20 ఏళ్ల త‌ర్వాత‌.. మ‌న‌సారా న‌వ్వింది!

* ఇన్నాళ్లూ ఆమె న‌వ్వితే.. మూత్రం లీకేజి

* ద‌గ్గినా, తుమ్మినా బ‌య‌ట‌కొస్తున్న మూత్రం

* శ‌స్త్రచికిత్స‌తో న‌యం చేసిన ఏఐఎన్‌యూ వైద్యురాలు

* స‌మ‌స్య ఉంటే వైద్యుల‌ను సంప్ర‌దించాలి:  డాక్ట‌ర్ సారికా పాండ్యా
 

హైద‌రాబాద్, అక్టోబ‌ర్ 20th, 2023: ఆమె వ‌య‌సు 72 సంవ‌త్స‌రాలు. గ‌త 20 ఏళ్లుగా ఆమె న‌వ్వు వ‌చ్చినా బ‌ల‌వంతాన ఆపుకోవాల్సి వ‌చ్చేది. ఎందుకంటారా.. న‌వ్వితే ఆమెకు మూత్రం దానంత‌ట అదే వ‌చ్చేస్తుంది. న‌వ్వ‌డ‌మే కాదు.. కాస్త ద‌గ్గినా, ఒక‌సారి తుమ్మినా, చివ‌ర‌కు చిన్న‌పాటి బ‌రువులు ఎత్తినా కూడా అప్ర‌య‌త్నంగా మూత్రం లీక‌వుతున్న వృద్ధురాలికి న‌గ‌రంలోని ప్ర‌ధాన ఆస్ప‌త్రుల‌లో ఒక‌టైన ఏషియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్  నెఫ్రాల‌జీ అండ్ యూరాల‌జీ (ఏఐఎన్‌యూ)లో శ‌స్త్రచికిత్స చేసి ఊర‌ట క‌ల్పించారు. ఇన్నాళ్లూ డైప‌ర్లు వాడ‌టం త‌ప్ప‌నిస‌రి అయిన ఆమెకు ఇక ఆ అవ‌స‌రం లేకుండా చేశారు. ఆస్ప‌త్రికి చెందిన మ‌హిళా యూరాల‌జీ విభాగాధిప‌తి డాక్ట‌ర్ సారికా పాండ్యా ఇందుకు సంబంధించిన వివ‌రాలు తెలిపారు.

 
"న‌గ‌రంలోని సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన 72 ఏళ్ల వృద్ధురాలికి దాదాపు 20 ఏళ్లుగా ఈ స‌మ‌స్య ఉంది. కొన్నాళ్లు దీన్ని చిన్న స‌మ‌స్య‌గానే కొట్టిపారేశారు. త‌ర్వాత వ‌య‌సుతోపాటే స‌హ‌జం అనుకున్నారు. చివ‌ర‌కు రోజంతా త‌ప్ప‌నిస‌రిగా డైప‌ర్లు వాడాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇప్పుడు ఇటీవ‌లి కాలంలో కొద్దిగా న‌వ్వినా కూడా మూత్రం దానంత‌ట అదే వ‌చ్చేస్తోంది. దాంతో చాలాసార్లు న‌వ్వు బిగ‌బ‌ట్టుకోవాల్సి వ‌స్తోంది. స‌మ‌స్య తీవ్రం అవ్వ‌డంతో ఆమె ఇటీవ‌ల న‌గ‌రంలోని వేరే ప్రాంతంలో ఉన్న ఏఐఎన్‌యూ కేంద్రానికి వెళ్లారు. కానీ అక్క‌డ పురుష యూరాల‌జిస్టు ఉండ‌టంతో, ఆమె మొహ‌మాట‌ప‌డి.. మ‌హిళా యూరాల‌జిస్టే కావాల‌ని అడిగారు. దాంతో ఆయ‌న సూచ‌న మేర‌కు బంజారాహిల్స్‌లోని మెయిన్ బ్రాంచికి వ‌చ్చి న‌న్ను సంప్ర‌దించారు.  ఆమెకు ఉన్న స‌మ‌స్య‌ను స్ట్రెస్ యూరిన‌రీ ఇన్‌కాంటినెన్స్ (ఎస్‌యూఐ) అంటారు. ఆమెకు యూరోడైన‌మిక్ స్ట‌డీ, ఇత‌ర ప‌రీక్ష‌లు చేసి.. ఇది కాక ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయేమోన‌ని చూశాం. ఆమెకు కొద్దిగా ద‌గ్గినా మూత్రం వ‌స్తోంద‌న్న విష‌యాన్ని యూరోడైన‌మిక్ స్ట‌డీలో గుర్తించాం.  అప్పుడు ఆమెకు స్ట్రెస్ ఇన్‌కాంటినెన్స్ స‌ర్జ‌రీ అనే శ‌స్త్రచికిత్స చేయించుకోవాల్సిందిగా సూచించాం. శ‌స్త్రచికిత్స చేసిన‌ప్పుడు ఆమె మూత్ర‌ద్వారం కింద ఒక మెష్ పెట్టాం. అది హెర్నియా వ‌చ్చిన‌ప్పుడు పెట్టేలాంటిదే. అది ఎలాంటి కార్య‌క‌లాపాలు చేసినా మూత్ర‌ద్వారానికి ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంది. దానివ‌ల్ల మూత్ర‌విస‌ర్జ‌న దానంత‌ట అదే అవ్వ‌కుండా ఆగుతుంది. అన్నీ సాధార‌ణంగా ఉండటంతో ఆమెను డిశ్చార్జి చేశాం. ఇప్పుడు ఆమె డైప‌ర్లు వాడాల్సిన అవ‌స‌రం పోయింది. హాయిగా న‌వ్వ‌గ‌లుగుతున్నారు. గ‌తంలో ప‌దిమందిలోకి రావ‌డానికి ఇబ్బందిప‌డేవారు. ఇప్పుడు ఎలాంటి భ‌యం లేకుండా వ‌చ్చేస్తున్నారు. ఆమె కుమార్తెకు కూడా ఇలాంటి స‌మ‌స్యే ఉంది, కానీ ఇన్నాళ్లూ ఆమె కూడా చూపించుకోలేదు. ఇప్పుడు త‌న త‌ల్లికి పూర్తిగా న‌యం కావ‌డంతో ఆమె కూడా చికిత్స కోసం మా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చారు.

