త్రిపుర మహిళకు ఎస్ఎల్‌జీ ఆస్పత్రిలో అత్యవసర యూరొలాజికల్ రీకన్ స్ట్రక్టివ్ చికిత్స

* వేరేచోట హిస్టరెక్టమీ అనంతరం ఆగిపోయిన మూత్రవిసర్జన
* తీవ్రమైన మూత్రపిండాల గాయాన్ని నయం చేసి, అడ్డంకి తొలగించేందుకు తొలుత బైలేటరల్ నెఫ్రోస్టమీ ట్యూబుల అమరిక
* అనంతరం మూత్రనాళాలు, బ్లాడర్ మధ్య కొత్త మార్గం ఏర్పాటు
 
హైద‌రాబాద్, డిసెంబ‌ర్ 28, 2022: 35 ఏళ్ల మ‌హిళ‌కు అత్య‌వ‌స‌రంగా హిస్ట‌రెక్ట‌మీ చేసిన త‌ర్వాత తీవ్ర‌మైన మూత్ర‌పిండాల గాయంతో బాధ‌ప‌డ్డారు. ఆమెకు ఆ త‌ర్వాత మూత్ర‌విస‌ర్జ‌న కాక‌పోవ‌డంతో  హైద‌రాబాద్‌లోని ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా, వెంట‌నే రెండు మూత్ర‌పిండాల్లో నెఫ్రోస్ట‌మీ ట్యూబుల‌ను అమ‌ర్చి ఆమె అడ్డంకిని తొల‌గించారు. త్రిపుర రాష్ట్ర రాజధాని అగర్తలాకు చెందిన ఆమెను  హైద‌రాబాద్ న‌గ‌రంలోని ప్ర‌ధాన ఆస్ప‌త్రుల‌లో ఒక‌టైన ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రికి మెరుగైన చికిత్స‌ కోసం తీసుకొచ్చారు.  ఇక్క‌డ యూరాల‌జిస్టు, ఆండ్రాల‌జిస్టు, మూత్ర‌పిండాల మార్పిడి నిపుణుడైన డాక్ట‌ర్ ఎ.సంతోష్ కుమార్ ఆమెను క్షుణ్ణంగా ప‌రిశీలించి, రెండువైపులా మూత్ర‌నాళాల రీ ఇంప్లాంటేష‌న్ చేయాల‌ని తెలిపారు. ఈ ప్ర‌క్రియ‌లో పాడైన మూత్ర‌నాళాల నుంచి మూత్ర‌కోశానికి (బ్లాడ‌ర్‌) ఒక కొత్త మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను డాక్ట‌ర్ సంతోష్ తెలిపారు.
 
