సెంచురీ ఆస్ప‌త్రి, మెలొడీ వాయిస్ క్లినిక్‌ల సంయుక్తాధ్వ‌ర్యంలో ఏర్పాటు

హైద‌రాబాద్, ఏప్రిల్ 16, 2023: ప్రపంచ స్వరదినోత్సవ సంద‌ర్భంగా న‌గ‌రంలోని ప్ర‌ముఖ సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రుల‌లో ఒక‌టైన బంజారాహిల్స్‌లోని సెంచురీ ఆస్ప‌త్రిలో ప్ర‌త్యేక స్వ‌ర విభాగాన్ని ప్రారంభించారు. సెంచురీ ఆస్ప‌త్రి, మెలొడీ వాయిస్ క్లినిక్‌ల సంయుక్త ఆధ్వ‌ర్యంలో ప్ర‌ముఖ వాయిస్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ వి.ఫ‌ణీంద్ర‌కుమార్ నేతృత్వంలో దీన్ని ప్రారంభించారు. ఈ నేప‌థ్యంలో స్వర సమస్యలు ఉన్నవారికి ఉచిత సలహాల శిబిరాన్ని కూడా నిర్వ‌హించారు. ఇందులో ప‌లు రంగాల‌కు చెందిన వృత్తినిపుణున‌ల‌కు వైద్య‌ప‌రీక్ష‌లు నిర్వ‌హించి, వారి స్వ‌రాన్ని కాపాడుకోవ‌డానికి అవ‌స‌ర‌మైన స‌ల‌హాలు, సూచ‌న‌లు అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఆర్‌.పి. ప‌ట్నాయ‌క్, ఉమ్మ‌డి రాష్ట్ర మాజీ మ‌ఖ్య‌మంత్రి నాదెండ్ల భాస్క‌ర‌రావు త‌దిత‌రులు ప్ర‌త్యేక అతిథులుగా హాజ‌ర‌య్యారు.

 

ఈ సంద‌ర్భంగా సెంచురీ ఆస్ప‌త్రి వైస్ ప్రెసిడెంట్ డాక్ట‌ర్ హేమంత్ కౌకుంట్ల మాట్లాడుతూ,  ‘‘గొంతు అనేది ప్ర‌తి ఒక్క‌రికీ ఎంతో ముఖ్యం. నా గొంతు బాగుంది కాబ‌ట్టి అందులో ఉన్న స‌మ‌స్య ఏంటో నాకు తెలియ‌క‌పోవ‌చ్చు. కానీ, స్వ‌రంతో స‌మ‌స్య ఉన్న‌వారికి దాన్ని స‌రిచేసుకోవ‌డం ఎలా అన్న‌ది చాలా పెద్ద స‌మ‌స్య‌. అలాంటి ఎంతోమందికి చ‌క్క‌టి ప‌రిష్కారం అందించేందుకు ఈ రోజు మా సెంచురీ ఆస్ప‌త్రిలో ప్ర‌త్యేక విభాగాన్ని ఏర్పాటుచేయ‌డం ఎంతో సంతోషంగా ఉంది. ఇందుకు ముందుకొచ్చిన డాక్ట‌ర్ ఫ‌ణీంద్ర‌కుమార్‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. ఏ ర‌క‌మైన స్వ‌ర స‌మ‌స్య‌లు ఉన్న‌వారైనా నిస్సంకోచంగా ఇక్క‌డ‌కు వ‌చ్చి త‌గిన చికిత్స పొంది, పూర్తి సంతృప్తితో వెళ్ల‌చ్చు. ఈ సంద‌ర్భంగా ఇక్క‌డ‌కు విచ్చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు’’ అని తెలిపారు.  