 
మ‌హిళ‌ల్లో సాధార‌ణంగా గ‌ర్భ‌ధార‌ణ స‌మ‌యంలో గానీ, ప్ర‌స‌వం అప్పుడు గానీ (అది సాధార‌ణ‌మైనా, సిజేరియ‌న్ అయినా) ఈ స‌మ‌స్య మొద‌ల‌య్యే అవ‌కాశం ఉంది. కొన్నిసార్లు 16-18 ఏళ్ల యువ‌తుల‌కు సైతం కండ‌రాల బ‌ల‌హీన‌త వ‌ల్ల ఈ మూత్రం లీకేజి స‌మ‌స్య వ‌స్తుంది. స‌మ‌స్య వ‌చ్చిన తొలినాళ్ల‌లోనే.. అంటే కొద్ది చుక్క‌లు మాత్ర‌మే వ‌స్తున్న‌ప్పుడు, అలాగే రోజులో మ‌రీ ఎక్కువ‌సార్లు రాకుండా ఉన్న‌ప్పుడే వైద్యుల‌ను సంప్ర‌దించాలి. అప్పుడు వారికి శ‌స్త్రచికిత్స చేయాల్సిన అవ‌స‌రం లేకుండా కెగ‌ల్స్ ఎక్స‌ర్‌సైజ్ అనే వ్యాయామం సూచిస్తాం. ఇంకా అవ‌స‌ర‌మైతే కొన్ని మందులు ఇస్తాం. వాటిని చేస్తే స‌మ‌స్య న‌య‌మైపోతుంది. అలా కాకుండా స‌మ‌స్య ఎక్కువ అయ్యేవ‌ర‌కు చూపించుకోక‌పోతే.. అప్పుడు త‌ప్ప‌నిస‌రిగా శ‌స్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. అది ఇక జీవితాంతం ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంది.

 ప్ర‌పంచ‌వ్యాప్తంగా సుమారు 20-30% మంది మ‌హిళ‌ల‌కు ఈ స‌మ‌స్య ఉంటుంది. కొంద‌రు పురుషుల్లోనూ ఈ స‌మ‌స్య క‌నిపిస్తుంది. అలాంటివారు వెంట‌నే యూరాల‌జిస్టును సంప్ర‌దిస్తే ఎక్కువ కాలం ఇబ్బంది ప‌డాల్సిన అవ‌స‌రం త‌ప్పుతుంది" అని డాక్టర్ సారికా పాండ్యా వివ‌రించారు.

More Press News