయిడిజం, ఆటో ఇమ్యూన్ వ్యాధులు, కిడ్నీ సమస్యలు ఉన్నవారిలో, జీర్ణాశయానికి సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నవారిలో పైరిడాక్సిన్ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ లోపం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బాగా బలహీనపడుతుంది. రక్తహీనత ఏర్పడుతుంది. చర్మంపై దద్దుర్లు, మంటలు, పెదవులు పగలడం, నోటి మూలల్లో పగుళ్లు, నాలుక వాపు, అల్సర్లతో పాటు మానసిక కుంగుబాటు (డిప్రెషన్), గందరగోళం వంటివి తలెత్తుతాయి. అరచేతులు, పాదాల్లో తిమ్మిర్లు వస్తాయి.
14 నుంచి 50 ఏళ్లలోపు స్త్రీ, పురుషులకు రోజుకు 1.3 మిల్లీగ్రాముల విటమిన్ బి6 అవసరం. 50 ఏళ్లు పైబడిన పురుషులకు 1.7, స్త్రీలకు 1.5 మిల్లీగ్రాముల చొప్పున అందాలి. ఇక ఆరు నెలల్లోపు చిన్నారులకు 0.1 మిల్లీగ్రాములు, ఆర్నెల్ల నుంచి మూడేళ్ల వరకు 0.5, నాలుగు నుంచి 13 ఏళ్ల వరకు 1 మిల్లీగ్రాము, గర్భిణులు, పిల్లలకు పాలిస్తున్న బాలింతలకు 2 మిల్లీగ్రాములు పైరిడాక్సిన్ అవసరం.
బీన్స్, చికెన్, మాంసం, కాలేయం, గుడ్లు, చేపలు, ఆకుకూరలు, బొప్పాయి, నారింజ, తర్బూజ, అరటిపండ్లు, తృణధాన్యాల్లో పైరిడాక్సిన్ లభిస్తుంది. అయితే ఎక్కువగా వేడి చేయడం వల్ల ఇది నశిస్తుంది.
విటమిన్ బి6 మోతాదు చాలా ఎక్కువైతే నీరసం, నాడులు దెబ్బతినడం, ఎండ పడకపోవడం, తలతిరగడం వంటి దుష్పరిణామాలు తలెత్తుతాయి.
బయోటిన్ తో అందం కూడా..
ఆరోగ్యంతోపాటు అందానికి కూడా తోడ్పడే విటమిన్ బయోటిన్ (విటమిన్ బి7). శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరగడానికి, అత్యంత ముఖ్యమైన ఎంజైములను తయారు చేయడానికి, గర్భంలో శిశువు ఎదగడానికి ఈ విటమిన్ అత్యవసరం. అంతేకాదు గోళ్లు, వెంట్రుకలు బలంగా పెరగడానికి, చర్మం ఆరోగ్యంగా ఉండడానికి ఇది తోడ్పడుతుంది. అందుకే దీనిని విటమిన్ హెచ్ (హెయిర్ విటమిన్) అని పిలుస్తుంటారు. మిగతా బి కాంప్లెక్స్ విటమిన్ల తరహాలోనే చర్మం, నాడీ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి, ఆరోగ్యంగా ఉండడానికి బయోటిన్ తోడ్పడుతుంది. శరీరంలో ఫ్యాటీ యాసిడ్లను, గ్లూకోజ్ ను తయారు చేయడానికి అవసరమవుతుంది. చిన్న పిల్లల్లో చర్మ రుగ్మతలను తగ్గించడానికి తోడ్పడుతుంది. మల్టీపుల్ స్ల్కీరోసిస్, మధుమేహం వ్యాధుల లక్షణాలను తగ్గిస్తుంది.
లోపిస్తే..
బయోటిన్ ఆహార పదార్థాల ద్వారా స్వల్పంగానే లభిస్తుంది. కానీ మన శరీరంలోని చిన్న పేగుల్లో ఉండే బ్యాక్టీరియా బయోటిన్ ను సంశ్లేషణ చేస్తుంది. అందువల్ల దీని లోపం పెద్దగా కనిపించదు. ఆల్కాహాల్ ఎక్కువగా తీసుకోవడం, ధూమపానం, సరైన పోషకాహారాన్ని తీసుకోకపోవడం, అతిగా యాంటీ బయాటిక్స్ వినియోగించడం ద్వారా బయోటిన్ లోపం ఏర్పడుతుంది. దీని లోపం వల్ల గోళ్లు పెళుసుబారిపోతాయి. వెంట్రుకలు సన్నబడి రాలిపోతాయి. నీరసం, కండరాల నొప్పులు, చర్మ రుగ్మతలు, గందరగోళం, తీవ్రమైన నీరసం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. బయోటిన్ లోపంతో గుండె సమస్యలూ వచ్చే అవకాశముంది. గర్భిణుల్లో, పిల్లలకు పాలిచ్చే బాలింతల్లో బయోటిన్ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. వారికి సరైన పోషకాహారంతోపాటు సప్లిమెంట్ల రూపంలోను అందజేయాల్సి ఉంటుంది.
