గురుకుల విద్యను మరింత బలోపేతం చేయాలి: మంత్రి సత్యవతి రాథోడ్

  • విద్యాలయాల వసతుల్లో రాజీపడొద్దు

  • విద్యార్థులకు వసతులు కల్పించేందుకు నిధుల కొరత లేదని సిఎం హామీ ఇచ్చారు

  • బాలికల విద్యాలయాల్లో నిరంతర నిఘా ఉండాలి

  • నాణ్యమైన విద్యతో పాటు భోజనం అందించడంలో మెనూ కచ్చితంగా పాటించాలి

  • గురుకులాల్లో వసతుల పర్యవేక్షణపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలి

  • సెలవుల ముందు పేరేంట్, టీచర్ మీటింగ్స్ ఏర్పాటు చేయాలి

  • అన్ని జిల్లాల కలెక్టర్లు గురుకులాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టేలా చూడాలి

  • గురుకులాలపై అధికారులతో సమీక్ష చేసిన తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్

ముఖ్యమంత్రి కేసిఆర్ మానస పుత్రిక గురుకుల విద్యను ఆయన నమ్మకాన్ని నిలబెట్టే విధంగా మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులకు సూచించారు. మంగళవారం దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి బెన్హర్ మహేశ్ దత్ ఎక్కా, ఎస్సీ, ఎస్టీ గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినా జడ్ చోంగ్తు, చీఫ్ ఇంజనీర్ శంకర్ రావు, ఇతర అధికారులతో మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష చేశారు.

గురుకులాలకు వచ్చే విద్యార్థులకు కచ్చితంగా మంచి భవిష్యత్ అందే విధంగా ముఖ్యమంత్రి కేసిఆర్ మన గురుకులాలను పటిష్టం చేసేందుకు అడిగిన వసతులన్నీ కల్పిస్తున్నారని, ఆయన నమ్మకాన్ని నిలబెట్టే విధంగా మన విద్యా విధానం కూడా అదే స్థాయిలో ఉండేటట్లు నిరంతర పర్యవేక్షణ చేయాలని సూచించారు.

గురుకులాలు సమర్థవంతంగా పనిచేసేలా, ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఆయా జిల్లాల కలెక్టర్లు వీటి పనితీరును పర్యవేక్షించేలా, ఆకస్మిక తనిఖీలు చేసేలా వారిని భాగస్వామ్యం చేయాలని కోరారు. అదేవిధంగా విద్యార్థులకు అందించే భోజనంలో మెనునూ కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ఏ పరిస్థితుల్లోనూ మెనును పాటించని అధికారులు, సిబ్బందిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

గురుకుల పాఠశాల విద్య ప్రమాణాల్లోనూ, వారికి అందించే వసతులు, భోజనం విషయంలో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించకుండా అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఇటీవల జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో బాలికల గురుకుల విద్యాలయాల్లో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలన్నారు. బాలికల విద్యాలయాల్లో పురుష సిబ్బంది, ఉద్యోగులు లేకుండా చూసుకోవాలన్నారు. అదేవిధంగా గురుకుల విద్యాలయాలు, హాస్టళ్లు ఉన్న పోలీస్ పరిధిలో స్థానిక పోలీసులు పెట్రోలింగ్ చేసేలా సంబంధిత అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు.

పరీక్షలు సమీపిస్తున్న సందర్భంగా ప్రత్యేక క్లాసులు నిర్వహించడంతో పాటు సిబ్బంది, అధికారులను జవాబుదారితనం చేసే విధంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

పరీక్షల అనంతరం ఇచ్చే సెలవుల ముందు విధిగా పేరేంట్, టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ మీటింగుల్లో సెలవుల సమయంలో ఇంటి వద్ద విద్యార్థులు ఏమి చేస్తున్నారు, వారి ప్రవర్తన వంటి అంశాలపై తల్లిదండ్రులు నిఘా ఉంచేలా కౌన్సిలింగ్ ఇవ్వాలని చెప్పారు.

చలికాలంలో విద్యార్థులకు వేడినీళ్లు ఇచ్చేందుకు సోలార్ పానెళ్లు ప్రభుత్వం మంజూరు చేసిందని, దీనివల్ల విద్యార్థులకు స్నానానికి వేడినీళ్ల వసతి అందడమే కాకుండా, ఈ సోలార్ ప్యానెళ్ల వల్ల దాదాపు ఒక్కో గురుకులానికి నెలకు లక్ష రూపాయల మేర కరెంటు బిల్లులు కూడా మిగులే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గురుకులాల్లో ప్రత్యేక డ్రైవ్ లు పెట్టి అక్కడి సమస్యలు తెలుసుకోవడంతో పాటు వాటిని పరిష్కరించేందుకు కూడా వెంటనే కృషి చేస్తామని చెప్పారు.


More Press News