బెజవాడలో సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తున్న రాష్ట్ర చేనేత ప్రదర్శన

సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తున్న రాష్ట్ర చేనేత ప్రదర్శన

ఫిబ్రవరి 7తో ముగియనున్న ఎక్స్ పో

రాయితీ ధరలలో విజయవాడలో దేశ వ్యాప్త చేనేత వస్త్రాలు  

విజయవాడలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్ధాయి చేనేత వస్త్ర ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తోంది.  చేనేత సంస్కృతి సంప్రదాయాల ఆలంబనగా ఏర్పాటు చేసిన ఈ ఎక్స్ పో విజయవాడ వాసుల ఆదరణను చూరగొంటుండగా, సరికొత్త డిజైన్లతో రూపొందించిన చేనేత వస్త్రాలు స్టాళ్లలో అదరహో అనిపిస్తున్నాయి. గత నెలలో స్ధానిక పిన్నమనేని పొలిక్లినిక్ రోడ్ లోని సిద్దార్ధ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, కేటరింగ్ టెక్నాలజీ ఆవరణలో దీనిని ప్రారంభించగా, ఫిబ్రవరి 7వ తేదీ వరకు జరగనుంది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన చీరాల, ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి పట్టుచీరలతో పాటు, తెలంగాణలోని పోచంపల్లి, గద్వాల్, నారాయణపేట పట్టు చీరలు, కొయ్యలగూడెం టైడై దుప్పట్లు, వరంగల్ రగ్గులు, కరీంనగర్, హుజురాబాద్ దుప్పట్లు. టవల్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. తమిళనాడు కంచి, మదురై చీరలు, సేలం కాటన్ దోతీలు, చెన్నిమలై దుప్పట్లు, బెంగాలీ కాటన్ చీరలు. మధ్య ప్రదేశ్ మహేశ్వరి, చందేరి చీరలు, చందేరి డ్రస్స్ మెటీరియల్స్. ఉత్తర ప్రదేశ్ బెడ్ కవర్స్, లక్నో చికన్ వర్క్స్, ఢిల్లీ బెడ్ షీట్స్, కర్టెన్ క్లాత్. బీహార్ నలంద దుప్పట్లు, భాగల్పూర్ చాదర్, సిల్క్, కాటన్ షర్టింగ్స్, జమ్మూ కాశ్మీర్ కార్పెట్స్, షాల్స్, స్పెషల్ జాకెట్స్, బెడ్ షీట్స్, క్రివల్ బెడ్ షీట్స్, రాఫ్ఫల్ సూట్స్... ఇలా ఒకటా రెండా వందలాది డిజైన్లతో ప్రత్యేకించి యువతను ఆకర్షించే విధంగా రూపుదిద్దిన చేనేత వస్త్రాల ప్రదర్శన చిన్నా పెద్దా అందరినీ ఆకర్షిస్తుంది. దేశంలోని విభిన్న రాష్ట్రాలకు చెందిన  చేనేత ఉత్పత్తులను నేటి యువతకు చేరువ చేసే లక్ష్యం దిశగా ఈ ప్రదర్శన సాగుతోంది.

    
చేనేత వస్త్రాలంటే వయోజనులకే అన్న నానుడికి ముగింపు పలుకుతూ, చేనేత ప్రేమికుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన నూతన డిజైన్ల వస్త్ర శ్రేణి ఫలితంగా కోనుగోలు దారుల అందచందాలు రెట్టింపు అయ్యాయంటే ఎటువంటి ఆశ్చర్యం లేదు. ప్రదర్శన మునుపెన్నడూ చూడని ఆదరణను చూరగొంటుండగా, చేనేత వస్త్రాలు అందంతో పాటు హుందాతనాన్నిఇస్తాయని, ఆరోగ్యపరంగా, పర్యావరణపరంగా అనుకూలమైనవని నేతన్నలు వెల్లడిస్తున్నారు. ప్రత్యేక శ్రద్దతో చేనేత కళను ప్రోత్సహిస్తూ ఈ రంగాన్ని స్వయం సమృద్ది బాటలో నడిపించేలా తమకు రాష్ట్ర ప్రభుత్వం నుండి సహకారం అందుతోందని తెలిపారు. రాష్ట్ర చేనేత వస్ర్త శ్రేణికి ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు లభించేలా కాలానుగుణ ఫ్యాషన్ల మేరకు నూతన వెరైటీలు ఇక్కడ కనిపిస్తున్నాయి. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అన్ని రకాల చేనేత వస్త్రాలు ప్రస్తుత ప్రదర్శనలో అందుబాటులో ఉన్నాయని జిల్లా చేనేత జౌళి శాఖ అధికారి రఘునంద తెలిపారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన ఆప్కో స్టాల్ లో ప్రత్యేక రాయితీలు అమలవుతున్నాయన్నారు.

జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కేంద్ర వస్త్ర మంత్రిత్వ శాఖ చేనేత అభివృద్ది కమీషనర్ చేనేత మార్కెటింగ్ సహాయాన్ని అమలు చేస్తుండగా, దేశీయ, ఎగుమతి మార్కెట్లలో మార్కెటింగ్ మార్గాలను అభివృద్ధి చేయడం, ప్రోత్సహించడం, రెండింటినీ సమగ్ర పద్ధతిలో అనుసంధానం చేయడం ఈ పథకం యొక్క ఉద్దేశ్యంగా ఉంది.  ప్రస్తుత మార్కెట్ పోకడలకు అనుగుణంగా చేనేత ఏజెన్సీలు, నేత కార్మికులు వినూత్న డిజైన్లతో తమ విభిన్న ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించడానికి ఒక వేదికను అందించటమే ధ్యేయంగా జాతీయ చేనేత ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనలో  అపెక్స్ చేనేత , ప్రాథమిక చేనేత, మ్యాక్ సొసైటీలు, అవార్డ్ విజేతలకు చెందిన విక్రయ కేంద్రాలు  పాల్గొనగా, నగర వాసుల ఆదరణతో రూ.4 కోట్ల అమ్మకాలు జరగవచ్చని అధికారులు భావిస్తున్నారు.

More Press News