కొన్ని ముఖ్యమైన అంశాలు
18 ఏళ్లు దాటిన సాధారణ వ్యక్తులకు రోజుకు 30 మైక్రోగ్రాముల వరకు బయోటిన్ అవసరం. ఆరు నెలల్లోపు చిన్నారులకు 5 మైక్రోగ్రాములు, ఏడు నెలల నుంచి మూడేళ్ల వారికి 8, నాలుగేళ్ల నుంచి ఎనిమిదేళ్లవారికి 12, తొమ్మిదేళ్ల నుంచి 18 ఏళ్లవారికి 20-25 మైక్రోగ్రాముల విటమిన్ బి7 అవసరం.
బయోటిన్ ముఖ్యంగా కాలేయం, చికెన్, కాలీఫ్లవర్, క్యారెట్లు, అరటి, సోయా పిండి, ఈస్ట్, పొట్టు తీయని ధాన్యాలు, గుడ్లు, పాలు, పాల ఉత్పత్తులు, వేరుశనగ వంటి నూనె గింజల్లో లభిస్తుంది.
బయోటిన్ ను తీసుకోవడం ద్వారా మహిళల్లో శిరోజాలు ఎదుగుదల పెరిగినట్లుగా ఆల్బన్ స్కిన్ ఇనిస్టిట్యూట్ రీసెర్చ్ సెంటర్, కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తల సంయుక్త పరిశోధనలో వెల్లడైంది.
టైప్-2 మధుమేహంతో బాధపడుతున్నవారికి బయోటిన్ తోపాటు క్రోమియం పికోలినేట్ కలిపి చికిత్స అందిస్తే.. వారిలో గ్లూకోజ్ జీవక్రియ మెరుగవుతుందని అమెరికాలోని ఆల్ఫా థెరపీ వైద్యులు గుర్తించారు. అంతేగాకుండా మధుమేహం వల్ల నాడీ కణాలు దెబ్బతినడాన్ని కూడా నియంత్రిస్తుందని వారు చెబుతున్నారు.
అమ్మలాంటి ఫోలిక్ యాసిడ్
బి కాంప్లెక్స్ విటమిన్లలో అత్యంత ముఖ్యమైనది విటమిన్ బి9 (ఫోలిక్ యాసిడ్). ముఖ్యంగా గర్భిణులకు ఇది అత్యంత ఆవశ్యకం. ఇది ఫోలేట్, ఫోలిక్ యాసిడ్ అనే రెండు రూపాల్లో ఉంటుంది. శరీరం ఎదుగుదల, మంచి ఆరోగ్యం కోసం ఈ విటమిన్ తోడ్పతుంది. విటమిన్ బి12తో కలసి ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. కణాల్లోని జన్యు పదార్థాలైన డీఎన్ఏ, ఆర్ ఎన్ఏల తయారీలో ఇది కీలకం. ఇక మెదడు పనితీరును మెరుగుపర్చడంతోపాటు మానసిక, ఉద్వేగపూరిత ప్రవర్తనకు, ఆరోగ్యానికి ఫోలిక్ యాసిడ్ తోడ్పడుతుంది. ముఖ్యంగా శరీరంలో కణాల పెరుగుదల వేగం చాలా ఎక్కువగా ఉండే సమయాల్లో.. అంటే చిన్నారులు, యుక్త వయసులో, గర్భంతో ఉన్న మహిళలకు ఫోలేట్ చాలా అవసరం. ఇక రక్తంలో హోమోసిస్టీన్ స్థాయులను తగ్గించి తద్వారా గుండెకు మేలు చేస్తుంది. మతిమరపు, అల్జీమర్స్, వృద్ధాప్యంలో వచ్చే మానసిక సమస్యలను నియంత్రించడంలో ఫోలిక్ యాసిడ్ సహకరిస్తుంది. గ్యాస్ట్రిక్ (జీర్ణాశయ సంబంధిత) కేన్సర్లు వచ్చే అవకాశాన్ని ఫోలిక్ యాసిడ్ తగ్గిస్తుందని షాంఘై సెకండ్ మెడికల్ యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు.
