క్లోమంలో క‌ణితితో లో షుగ‌ర్ స‌మ‌స్య‌!

* పది లక్షలలో ఒక్కరికి సోకే వ్యాధి
* అత్యంత అరుదైన స‌మ‌స్య‌కు శ‌స్త్రచికిత్స‌తో ప‌రిష్కారం
* కిమ్స్ ఆస్ప‌త్రిలో రోజుల వ్య‌వ‌ధిలోనే న‌యం చేసిన వైద్యులు
 
హైద‌రాబాద్, డిసెంబ‌ర్ 23, 2022: సాధార‌ణంగా మ‌ధుమేహ బాధితుల్లో కొంద‌రికి హై షుగ‌ర్, మ‌రికొంద‌రికి లో షుగ‌ర్ లాంటి స‌మ‌స్య‌లు ఉంటాయి. లో షుగ‌ర్ ఉన్న‌వారు ఉన్న‌ట్టుండి క‌ళ్లు తిర‌గ‌డం, ఒళ్లంతా చ‌ల్ల‌బ‌డిపోవ‌డం లాంటి ల‌క్ష‌ణాలుంటాయి. కానీ, అస‌లు మ‌ధుమేహ స‌మ‌స్యే లేకుండానే ఇలా లో షుగ‌ర్‌తో బాధ‌ప‌డుతూ తీవ్రంగా ఇబ్బంది ప‌డుతున్న ఓ గృహిణికి కిమ్స్ ఆస్ప‌త్రి వైద్యులు స‌రైన స‌మ‌యంలో శ‌స్త్రచికిత్స చేసి న‌యం చేశారు. ఈ వివ‌రాల‌ను ఆస్ప‌త్రికి చెందిన ఇంట‌ర్న‌ల్ మెడిసిన్ నిపుణుడు డాక్ట‌ర్ గౌత‌మ్ పాండురంగ వివ‌రించారు. ఈ వివ‌రాలు ఆయ‌న మాట‌ల్లోనే..‘‘36 ఏళ్ల వ‌య‌సున్న ఓ గృహిణి గ‌త ప‌దేళ్లుగా మూర్ఛ స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతున్నారు. త‌ర‌చు క‌ళ్లుతిరిగి ప‌డిపోవ‌డ‌మే కాక, అలా ప‌డిన‌ప్పుడు దెబ్బ‌లు కూడా త‌గిలిన సంద‌ర్భాలున్నాయి. ఈ స‌మ‌స్య‌తో ఆమె కిమ్స్ ఆస్ప‌త్రిలోని సీనియ‌ర్ న్యూరాల‌జిస్టు డాక్ట‌ర్ మోహ‌న్‌దాస్ వ‌ద్ద‌కు వ‌చ్చారు.  అయితే ఇది న్యూరో స‌మ‌స్య కాద‌ని గుర్తించిన ఆయ‌న‌.. ఫిజిషియ‌న్, ఎండోక్రెనాల‌జిస్టు చూడాల‌ని చెప్పి, మా వ‌ద్ద‌కు పంపారు. నాతోపాటు ఎండోక్రెనాల‌జిస్టు డాక్ట‌ర్ స్మితా న‌ల్లా ఆమెను చేర్చుకుని, ఆమెకు త‌ర‌చు చాలా తీవ్ర‌స్థాయిలో హైపోగ్లెసీమియా (లో షుగ‌ర్) వ‌స్తున్న‌ట్లు గుర్తించాం. ఇందుకోసం కొన్ని ప్ర‌త్యేక ర‌క్త‌ప‌రీక్ష‌లు చేయ‌గా, ఆమెకు ఇన్సులినోమా అనే స‌మ‌స్య ఉంద‌ని తేలింది. క్లోమంలో క‌ణితి ఏర్ప‌డి, దానివ‌ల్ల ఇన్సులిన్ చాలా ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతూ, దానివ‌ల్ల లో షుగ‌ర్ స‌మ‌స్య తలెత్తుతుంది. స‌మ‌స్య తెలియ‌గానే ఆమెకు ఇంట్రావీన‌స్ గ్లూకోజ్, ఇత‌ర మందులు ఇచ్చాం. అయినా, ఇంకా లో షుగ‌ర్ స‌మ‌స్య అలాగే కొన‌సాగింది. ఉద‌ర భాగానికి సీటీస్కాన్ చేసినా ప్ర‌యోజ‌నం లేదు. అప్పుడు మెడిక‌ల్ గ్యాస్ట్రో ఎంట‌రాల‌జిస్టు డాక్ట‌ర్ శ‌ర‌త్ పుట్టా ఆధ్వ‌ర్యంలో ఎండోస్కొపిక్ అల్ట్రాసౌండ్ (ఈయూఎస్‌) అనే ఒక ప్ర‌త్యేక‌మైన ప‌రీక్ష చేశాం. అప్పుడు క్లోమం చివ‌రి భాగం (తోక‌)లో 12 మిల్లీమీట‌ర్ల క‌ణితి ఉన్న‌ట్లు క‌నిపించింది. అప్పుడు డొటాటేట్ అనే ఒక ప్ర‌త్యేక ర‌క‌మైన పెట్ సీటీ స్కాన్ తీశాం. ఆ క‌ణితి శ‌రీరంలో ఇంకెక్క‌డికీ వ్యాపించ‌లేద‌ని, అక్క‌డ మాత్ర‌మే ఉంద‌ని తెలిసింది. దాంతో లివర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జన్ డాక్ట‌ర్ రవిచంద్ సిద్దాచారి నేతృత్వంలో డిస్ట‌ల్ పాంక్రియాటెక్ట‌మీ అనే శ‌స్త్రచికిత్స చేసి, క‌ణితితో కూడిన క్లోమం తోక‌ను తొల‌గించాం. తొల‌గించిన భాగానికి బ‌యాప్సీ చేయ‌గా, మేం అనుమానించిన‌ట్లే ఇన్సులినోమా ఉన్న‌ట్లు తెలిసింది. శ‌స్త్రచికిత్స చేసిన త‌ర్వాత ఆమెలో ఒక్క‌సారిగా గ‌ణ‌నీయ‌మైన మార్పు క‌నిపించింది. ఆమె చాలా చురుగ్గా ఉన్నారు. ఇక ఇంట్రావీన‌స్ గ్లూకోజ్ ఇవ్వాల్సిన అస‌వ‌ర‌మే రాలేదు. ఆమె షుగ‌ర్ స్థాయి కూడా సాధార‌ణ స్థితికి వ‌చ్చేసింది.

