మేడారం జాతర ఏర్పాట్లపై తెలంగాణ సీఎస్ టెలీ కాన్ఫరెన్స్!

వచ్చే ఫిబ్రవరి 5 నుండి ఫిబ్రవరి 8 వరకు మేడారంలో జరిగే సమ్మక్క, సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను వేగవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో మేడారం జాతర ఏర్పాట్లపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి బెన్ హర్ మహేష్ దత్ ఎక్కా , డిజిపి మహేందర్ రెడ్డి, అదనపు డిజిపి జితెందర్, ఐజి నాగిరెడ్డి, ములుగు జిల్లా కలెక్టర్ వి.వెంకటేశ్వర్లు, ఎస్.పి. పాటిల్, జాతర స్పెషల్ ఆఫీసర్ వి.పి.గౌతమ్, ఐ.టి.డి.ఎ. పి.ఓ. చక్రదర్, ఆర్.డబ్లుఎస్, ఆర్ అండ్ బి పంచాయతీ రాజ్ ఇ.ఎన్.సిలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సి.యస్ మాట్లాడుతూ ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ ద్వారా నిర్మించే రోడ్ల, కల్వర్టుల నిర్మాణాన్ని జనవరి 25 వరకు పూర్తి చేయాలని, ఇతర రోడ్లు ప్యాచ్ వర్కు లను వెంటనే పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించారు.

రోడ్ల వెంట మూడు భాషలతో సైన్ బోర్డుల ఏర్పాటు ను వెంటనే ప్రారంభించాలన్నారు. పార్కింగ్ లాట్ల వద్ద వాలంటీర్లను ఏర్పాటు చేసి సక్రమంగా వాహనాలు పార్కింగ్ చేసేలా చూడలన్నారు. శానిటేషన్ కు అత్యదిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జిల్లా యంత్రాంగం అక్కడనే ఉండి పనులను సమన్వయంతో పూర్తి చేయాలన్నారు. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ను సక్రమ పద్దతిలో ఏర్పాటు చేసి ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాల్నారు. టాయిలెట్లు, ట్యాప్ ల ఏర్పాటును త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కలెక్టర్, ఎస్.పి, స్పెషల్ ఆఫీసర్, ఐ.టి.డి.ఎ, పి.ఓ. సమన్వయంతో పనులు చేపట్టాలన్నారు.

గద్దెలకు వెళ్ళె దారులలో షాపుల వద్ద రద్దీ ఏర్పడకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. బ్యారికేడింగ్ ఏర్పాటు చేసి రద్దీ లేకుండా క్రమబద్దీకరించాలన్నారు. త్వరలోనే పనుల పరిశీలనకు పర్యటించనున్నట్లు తెలిపారు. డి.జి.పి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ వాహనాలు బ్రేక్ డౌన్ అయినప్పుడు ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రతి రెండు కిలోమీటర్లకు ఒక్క చోట పి.ఎ.సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. క్రౌడ్ మేనేజిమెంట్ పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

More Press News