గర్భిణులు తప్పనిసరిగా తీసుకోవాల్సిందే.
గర్భంతో ఉన్న మహిళల్లో శరీరంలో కొత్త కణాల పెరుగుదల ఎక్కువ స్థాయిలో ఉంటుంది. అదే సమయంలో గర్భంలో శిశువు నాడీ వ్యవస్థ ఎదుగుదలకు ఫోలేట్ అత్యవసరం. గర్భం ధరించిన తొలి రోజుల్లో పిండం ఎదుగుదలలో కీలకమైన వెన్నెముక, నరాలు ఏర్పడుతాయి. ఈ దశలో తగినంత ఫోలేట్ అందకపోతే వెన్నెముకకు సంబంధించిన ‘న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్’ వచ్చే అవకాశముంది. ఇక నాడీ సంబంధిత లోపాలు, వెన్నెముక చీలిక వ్యాధి ఉండే ప్రమాదం ఉంది. దీనివల్ల నడుము కింది భాగం పక్షవాతానికి గురికావడమేకాదు.. మానసిక వికలాంగులుగా మారిపోతారు. ఇక తగినంత ఫోలిక్ యాసిడ్ లేకపోతే నెలలు నిండకుండానే ప్రసవమయ్యే అవకాశం ఉంటుంది. గర్భస్రావం కూడా జరుగవచ్చు. ఫోలేట్ లోపం అలాగే కొనసాగితే భవిష్యత్తులో గర్భధారణ సమస్యలు తలెత్తుతాయి. పిల్లలకు పాలిచ్చే బాలింతలకు కూడా ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా అవసరం. అందువల్ల వారు ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలతోపాటు వైద్యుల సూచనల మేరకు విటమిన్ సప్లిమెంట్లు కూడా తీసుకోవడం అత్యవసరం.
లోపిస్తే రక్త హీనత
ఫోలేట్, ఫోలిక్ యాసిడ్ రెండూ సాధారణంగా మనకు ఆహార పదార్థాల నుంచి లభిస్తాయి. ఆహారాన్ని ఎక్కువగా ఉడికించడం, సరైన పోషకాహారం తీసుకోకపోవడం, ఆల్కాహాల్, ధూమపానం వంటివి విటమిన్ బి9 లోపానికి కారణమవుతాయి. లోపం కారణంగా రక్త హీనత ఏర్పడుతుంది. ఫోలేట్ లోపిస్తే పెద్ద వయసు వారిలో ఎముకలు గుల్లబారిపోయి, విరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. నాలుకపై అల్సర్లు, నొప్పి, చర్మ సమస్యలు, వెంట్రుకలు సన్నబడి రాలిపోవడం, చేతి గోర్లపై మచ్చలు, పెళుసుగా మారడం వంటి సమస్యలు వస్తాయి. నీరసం, అలసట, మగతగా ఉంటుంది. బరువు తగ్గిపోతారు. రక్తంలో ఫోలేట్ శాతాన్ని పరీక్షించడం ద్వారా దీని లోపాన్ని గుర్తిస్తారు.
ఎంత అవసరం..
సాధారణ వ్యక్తులకు రోజుకు 400 మైక్రోగ్రాముల విటమిన్ బి9 అవసరం. అదే గర్భిణులు, పిల్లలకు పాలిచ్చే బాలింతలకు 600 మైక్రోగ్రాముల వరకు అవసరం.
పాలకూర, తోటకూర వంటి ఆకుకూరలు, కాలేయం, మాంసం, చేపలు, పాలు, గుడ్లు, ఈస్ట్, కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, బీన్స్, చిక్కుడు జాతి గింజలు, పప్పుధాన్యాలు, నారింజ, వేరుశనగ, పుట్టగొడుగుల్లో విటమిన్ బి9 లభిస్తుంది.
దీర్ఘకాలంపాటు అధిక మోతాదులో విటమిన్ బి9ను తీసుకుంటే పలు దుష్పరిణామాలు తలెత్తుతాయి. కడుపులో తిమ్మిరి, చిరాకు, మానసిక సమస్యలు, నిద్ర లేమి, డయేరియా, దద్దుర్లు, చర్మ సమస్యలు, వికారం, గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మరీ ఎక్కువ మోతాదులో తీసుకున్నవారికి గుండె పోటు వచ్చే ప్రమాదమూ ఉంది.