ఇదే సంద‌ర్భంలో సెంచురీ మెలొడీ వాయిస్ క్లినిక్ డైరెక్ట‌ర్, సీనియ‌ర్ లారింగాలజిస్టు, ఫోనోస‌ర్జ‌న్ డాక్ట‌ర్ వ‌ల్లూరి ఫ‌ణీంద్ర‌కుమార్ మాట్లాడుతూ, ‘‘ప్ర‌పంచ స్వ‌ర‌దినోత్స‌వం సంద‌ర్బంగా హైద‌రాబాద్‌లో సెంచురీ ఆస్పత్రి, మెలొడీ వాయిస్ క్లినిక్ క‌లిసి సంయుక్తంగా వాయిస్, ఎయిర్‌వే, స్వాలోయింగ్ అండ్ కేర్ ఆఫ్ ప్రొఫెష‌న‌ల్ వాయిస్ అనే ఒక సూప‌ర్ స్పెషాలిటీ విభాగాన్ని ప్రారంభిస్తున్నాయి. స్వ‌ర స‌మ‌స్య‌లు ఉన్నవారికి, మింగ‌డానికి, తిన‌డానికి స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి, ఊపిరి ఆడ‌టంలో ఇబ్బందులు ఉన్న‌వారికి, ఇంకా స్వ‌రంపైనే ఆధార‌ప‌డి జీవించే నిపుణులు.. గాయ‌కులు, డ‌బ్బింగ్ క‌ళాకారులు, రాజ‌కీయ నాయ‌కులు, ఉపాధ్యాయులు, జ‌ర్న‌లిస్టులు, టీవీ ప్ర‌జెంట‌ర్లు, న్యాయ‌వాదులు, మ‌త గురువులు, వ్యాపార‌వేత్త‌లు.. వీళ్లంద‌రికీ ఒక సూప‌ర్ స్పెషాలిటీ విభాగం ఏర్పాటుచేస్తున్నాం. లెరింగాల‌జీని మ‌న దేశంలో 20 ఏళ్ల క్రిత‌మే ప్రారంభించాం. అసోసియేష‌న్ ఆఫ్ ఫోనో స‌ర్జ‌న్స్ ఆఫ్ ఇండియాకు నేను వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడిగా ఉంటున్నాను. 2000 సంవ‌త్స‌రంలో ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం మెలొడీ వాయిస్ క్లినిక్‌ను ప్రారంభించారు. ఆ త‌ర్వాత ఇత‌ర స్పెషాలిటీల‌నూ ఇందులో చేర్చాం. ఎలాంటి స్వ‌ర స‌మ‌స్య‌లు ఉన్నా.. కొన్నిర‌కాల చికిత్స‌లు ఉంటాయి. ముందుగా వాయిస్ థెర‌పీతో స‌రిచేస్తాం. మ‌రికొంద‌రికి అలా కుద‌ర‌క‌పోతే ఫోనోస‌ర్జ‌రీ చేస్తాం. ఇంకా కొన్ని సంద‌ర్భాల్లో స్వ‌ర‌పేటిక ప‌క్ష‌వాతం వ‌స్తుంది. ప్ర‌మాదాలు, థైరాయిడ్ ఆప‌రేష‌న్ల వ‌ల్ల ఇలా కావ‌చ్చు. ఇలాంటివారికీ లేజ‌ర్ ద్వారా ప్ర‌త్యేక శ‌స్త్రచికిత్స‌లు చేసి, మాట‌ను మామూలుగా తెప్పించ‌గ‌లం. ప్ర‌పంచ స్వ‌ర‌దినోత్స‌వం సంద‌ర్భంగా సెంచురీ ఆస్ప‌త్రితో ఇలా ప్ర‌త్యేక అనుబంధం కుద‌ర‌డం ఎంతో సంతోష‌క‌రం. దీనిద్వారా మ‌రింత‌మందికి మా సేవ‌లు అందించే అవ‌కాశం ఏర్ప‌డింది. ఇలాంటి అవ‌కాశం క‌ల్పించినందుకు సెంచురీ ఆస్ప‌త్రి వైస్ ప్రెసిడెంట్  డాక్ట‌ర్ హేమంత్ కౌకుంట్ల‌కు ధ‌న్య‌వాదాలు’’ అని చెప్పారు.

