ఐదేళ్ల పాప‌కు అరుదైన మూర్ఛ‌ వ్యాధి

* రోజుకు 80-100 సార్లు ఆబ్సెన్స్ సీజర్స్

* సాధార‌ణ మూర్ఛ కూడా ఉండ‌టంతో గుర్తించిన తల్లిదండ్రులు

* ల‌క్ష మంది పిల్ల‌ల్లో 5-10 మందికే వ‌చ్చే అత్యంత అరుదైన స‌మ‌స్య‌

* క‌ర్నూలు కిమ్స్ ఆస్ప‌త్రిలో ఆరోగ్య‌శ్రీ‌లో ఉచితంగా చికిత్స‌

* స‌రిగా గుర్తించ‌క‌పోతే తీవ్ర‌మైన స‌మ‌స్య‌లు

 
క‌ర్నూలు, సెప్టెంబ‌ర్ 23, 2023: పిల్ల‌లు ఉన్న‌ట్టుండి ఏమీ మాట్లాడ‌కుండా అలా గాల్లోకి చూస్తూ ఉండిపోతున్నారా? అప్ప‌టివ‌ర‌కు ఆడుకునేవాళ్లు కాస్తా ప‌గ‌టి క‌ల‌లు కంటున్న‌ట్లుగా ఏమీ చేయ‌కుండా ఆగిపోతున్నారా? ఇలా జ‌రిగితే మాత్రం త‌ల్లిదండ్రులు వెంట‌నే అప్ర‌మ‌త్తం కావాలి. నంద్యాల జిల్లా బ‌న‌గాన‌ప‌ల్లికి చెందిన ఐదేళ్ల ప్ర‌ణీక విష‌యంలో స‌రిగ్గా ఇలాగే జ‌రిగింది. అయితే, దీనికితోడు రెండు వారాల పాటు రోజూ 5 నుంచి 8 సార్లు మూర్ఛ కూడా రావ‌డంతో ఆమె త‌ల్లిదండ్రులు పాప‌ను క‌ర్నూలు కిమ్స్ ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. పాప‌ను క్షుణ్ణంగా ప‌రీక్షించి, ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కంలో ఉచితంగా చికిత్స అందించి, ఊర‌ట క‌ల్పించిన కిమ్స్ ఆస్ప‌త్రిలోని పీడియాట్రిక్ న్యూరాల‌జిస్టు డాక్ట‌ర్ శ్వేత రాంప‌ల్లి ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను తెలిపారు.
 

"బ‌న‌గాన‌ప‌ల్లికి చెందిన రైతు దంప‌తులు కె.వెంక‌ట‌రాముడు, ఎం.వెంక‌టేశ్వ‌ర‌మ్మ దంప‌తుల కుమార్తె ప్ర‌ణీక‌కు ప‌దే ప‌దే మూర్ఛ వ‌స్తుండ‌టంతో ఆమె త‌ల్లిదండ్రులు మా ఆస్ప‌త్రికి తీసుకొచ్చారు. అయితే, అదే స‌మ‌యంలో ఆమెకు ముఖం ఒక‌వైపు తిరిగిపోతూ, క‌ళ్లు ప‌దే ప‌దే ఆర్పుతూ కాసేపు ఏమీ చేయ‌కుండా అలా ఉండిపోతోంద‌ని కూడా వాళ్లు చెప్పారు.  దాంతో పాప‌కు మేం మూడు గంట‌ల పాటు స‌వివ‌రంగా వీడియో ఈఈజీ ప‌రీక్ష చేశాం. ఆమెకు ఒక విభిన్న‌మైన మూర్ఛ వ‌చ్చింద‌ని, దాన్ని వాళ్లు క‌నిపెట్ట‌లేక‌పోయార‌ని గుర్తించాం. వీటిని 'ఆబ్సెన్స్ సీజ‌ర్స్' , 'నాన్ క‌న్వ‌ల్సివ్‌ స్టేటస్' అని అంటారు . ఈ త‌ర‌హా మూర్ఛ కేవ‌లం మెద‌డులోనే వ‌స్తుంది త‌ప్ప‌, బ‌య‌ట‌కు కనిపించ‌దు. ఈ పాపకు అవి రోజుకు ఏకంగా 80 నుంచి 100 సార్లు వ‌చ్చాయి.