సయానో కోబాలమైన్ తో సంపూర్ణ ఆరోగ్యం
శరీరానికి అత్యంత ముఖ్యమైన విటమిన్లలో విటమిన్ బి12 ప్రధానమైనది. దీని రసాయనిక నామం సయానో కోబాలమైన్. శరీరంలోని దాదాపు అన్ని ప్రధాన అంగాలు ఆరోగ్యకరంగా ఉండడానికి ఇది అవసరం. ముఖ్యంగా మెదడు, నాడీ వ్యవస్థ, ఎర్ర రక్త కణాలు, డీఎన్ఏ, ప్రొటీన్లు, హార్మోన్లు తయారుకావడానికి ముఖ్యమైనది సయానో కోబాలమైన్. రోగ నిరోధక వ్యవస్థను ఇది బలోపేతం చేస్తుంది. మానసిక స్థితిని చైతన్యవంతం చేస్తుంది. ఏకాగ్రతను పెంచుతుంది. బ్రెస్ట్ కేన్సర్, ఊపిరితిత్తులు, సర్వైకల్ కేన్సర్లను నిరోధించడానికి తోడ్పడుతుంది. పురుషుల్లో వ్యంధ్యత్వం, నిద్రలేమి సమస్యలు, మానసిక కుంగుబాటు, మల్టీపుల్ స్క్లీరోసిస్, అలర్జీలు, చర్మ సమస్యలకు చేసే చికిత్సలో విటమిన్ బి12 సప్లిమెంట్లను కూడా వైద్యులు ఇస్తారు.
నాలుగైదేళ్ల దాకా నిల్వ..
సాధారణంగా బి కాంప్లెక్స్ విటమిన్లు అవసరానికి మించి శరీరంలో ఉంటే మూత్రం ద్వారా విసర్జించబడతాయి. కానీ ఒక్క విటమిన్ బి12 (సయానో కోబాలమైన్) మాత్రం శరీరంలోని కాలేయం, ఇతర కణజాలాల్లో నిల్వ ఉంటుంది. అందువల్ల దీని లోపం ప్రారంభమైనా మూడు నుంచి ఐదేళ్ల వరకు బయటపడదు. అయితే కాలేయ సంబంధిత వ్యాధులు, సమస్యలున్నవారిలో విటమిన్ బి12 నిల్వ ఉండదు. దాంతో వెంటనే లోపం కనిపించే అవకాశం ఉంటుంది. ఇక గ్యాస్ సమస్య, ఇతర గ్యాస్ట్రో ఎంటరాలజీ సమస్యల కారణంగా యాంటాసిడ్ మాత్రలు ఉపయోగించే వారిలో విటమిన్ బి12 శరీరానికి అందదు. వారు మరింతగా విటమిన్ బి12 తీసుకోవాల్సి ఉంటుంది.
శాకాహారుల్లో లోపం ఎక్కువ..
విటమిన్ బి12 ఎక్కువగా మాంసాహారంలోనే లభిస్తుంది. అందువల్ల శాకాహారుల్లో దీని లోపం ఎక్కువగా కనిపిస్తుంది. దాంతోపాటు వయసు మీదపడినవారికి, గర్భిణులకు సయానో కోబాలమైన అవసరం చాలా ఎక్కువ. చిన్నపేగుల్లో బ్యాక్టీరియా ఎక్కువగా చేరడం, ఇన్ ఫ్లమేటరీ బొవెల్ డిసీజ్ (జీర్ణాశయం, చిన్న పేగులకు సంబంధించిన వ్యాధి), టేప్ వార్మ్ ఇన్ఫెక్షన్, ఎయిడ్స్, యాంటాసిడ్ మందుల వినియోగం, జీర్ణాశయంలో ఆమ్లత్వం తగ్గిపోవడం (పెద్ద వయసువారిలో కనిపిస్తుంది), రోగ నిరోధక వ్యవస్థ అతి చురుకుదనం వంటివాటి కారణంగా బి12 లోపం ఏర్పడుతుంది. ఈ లోపం వల్ల రక్త హీనత, ఆకలి మందగించడం, నీరసం, బలహీనత, కుంగుబాటు, ఆలోచించలేకపోవడం, చేతులు, కాళ్లు వణకడం, సరిగా నడవలేకపోవడం, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, నోరు, నాలుక వాపు, నొప్పులు, భయానకమైన ఊహలు, చనిపోతామేమోనన్న భయం (పారానోయియా) వంటి లక్షణాలు తలెత్తుతాయి.