మ‌ధుమేహం లేనివారిలో హైపోగ్లెసీమియా అనేది అత్యంత అరుదైన స‌మ‌స్య‌. ఇన్సులినోమా అనే అరుదైన స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడు క్లోమం (పాంక్రియాస్‌) అవ‌స‌ర‌మైన‌దానికంటే చాలా పెద్ద‌మొత్తంలో ఇన్సులిన్‌ను విడుద‌ల చేస్తుంది. దీనివ‌ల్ల ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయి గ‌ణ‌నీయంగా ప‌డిపోయి ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితి త‌లెత్తుతుంది. ఈ మ‌హిళ కేసులో తొలుత మూర్ఛ అనుకున్నా, నిజానికి లో షుగ‌ర్ వ‌ల్ల ఆమె నీర‌సంతో అలా ప‌డిపోయేవారు. ఇలాంటి స‌మ‌స్య ప‌ది ల‌క్ష‌ల మందిలో ఒక‌రి నుంచి న‌లుగురికి మాత్ర‌మే వ‌స్తుంది. ఇంత అరుదైన స‌మ‌స్య‌ను అస‌లు ఇద‌ని గుర్తించ‌డం చాలా ముఖ్యం. మ‌ధుమేహం లేనివారిలో ఇలా లో షుగ‌ర్ వ‌చ్చిందంటే వెంట‌నే క్లోమానికి సంబంధించిన స‌మ‌స్య‌గా అనుమానించాలి. ఈ వ్యాధి నిర్ధార‌ణ కూడా చాలా క‌ష్ట‌మైన‌దే. అయినా రోగి మా వద్ద చేరిన 24 గంట‌ల్లోనే స‌మ‌స్య‌ను గుర్తించ‌గ‌లిగాం. స‌మ‌స్య నిర్ధార‌ణ అయిన త‌ర్వాత నాలుగు రోజుల్లోనే ఆమెకు శ‌స్త్రచికిత్స చేసి పూర్తిగా న‌యం చేశాం. దీంతో ఆమె స‌మ‌స్య పూర్తిస్థాయిలో న‌య‌మైంది. ఇక జీవితంలో ఎప్పుడూ ఆమెకు మూర్ఛ అన్న‌దే రాదు. ఈ విష‌యం తెలిసి ఆమె త‌ల్లితో పాటు ఇత‌ర కుటుంబ‌స‌భ్యులంతా ఎంత‌గానో సంతోషించారు’’ అని డాక్ట‌ర్ గౌత‌మ్ పాండురంగ తెలిపారు.

More Press News