ఫొటోలు: న్యూఢిల్లీ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

  • పాల‌మూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా క‌ల్పించాలి.. 
  • పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న హామీలు నెర‌వేర్చాలి.
  • రాష్ట్రానికి రావ‌ల్సిన నిధుల‌ను వెంట‌నే విడుద‌ల చేయాలి 
  • పాల‌మూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా క‌ల్పించాల‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క విజ్ఞ‌ప్తి చేశారు.

రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం రెండు రాష్ట్రాల్లోనూ ఒక్కో ప్రాజెక్టుకు జాతీయ హోదా క‌ల్పిస్తామ‌ని తెలిపార‌ని, అందుకు అనుగుణంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పోల‌వ‌రం ప్రాజెక్టుకు జాతీయ హోదా క‌ల్పించినందున తెలంగాణ‌లోనూ అదే మాదిరి పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాల‌ని వారు కోరారు. తెలంగాణ‌లో కొత్త ప్ర‌భుత్వం కొలువు దీరిన త‌ర్వాత ముఖ్య‌మంత్రి, ఉప ముఖ్య‌మంత్రి తొలిసారిగా దిల్లీలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని ఆయ‌న నివాసంలో మంగ‌ళ‌వారం సాయంత్రం మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రానికి సంబంధించిన ప‌లు సమ‌స్య‌ల‌ను వారు ప్ర‌ధాన‌మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆంధ్రప్ర‌దేశ్ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం 2015 నుంచి 2021 వ‌ర‌కు ప్ర‌తి ఏటా రూ.450 కోట్లు చొప్పున రూ.2250 కోట్ల‌ను కేంద్రం విడుద‌ల చేసింద‌ని, 2019- 20, 21-22, 22-23, 23-24 సంవ‌త్స‌రాల‌కు సంబంధించి పెండింగ్ గ్రాంట్లు రూ.1800 కోట్లు విడుద‌ల చేయాల‌ని వారు ప్ర‌ధాన‌మంత్రిని కోరారు. పెండింగ్‌లో ఉంచిన 15వ ఆర్థిక

సంఘం నిధులు రూ.2233.54 కోట్లు (2022-23కు సంబంధించి రూ.129.69 కోట్లు, 2023-24కు సంబంధించి రూ.1608.85 కోట్లు) వెంట‌నే విడుద‌ల చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

ముఖ్య‌మంత్రి, ఉప ముఖ్య‌మంత్రి ప్ర‌ధాన‌మంత్రి దృష్టికి తీసుకెళ్లిన అంశాలు..

  • రాష్ట్రంలో 14 ర‌హ‌దారుల‌ను జాతీయ ర‌హ‌దారులుగా అప్‌గ్రేడ్ చేయాల‌ని ప్ర‌తిపాద‌న‌లు పంపించాం. అందులో కేవ‌లం రెండింటికే ఆమోదం తెలిపారు. మిగ‌తా 12 ర‌హ‌దారుల అప్‌గ్రేడ్‌న‌కు ఆమోదం తెల‌పాలి
  • ములుగులోని గిరిజ‌న విశ్వ‌విద్యాల‌యం ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. 2023-24 విద్యా సంవ‌త్స‌రంలో ప్ర‌వేశాల‌కు అనుమ‌తి ఇవ్వాలి.
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం పూర్వ ఖ‌మ్మం జిల్లాలో ఉక్కు కర్మాగారం (బ‌య్యారం స్టీల్ ప్లాంట్‌) ఏర్పాటుకు కేంద్రం హామీ ఇచ్చినందున దానిని వెంట‌నే నెర‌వేర్చాలి. అలాగే కాజీపేటలో కోచ్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటు చేయాల్సి ఉండ‌గా పీరియాడిక‌ల్ ఓవ‌ర్‌హాలింగ్ వ‌ర్క్‌ షాప్ ఏర్పాటు చేస్తామ‌ని రైల్వే శాఖ ప్ర‌క‌టించింది. దానికి అద‌నంగా కోచ్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటు చేయాలి..
  • 2010లో నాటి కేంద్ర ప్ర‌భుత్వం బెంగ‌ళూర్‌, హైద‌రాబాద్‌ల‌కు ఐటీఐఆర్‌ను ప్ర‌క‌టించింది. కానీ 2014లో కేంద్రంలో ప్ర‌భుత్వం మారిన త‌ర్వాత హైద‌రాబాద్ ఐటీఐఆర్‌ను ప‌క్క‌న‌పెట్టారు.. హైద‌రాబాద్ ఐటీఐఆర్‌ను వెంట‌నే పున‌రుద్ధ‌రించాలి..
  • పీఎం మిత్ర కింద గుర్తించిన ఏడు మెగా జౌళి పార్కుల్లో వ‌రంగ‌ల్‌లోని కాక‌తీయ మెగా జౌళి పార్కును బ్రౌన్ ఫీల్డ్ పార్కుగా ప్ర‌క‌టించడంతో దానికి రావ‌ల్సిన‌న్ని నిధులు రానందున వెంట‌నే దానిని గ్రీన్‌ఫీల్డ్‌ లోకి మార్చాలి..
  • ప్ర‌తి రాష్ట్రానికి ఐఐఎం మంజూరు చేయాల‌నే ప్ర‌తిపాద‌న ఉంది.. తెలంగాణ‌లో ఐఐఎం లేనందున హైద‌రాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు చేయాలి.. అందుకు త‌గిన స్థ‌లం అందుబాటులో ఉంది. కేంద్రం కోరితే ఐఐఎం ఏర్పాటుకు అవ‌సర‌మైన స్థ‌లం ఇవ్వ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంది.
  • ఉమ్మ‌డి రాష్ట్రంలో ఉన్న రెండు సైనిక పాఠ‌శాల‌లు రాష్ట్ర విభ‌జ‌న‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వెళ్లిపోయాయి. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో సైనిక స్కూల్ లేనందున సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో సైనిక పాఠ‌శాల ఏర్పాటు చేయాలి.
  • భార‌తీయ సైన్యానికి సంబంధించిన ప్ర‌ధాన కార్యాల‌యాలు అన్ని ప్రాంతాల్లో ఉన్నా ద‌క్షిణాదిలో లేనందున పుణెలో ఉన్న ప్ర‌ధాన కార్యాల‌యాన్ని సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు త‌ర‌లించాలి.
  • రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం తొమ్మిదో షెడ్యూల్‌లోని ప్ర‌భుత్వ సంస్థ‌ల విభ‌జ‌న‌, ప‌దో షెడ్యూల్‌లోని సంస్థ‌ల అంశాల‌ను ప‌రిష్క‌రించాలి. ఢిల్లీలోని ఉమ్మ‌డి భ‌వ‌న్ విభ‌జ‌న‌కు స‌హ‌క‌రించాలి. 

 

More Press News