దేశాభివృద్ది పరంగా ముందుచూపుతో వ్యవహరించిన వాజ్‌పేయి : గవర్నర్

దేశాభివృద్ది పరంగా ముందుచూపుతో వ్యవహరించిన వాజ్‌పేయి 
రాష్ట్ర గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్
రాజ్ భవన్ లో ఘనంగా ‘సుపరిపాలన దినోత్సవం‘

                దేశ మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి భారత దేశ అభివృద్ది కోసం ఎంతో ముందు చూపుతో వ్యవహరించారని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు.  వాజ్‌పేయి జయంతిని విజయవాడ రాజ్ భవన్ వేదికగా ఆదివారం  ‘సుపరిపాలన దినోత్సవం‘ వేడుకలను ఘనంగా నిర్వహించారు. దర్బార్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ దేశానికి అవసరమైన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలతో పాటు దేశ రక్షణ అవసరాల పరంగానూ అటల్ ఎక్కడా రాజీ పడలేదన్నారు. దేశాభివృద్ధికి వాజ్‌పేయి చేసిన కృషి మరువలేనిదని 'స్వర్ణ చతుర్భుజి'ని ప్రారంభించి దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మార్గం చూపారన్నారు.

                నాలుగు మెట్రోపాలిటన్ నగరాలను కలుపుతూ ఏర్పాటు చేసిన హైస్పీడ్ జాతీయ రహదారుల ప్రాజెక్ట్ ఫలాలను ఇప్పడు ప్రజలు ఆస్వాదిస్తున్నారన్నారు. 60 ఏళ్లు పైబడిన పేద వృద్ధులకు 10 కిలోల బియ్యం ఉచితంగా పంపిణీ చేసి సంక్షేమ రంగంలో కొత్తవరవడిని సృష్టించారన్నారు. వాజ్‌పేయి గొప్ప వక్త అన్న గవర్నర్, ఆయన ప్రసంగిస్తున్నప్పుడు లక్షలాది మంది ప్రజలు మంత్రముగ్ధులయ్యేవరన్నారు. గ్రామీణ గ్రామాలను కలుపుతూ ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన, ప్రాథమిక, మాధ్యమిక విద్య నాణ్యతను పెంపొందించేందుకు సర్వశిక్షా అభియాన్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు వాజ్‌పేయి హయాంలో ప్రారంభమయ్యాయన్నారు. అణుపరీక్షల వేళ ప్రపంచంలోని పెద్ద శక్తులు వాజ్‌పేయిపై విరుచుకుపడగా తొలుత నిశ్సబ్ధంగా ఉన్న ఆయన ఐదు పరీక్షలను విజయవంతంగా పూర్తిచేసిన తరువాత అణుశక్తి దేశంగా భారత్ ను ప్రకటించారని గుర్తుచేసారు. ఏ దేశంపైనా దాడి చేసే ఉద్దేశం భారత్‌కు లేదని, అదేరీతిన భారత్‌పై దాడి చేసే సాహసం ఏ దేశమూ చెయ్యబోదని స్పష్టం చేసారని వివరించారు. నాడు ప్రపంచ దేశాలు విధించిన ఆర్థిక ఆంక్షలను సైతం సమర్ధవంతంగా ఎదుర్కోని, ఉన్న వనరులతో దేశాన్ని ఏలా నిర్మించుకోగలుగుతామన్న దానిని చేసి చూపారన్నారు.
 
            వాజ్ పేయి ధైర్యవంతమైన చర్యల ఫలితంగా ప్రవాస భారతీయులు గర్వంగా, గౌరవంగా జీవించగలుగుతున్నారని గవర్నర్ హరిచందన్ పేర్కొన్నారు. అణుపరీక్షల తరువాత పశ్చాత్తాపం పొందిన పెద్ద శక్తులు ప్రపంచ సమస్యల పరిష్కారానికి భారత్ జోక్యాన్ని స్వాగతించాయన్నారు. ఫలితంగా అమెరికా పర్యటనకు ఆ అధ్యక్షుడి నుండి వాజ్‌పేయికి తొలి ఆహ్వానం అందిందన్నారు. మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి గౌరవార్థం ప్రభుత్వంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందిస్తూ, వారికి అవగాహన కల్పించడానికి 'సుపరిపాలన దినోత్సవం' జరుపు కుంటున్నామన్నారు. సమాజంలో అవినీతికి చోటు లేదని, ప్రతి ఒక్కరూ ఆనందం, గౌరవం, సమాన అవకాశాలతో జీవించే హక్కు ఉందన్న విషయాన్ని ఈ రోజు మనకు గుర్తు చేస్తుందన్నారు. కార్యక్రమంలో రాజ్‌భవన్‌ సంయుక్త కార్యదర్శి సూర్యప్రకాష్‌, ఉపకార్యదర్శి నారాయణ స్వామి, పలువురు మాజీ సైనికాధికారులు, ఇతర అధికారులు, రాజ్ భవన్ సిబ్బంది పాల్గొన్నారు.

More Press News