50 ఏళ్లు పైబడినవారిలో జీర్ణాశయం లోపలిపొర సన్నబడడం ద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతాయి. దాంతో వారిలో శరీరం విటమిన్ బి12ను సరిగా సంగ్రహించలేదు. మరికొంత మందిలో విటమిన్ బి12ను ఆహారం నుంచి సంగ్రహించే ప్రొటీన్ (ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్) సరిగా ఉత్పత్తి కాదు. అలాంటి వారు మరింతగా విటమిన్ బి12 అందేలా చూసుకోవాలి. 60 ఏళ్లు పైబడిన వారిలో దీని లోపం కారణంగా నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. ఇక గర్భిణుల్లో విటమిన్ బి12 స్థాయులు తక్కువగా ఉంటే.. పుట్టబోయే పిల్లలపై ప్రభావం పడుతుంది. రక్తంలో సయానో కోబాలమైన్ శాతాన్ని పరీక్షించడం ద్వారా దీని లోపాన్ని గుర్తించవచ్చు.
ఎంత అవసరం
సాధారణ వ్యక్తులకు రోజుకు 2.4 మైక్రోగ్రాముల విటమిన్ బి12 అవసరం. గర్భిణులు, పిల్లలకు పాలిస్తున్న బాలింతలకు 2.8 మైక్రోగ్రాములు కావాలి.
దాదాపు అన్ని రకాల మాంసాహారాల్లో విటమిన్ బి12 లభిస్తుంది. ముఖ్యంగా నత్తలు, పీతలు, చేపలు, కాలేయంలలో అత్యధిక మోతాదులో ఉంటుంది. ఇక పాలు, పాల పదార్థాల్లోనూ లభిస్తుంది.
సాధారణ రక్త పరీక్షల ద్వారా కూడా విటమిన్ బి12 లోపాన్ని గుర్తించవచ్చు. ఈ లోపమున్నవారి రక్తంలోని ఎర్రరక్త కణాలు నిర్ధారిత పరిమాణానికి మించి పెద్దగా ఉంటాయి. అవసరమైతే ఎండోస్కొపీ ద్వారా జీర్ణాశయం లోపలి కణాలను పరిశీలిస్తారు.
ఈ విటమిన్ లోపం ఉన్నవారు సప్లిమెంట్ల రూపంలో తీసుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ఇంజెక్షన్ రూపంలోనూ ఇస్తారు. దీని మోతాదు మించడం వల్ల పెద్దగా దుష్ప్రభావాలేమీ ఉండవని వైద్య నిపుణులు చెబుతున్నారు.
వీటిని ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిందే..బి, సి విటమిన్లు నీటిలో కరిగే విటమిన్లు. ఇవి చాలా రకాల ఆహార పదార్థాల ద్వారా శరీరానికి అందుతాయి. కానీ వీటికి స్థిరత్వం తక్కువ. ఎక్కువగా వేడి చేస్తే నశించిపోతాయి. అంటే ఆహారాన్ని ఎక్కువగా ఉడికించినా, ఫ్రైలు, వేపుళ్లు వంటివి చేసినా ఈ విటమిన్లు నశిస్తాయి. దీంతో శరీరానికి బి, సి విటమిన్లు అందక లోపం ఏర్పడుతుంది.
ఆహార పదార్థాలను తాజాగా ఉంచుకోవాలి. నేరుగా ఎండ, వేడి వాతావరణంలో ఉంచవద్దు. అవసరమైతే రిఫ్రిజిరేటర్ లో పెట్టుకోవచ్చు. కానీ ఎక్కువ రోజులు నిల్వ చేయవద్దు.
ఆహారాన్ని ఎక్కువగా వేడి చేయవద్దు. లేదా తాజా పండ్లు, పచ్చి కూరగాయలు తీసుకోవాలి.
కూరగాయలు ఉడికించిన నీటిని పారబోయకుండా.. సూప్ ల తయారీకి వినియోగించుకోవాలి.
రోజూ కనీసం ఒక నిమ్మ (సిట్రస్) జాతికి చెందిన పండును తినాలి.