8 రోజుల శిశువుకు మూత్ర‌పిండాల స‌మ‌స్య

* క‌ర్నూలు కిమ్స్ ఆస్ప‌త్రిలో 5 రోజుల పాటు డ‌యాల‌సిస్‌

 
క‌ర్నూలు, మే 27, 2023: సాధార‌ణంగా మూత్ర‌పిండాల స‌మ‌స్య అంటే పెద్ద‌వారికి మాత్ర‌మే వ‌స్తుంద‌ని అనుకుంటాం. కానీ, క‌ర్నూలు జిల్లా ఆత్మ‌కూరుకు చెందిన 8 రోజుల వ‌య‌సున్న శిశువుకు మూత్ర‌పిండాలు పాడ‌వ్వ‌డంతో క‌ర్నూలు కిమ్స్ ఆస్ప‌త్రికి తీసుకురాగా, అత్యంత జాగ్ర‌త్త‌గా డ‌యాల‌సిస్ చేసి ఆరోగ్యాన్ని కాపాడారు. ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను ఆస్ప‌త్రికి చెందిన నియోనాటాల‌జిస్టులు డాక్ట‌ర్ హెచ్.ఎ. న‌వీద్‌, డాక్ట‌ర్ భ‌ర‌త్‌రెడ్డి, డాక్ట‌ర్ ఎన్.భార‌తి వివ‌రించారు.

 
‘‘ష‌బ్బీర్ హుస్సేన్, అబు సలేహా దంప‌తుల‌కు పుట్టిన 8 రోజుల శిశువు పాలు స‌రిగా తాగ‌క‌పోవ‌డం, బ‌రువు త‌గ్గిపోవ‌డం లాంటి స‌మ‌స్య‌లు ఉండ‌టంతో క‌ర్నూలు కిమ్స్ ఆస్ప‌త్రికి తీసుకొచ్చారు. శిశువును నియోనాట‌ల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేర్చారు. ర‌క్త‌ప‌రీక్ష‌లు చేస్తే.. తీవ్ర‌మైన డీహైడ్రేష‌న్ కార‌ణంగా మూత్ర‌పిండాలు పాడైన‌ట్లు తేలింది. మూర్ఛ కూడా వ‌స్తుండ‌టంతో వెంట‌నే వెంటిలేట‌ర్ మీద పెట్టాల్సి వ‌చ్చింది. ప‌రీక్ష‌లు చేయ‌గా శిశువు క్రియాటినైన్ స్థాయి 16 ఎంజీ/డీఎల్ ఉంది. సాధార‌ణంగా అయితే ఇది కేవ‌లం 0.2 నుంచి 0.9 మ‌ధ్య మాత్ర‌మే ఉండాలి. ఈ స‌మ‌స్య కార‌ణంగా శిశువుకు మూత్రం కూడా రావ‌ట్లేదు. మూత్ర‌పిండాల వైద్య నిపుణులు డాక్ట‌ర్ అనంత్ నేతృత్వంలో శిశువుకు పెరిటోనియ‌ల్ డ‌యాల‌సిస్ మొద‌లుపెట్టారు. 5 రోజుల పాటు ఇలా డ‌యాల‌సిస్ చేసిన త‌ర్వాత మూత్ర‌పిండాల ప‌రిస్థితి క్ర‌మంగా మెరుగుప‌డింది. వెంటిలేట‌ర్ తొల‌గించిన త‌ర్వాత పాలు తాగ‌డం కూడా మొద‌లైంది. 21 రోజుల పాటు ఎన్ఐసీయూలో చికిత్స చేసిన త‌ర్వాత‌, శిశువుకు తల్లిపాలు పట్టించి డిశ్చార్జి చేశాం. ఈ చికిత్స మొత్తం వైఎస్ఆర్ ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కంలో పూర్తి ఉచితంగా చేయ‌డం మ‌రో విశేషం’’ అని వైద్యులు తెలిపారు.

More Press News