ఈ సంద‌ర్భంగా తెలంగాణ ఆడియాల‌జిస్టులు, స్పీచ్ లాంగ్వేజ్ పాథాల‌జిస్టుల అసోసియేష‌న్‌, యూనివ‌ర్స‌ల్ అసోసియేష‌న్ ఆఫ్ క్లినిక‌ల్ ఆడియాల‌జిస్ట్స్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు డాక్ట‌ర్ నాగేంద‌ర్ కంకిపాటి మాట్లాడుతూ, ‘‘ప్ర‌జ‌ల్లో వాయిస్ డిజార్డ‌ర్ల గురించి అవ‌గాహ‌న క‌ల్పించ‌డానికి ఈ క్లినిక్ ఏర్పాటు చేయ‌డం ముదావ‌హం. మ‌న‌లో చాలామంది తెలిసో, తెలియ‌కో గొంతును ఇష్టం వ‌చ్చిన‌ట్లు వాడుతుంటాం. చిన్న‌చిన్న విష‌యాల‌కే గ‌ట్టిగా అరుచుకోవ‌డం, ఇంట్లో పెద్ద‌గా మాట్లాడ‌టం, వేరే ఎవ‌రినైనా మిమిక్రీ చేయ‌డానికి ప్ర‌య‌త్నించ‌డం, అబ్బాయిల్లో 14-15 ఏళ్లు వ‌చ్చిన త‌ర్వాత మారాల్సిన గొంతు మార‌కుండా అమ్మాయిల గొంతులాగే ఉండిపోవ‌డం లాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఇలాంటి స‌మ‌స్య‌లున్నాయి. ప్రొఫెష‌న‌ల్స్ లో గొంతు ఎక్కువ‌గా వాడ‌టం వ‌ల్ల‌, ఓక‌ల్ హైజీన్ టిప్స్ పాటించ‌క‌పోవ‌డం వ‌ల్ల మ‌న స్వ‌ర‌పేటిక‌ల మీద చిన్న చిన్న వోక‌ల్ నాడ్యూల్స్, పాలిప్స్ ఏర్ప‌డ‌తాయి. దానివ‌ల్ల గొంతు బొంగురుపోవ‌డం లాంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. ఇలాంటివాళ్లంద‌రికీ వాయిస్ మేనేజ్‌మెంట్ గురించి మేం అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నాం. డాక్ట‌ర్ ఫ‌ణీంద్ర‌కుమార్ ఆసియాలోనే మొట్ట‌మొద‌టి ఫోనో స‌ర్జ‌న్. దేశం మొత్తం ఎంతోమంది గాయ‌కుల‌కు స‌ర్జ‌రీలు, వాయిస్ థెర‌పీలు చేశారు. ఆయ‌న ముందుకొచ్చి మా అసోసియేష‌న్‌తో భాగ‌స్వాములై మా ఆడియాల‌జిస్టులు, స్పీచ్ థెర‌పిస్టుల‌కు శిక్ష‌ణ ఇవ్వ‌డం ఎంతో ఆనందం. వాయిస్ థెర‌పీలో స్పీచ్ థెర‌పిస్టుల పాత్ర చాలా కీల‌కం. స‌మ‌స్య‌లు ఉన్న‌వారిలో 30% మందికే ఆప‌రేష‌న్లు అవ‌స‌ర‌మ‌వుతాయి. మ‌రో 70% మందికి స్పీచ్ థెర‌పీతోనే న‌య‌మ‌వుతుంది. అలాంటి అడ్వాన్స్ ఫెలోషిప్‌ను సెంచురీ ఆస్ప‌త్రిలో ప్రారంభిస్తున్నారు. ఈ ఫెలోషిప్‌లో ఆడియాల‌జిస్టులు, స్పీచ్ థెర‌పిస్టులు అంతా భాగ‌స్వాములై, ప్ర‌జ‌ల‌కు మ‌రింత సేవ‌లు అందిస్తాము. ఇలాంటి శిక్ష‌ణ ఏర్పాటుచేసినందుకు డాక్ట‌ర్ ఫ‌ణీంద్ర‌కుమార్‌కు ధ‌న్య‌వాదాలు’’ అని తెలిపారు.

More Press News