“35 ఏళ్ల మ‌హిళ‌కు రుతుక్ర‌మంలో ర‌క్త‌స్రావం వారం రోజులకు పైగా, అది కూడా బాగా ఎక్కువ‌గా అవుతుండ‌టంతో (మెనొరేజియా) అగర్తలాలోని ఓ ఆస్ప‌త్రిలో అత్య‌వ‌స‌రంగా హిస్ట‌రెక్ట‌మీ చేశారు. ఆ త‌ర్వాత మూడు రోజులైనా, అప్పటికీ మూత్ర విస‌ర్జ‌న కాక‌పోవడంతో ఆమెను తొలుత స్థానంక‌గా ఉన్న వేరే ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ ప్రాథ‌మికంగా ఆమెకు రెండువైపులా నెఫ్రోస్ట‌మీ చేసి, ట్యూబులు అమ‌ర్చారు. దానివ‌ల్ల మూత్ర‌పిండాలు విఫ‌లం కాకుండా ఉంటాయి. ఆమెను ప‌రీక్షించ‌గా రెండువైపులా మూత్ర‌నాళాల్లో అడ్డంకి ఉన్న‌ట్లు తేలింది. ఆ త‌ర్ర‌వాత ఆమె ప‌రిస్థితి క్ర‌మంగా మెరుగుప‌డింది, క్రియాటినైన్ స్థాయి కూడా 3.2 నుంచి సాధార‌ణ ప‌రిస్థితికి చేరింది. ఆ త‌ర్వాత పూర్తిస్థాయి మెరుగైన చికిత్స కోసం హైద‌రాబాద్‌లోని ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రికి తీసుకొచ్చారు. ఇక్క‌డ ఆమెను ప‌రీక్షించి, మూడు నెల‌ల త‌ర్వాత రెండువైపులా యూరేట‌రిక్ రీఇంప్లాంటేష‌న్ చేయాల‌ని తెలిపాం. ఈ లోపు నెఫ్రాస్ట‌మీ ట్యూబుల‌ను మార్చాల‌ని చెప్పాము.
మూడు నెలలయ్యాక ఆమెకు ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రిలో మళ్లీ సీటీ స్కాన్ చేసి చూస్తే, ఆమెకు రెండువైపులా మూత్ర‌నాళాల వ‌ద్ద అడ్డంకి ఉంద‌ని, రెండువైపులా బ్లాడ‌ర్‌కు సుమారు 5-6 సెంటీమీట‌ర్ల‌ మేర ఈ అడ్డంకి ఏర్ప‌డింద‌ని తెలిసింది. దాంతో ఆమెకు యూరెటిరిక్ రీఇంప్లాంటేష‌న్ అనే పెద్ద శ‌స్త్రచికిత్స చేయాల్సి ఉంటుంద‌ని కౌన్సెలింగ్ ద్వారా తెలిపాం. ఇందులో పాడైన మూత్ర‌నాళాల‌ను బైపాస్ చేసి, కొత్త మూత్ర‌నాళాల మార్గాన్ని మూత్ర‌కోశం (బ్లాడ‌ర్‌) వ‌ద్ద‌కు ఏర్పాటుచేశాం. కుడివైపు పొడవు దాదాపు 5-6 సెంటీమీటర్లు తక్కువగా ఉంటుంది. కాబట్టి మూత్రకోశాన్ని కాస్త పైకి జరిపాం.  ఎడమవైపు మామూలుగానే ఉంటుంది. రెండువైపులా మూత్రనాళాల నుంచి మూత్రకోశానికి కొత్త మార్గాన్ని ఏర్పాటుచేశాం. ఇదంతా డిసెంబ‌రులో ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రిలో చేశాం. ఈ శ‌స్త్రచికిత్స అనంత‌రం ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా న‌య‌మైంది. కొన్ని కేసుల్లో శస్త్రచికిత్స చేసిన 5 రోజుల తర్వాత కొత్తగా ఏర్పాటుచేసే ఈ మార్గం కొంత బ్రేక్ అయ్యి, లీకేజి సంభవించే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఐదురోజుల పాటు ఆమెను నిశితంగా పరిశీలించాం. అలాంటి ఇబ్బంది ఏమీ లేకపోవడంతో ట్యూబులు తీసేసి, కేథటర్ మాత్రమే ఉంచాం.  పది రోజుల తర్వాత కేథటర్ కూడా తీసేశాం. ఇప్పుడు లోపల రెండు స్టెంట్లు మాత్రమే ఉంటాయి. కొత్తగా ఏర్పాటు చేసిన మార్గం సన్నబడకుండా అవి వెడల్పు చేస్తాయి. ప‌దోరోజు త‌ర్వాత ఆమెను ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి చేశాం. ఈ ప్రక్రియ చేసిన తర్వాత కూడా 5-10% కేసుల్లో మళ్లీ ఆ మార్గం సన్నబడే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు లక్షణాలు ఏమైనా బయటపడతాయి. క్రియాటినైన్ పెరిగినా, జ్వరం వచ్చినా, కాళ్ల వాపు వచ్చినా వెంటనే మళ్లీ పరీక్ష చేయించుకోవాలి. అప్పుడు ఇబ్బంది ఉంటే మళ్లీ సరిచేస్తాం’’ అని డాక్టర్ సంతోష్ వివరించారు.
 
ఇప్పుడు రోగికి స‌ర్వ‌సాధార‌ణంగానే మూత్ర‌విస‌ర్జ‌న అవుతోంది. దాంతో ఆమె, ఆమె కుటుంబ‌స‌భ్యులు ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రికి, శ‌స్త్రచికిత్స‌తో త‌మ‌కు న‌యం చేసి, త‌మ‌ను మామూలు ప‌రిస్థితికి తీసుకొచ్చిన‌ డాక్ట‌ర్ ఎ.సంతోష్‌కుమార్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

More Press News