పాప‌ను ఆస్ప‌త్రిలో చేర్చుకున్నాం. ముందుగా మెద‌డుకు ఎంఆర్ఐ చేస్తే అంతా సాధార‌ణంగా ఉంది. దాంతో సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ విశ్లేష‌ణ, ర‌క్తం, మూత్ర‌ మెటబాలిక్ ప‌రీక్ష‌లు, జ‌న్యుప‌రీక్ష‌లు కూడా చేశాం. వేటిలోనూ ఈ  మూర్ఛకు కారణం బయటపడలేదు. చికిత్స‌లో భాగంగా పాప‌ను రెండు వారాల పాటు ఆస్ప‌త్రిలోనే చేర్చుకున్నాం. ఆమెకు ప‌లు ర‌కాలైన మూర్ఛ‌ను త‌గ్గించే మందులు క్ర‌మంగా మోతాదు పెంచుతూ వాడాం. చికిత్స చేస్తున్నప్పుడు కూడా ఆమెకు రెండు సార్లు తీవ్ర స్థాయిలో మూర్ఛ వ‌చ్చినా, వెంట‌నే మందుల సహాయంతో ఆపగలిగాం. డైటీషియ‌న్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఆమెకు మూర్ఛను తగ్గించే డైట్ థెరపీ  (మోడిఫైడ్ అట్కిన్స్ డైట్‌) మొదలుపెట్టాం. ఇందులో భాగంగా కార్బోహైడ్రేట్స్ త‌క్కువ‌గా ఉండేలా, ఫ్యాట్స్ ఎక్కువ‌గా ఉండేలా ప్ర‌త్యేక‌మైన ఆహారాన్ని పాప బ‌రువును బ‌ట్టి, ర‌క్త‌ప‌రీక్ష‌ల ఫ‌లితాల‌ను బ‌ట్టి డైటీషియ‌న్ ప్ర‌త్యేకంగా రూపొందించారు. అది కూడా పాప ఎంత‌వ‌ర‌కు త‌ట్టుకోగ‌ల‌దో చూసి ఆ మేర‌కు మాత్ర‌మే ఆహారం ఇచ్చేవారు. మందులు కూడా ప‌నిచేయ‌డంతో క్ర‌మంగా పాప‌కు మూర్ఛ త‌గ్గ‌సాగింది. ప‌ది రోజుల‌కు పూర్తిగా దాన్నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆమెకు ఒక అరుదైన "జ‌న‌ర‌లైజ్డ్ ఎపిలెప్సీ సిండ్రోమ్" అనే మూర్ఛ వ్యాధి ఉంద‌ని తేల్చి నాలుగు రకాల మందులు, డైట్ థెరపీ మీద డిశ్చార్జ్ చేశాం. అయితే నెల‌కొక‌సారి క‌చ్చితంగా ఫాలో అప్ కోసం రావాల‌ని చెప్పాం. ఒక‌వేళ పాప‌కు త‌ర్వాత ఇక అస్స‌లు ఆబ్సెన్స్ సీజ‌ర్స్ లేదా మూర్ఛ రాక‌పోతే మూడు నెల‌ల‌కోసారి రావ‌చ్చు.

 
ఏమిటీ ఆబ్సెన్స్ సీజ‌ర్స్?

