వేములవాడ రాజన్న ఆలయాన్ని గొప్పగా తీర్చిదిద్దుతా: సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తన వేములవాడ, మిడ్ మానేరు పర్యటనల్లో పలుమార్లు గత స్మృతులను, చేదు అనుభవాలను నెమరు వేసుకున్నారు. వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవాలయాన్ని సందర్శించిన సందర్భంగా ఆ దేవాలయంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. భక్తులు పడే ఇబ్బందులను గతంలో ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదని చెప్పారు. దేవాలయమంతా కలియతిరిగి సాంప్రదాయం ప్రకారం మొక్కులు చెల్లించారు. రాజ రాజేశ్వరస్వామికి రెండు కోడెలు సమర్పించారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు.

ఈ సందర్భంగా స్థానిక ఆలయ అధికారులు, ఇతర ప్రముఖులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు తమ ఇలవేల్పుగా కొలుచుకొనే వేములవాడ రాజన్న ఆలయాన్ని గొప్పగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ఐదారు ఎకరాల్లో ప్రధాన దేవాలయాన్ని భక్తుల సౌకర్యార్థం తీర్చిదిద్దుతామని, మొత్తం 35 ఎకరాల్లో దేవాలయ ప్రాంగణమంతా అన్ని హంగులతో, సకల సౌకర్యాలతో గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకునేటట్లు చిత్తశుద్ధితో కృషి చేస్తామని చెప్పారు. త్వరలోనే శృంగేరి పీఠాధిపతిని కలిసి వేములవాడ రాజన్న ఆలయాన్ని తీర్చిదిద్దే విషయంలో తగిన సలహాలు, సూచనలు కోరుతామన్నారు. ఆగమశాస్త్ర నియమాల ప్రకారమే నిర్మాణాలు చేపడతామన్నారు. 2020-21 బడ్జెట్ లో వేములవాడ దేవాలయ అభివృద్ధి కోసం నిర్దిష్టమైన నిధులు కేటాయిస్తామని చెప్పారు.

దేవాలయ సందర్శన అనంతరం మిడ్ మానేరు రిజర్వాయర్ ను సీఎం కేసీఆర్ సందర్శించారు. రాజరాజేశ్వరస్వామి కొలువైన ప్రాంతంలో ఉంది కాబట్టే మిడ్ మానేరుకు స్వామివారి పేరు పెట్టినట్లు వెల్లడించారు. మిడ్ మానేరు నుండి దాదాపు 70-80 శాతం తెలంగాణ ప్రాంతానికి తాగునీరు అందుతుందని వెల్లడించారు. సమైక్య పాలకుల నిర్లక్ష్యం వల్ల గతంలో ఈ ప్రాంతమంతా ఎడారిని తలపించేదన్నారు. ధవళేశ్వరం ప్రాజెక్టుకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశ్యంతో మూలవాగుకు పైన నిమ్మపల్లి ప్రాజెక్టును సమైక్య పాలకులు ఉద్దేశపూర్వకంగా ఆపారని, దీనివల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరిగిందని సీఎం అన్నారు.

‘‘ముల్కి పాయె... మూట పాయె... మూలవాగు నీళ్లుపాయె’’ అని తెలంగాణ ప్రజలు పాటలు పాడుకున్నారని సీఎం అన్నారు. ఆ మూలవాగు, మిడ్ మానేరు నీళ్లు కలిసేచోట బ్రిడ్జిపై కొద్దిసేపు గడిపిన ముఖ్యమంత్రి పుష్కలమైన నీళ్లను చూసి తన్మయత్వం చెందారు. మిడ్ మానేరు ప్రధాన డ్యామ్ గేట్ల వద్ద గోదావరి జలాలకు పుష్పాభిషేకం చేశారు. జలహారతి ఇచ్చారు. తన అలవాటు ప్రకారం నీళ్లలో నాణేలు వేసి నమస్కరించారు. అంతకుముందు సిరిసిల్ల బ్రిడ్జి వద్ద మిడ్ మానేరు బ్యాక్ వాటర్ లోనూ పూలు చల్లి, నాణేలు వేసి పూజలు నిర్వహించారు.

ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతోపాటు మంత్రులు కె.టి. రామారావు, ఈటల రాజేందర్, ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బి. వినోద్ కుమార్ కుటుంబ సభ్యులు కూడా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

More Press News