ఉన్న‌ట్టుండి ఏమీ చేయ‌కుండా అలా ఉండిపోవ‌డాన్నే ఆబ్సెన్స్ సీజ‌ర్స్ అంటారు. ఒక ల‌క్ష మంది పిల్ల‌ల్లో 5 నుంచి 10 మందికి మాత్ర‌మే వ‌స్తుంది. అందులోనూ అత్యంత అరుదైన ర‌కం ఈ పాప‌కు వ‌చ్చింది. త‌ల్లిదండ్రులు చాలావ‌ర‌కు ఈ విష‌యాన్ని గ‌మ‌నించ‌రు. మెద‌డులో అసాధార‌ణ విద్యుత్ క్రియ వ‌ల్ల ఇది సంభ‌విస్తుంది. పిల్ల‌లు ప‌గ‌టిక‌ల‌లు కంటున్నార‌ని చూసేవాళ్లు అనుకుంటారు.  స‌వివ‌ర‌మైన‌ వీడియో ఈఈజీ ప‌రీక్ష‌ని మూడు నుంచి ఎనిమిది గంటల పాటు చేస్తే దీన్ని క‌చ్చితంగా గుర్తించ‌గ‌లం. ఆబ్సెన్స్ సీజ‌ర్స్, త్వ‌ర‌గా స‌మ‌సిపోయే స‌మ‌స్య నుంచి తీవ్ర‌మైన మూర్ఛ వ‌ర‌కు ఎలాగైనా రూపాంత‌రం చెందే వ్యాధి. ఇది సాధార‌ణంగా 4 నుంచి 14 ఏళ్ల‌లోపు పిల్ల‌లకు వ‌స్తుంది. గుర్తించ‌డం ఆల‌స్య‌మైతే ముప్పు ఎక్కువ అవుతుంది. ఇది రావ‌డం వ‌ల్ల మెద‌డు ప‌నితీరు దెబ్బ‌తిని తీవ్ర‌మైన మూర్ఛ రావ‌చ్చు, ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పులు, నిద్ర స‌రిగా ప‌ట్ట‌క‌పోవ‌డం, చ‌దువులో స‌మ‌స్య‌లు, ప్ర‌మాదాలు జ‌రిగే అవ‌కాశం ఉంటాయి. అందువ‌ల్ల వీటిని వెంట‌నే గుర్తించి, మ‌రిన్ని స‌మ‌స్య‌లు రాకుండా త‌గిన చికిత్స అందించాలి" అని డాక్ట‌ర్ శ్వేత రాంప‌ల్లి వివ‌రించారు.
 

మా పాప‌కు మ‌ళ్లీ ప్రాణం పోశారు

"మా అమ్మాయి ప్ర‌ణీక‌కు ఫిట్స్ వ‌చ్చాయ‌ని తెలియ‌గానే వెంట‌నే క‌ర్నూలు కిమ్స్ ఆస్ప‌త్రికి తీసుకెళ్లాం. అంత‌కుముందు ఒక‌రోజు తెల్ల‌వారుజామున గ‌ట్టిగా అరిచింది. క‌ల‌లో భ‌య‌ప‌డిందేమో అనుకున్నాం. ఒక వారం త‌ర్వాత ఫిట్స్ వ‌చ్చాయి. ఎనిమిది నెల‌ల ముందు కూడా ఫిట్స్ వ‌చ్చిన‌ప్పుడు కిమ్స్ ఆస్ప‌త్రికి తీసుకెళ్తే మందులిచ్చి పంపారు. అప్పుడు త‌గ్గిపోయి, మ‌ళ్లీ ఇప్పుడు వేరేర‌కంగా వ‌చ్చాయి. పాప ఏమీ మాట్లాడ‌కుండా గాల్లోకి చూస్తుండ‌టంతో భ‌య‌ప‌డ్డాం. డాక్ట‌ర్ శ్వేత‌, ఇత‌ర వైద్యులు, డైటీషియ‌న్, న‌ర్సులు, కిమ్స్ ఆస్ప‌త్రి యాజ‌మాన్యం అంద‌రూ మా పాప‌ను చాలా బాగా చూసుకున్నారు. మాకు అన్నీ వివ‌రంగా చెప్పారు. ఇంత తీవ్ర‌మైన స‌మ‌స్య ఉన్న మా పాప‌కు మ‌ళ్లీ ప్రాణం పోసిన డాక్ట‌ర్ శ్వేత‌కు, ఇత‌ర వైద్యులంద‌రికీ మ‌న‌స్ఫూర్తిగా కృత‌జ్ఞ‌త‌లు తెలుపుకొంటున్నాం."

- వెంక‌ట‌రాముడు, ప్ర‌ణీక తండ్రి

More Press News