కూక‌ట్‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో రూ.101.69 కోట్ల వ్య‌యంతో ప‌లు అభివృద్ది కార్య‌క్ర‌మాలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్!

  • కూక‌ట్‌ప‌ల్లికి అభివృద్ది కార్య‌క్ర‌మాల ప్రారంభోత్స‌వ శోభ‌

  • రూ. 101.69 కోట్ల వ్య‌యంతో 5 అభివృద్ది కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ 

నిరుపేద‌ల‌కు డ‌బుల్ బెడ్‌రూం ఇళ్లు, మ‌త్స్యకారుల ఆర్థికాభివృద్దికి ఫిష్ మార్కెట్‌, యువ‌త‌కు స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ల ప్రారంభంతో పాటు న‌గ‌ర‌వాసులు మ‌రింత సుల‌భంగా ప్ర‌యాణించేందుకు రైల్వే ఓవ‌ర్ బ్రిడ్జి ప‌నుల‌కు శంకుస్థాప‌న కార్య‌క్ర‌మాల‌ను రాష్ట్ర మున్సిప‌ల్ శాఖ మంత్రి కె.టి.రామారావు కూక‌ట్‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో చేప‌ట్టారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామ‌కూర మ‌ల్లారెడ్డి, న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, ఎమ్మెల్సీలు న‌వీన్‌కుమార్‌, శంబిపూర్ రాజు, శాస‌న స‌భ్యులు మాధ‌వ‌రం కృష్ణారావు, జిహెచ్ఎంసి క‌మిష‌న‌ర్ డి.ఎస్ లోకేష్‌కుమార్‌, డిప్యూటి మేయ‌ర్ బాబా ఫ‌సియుద్దీన్‌, మేడ్చ‌ల్ క‌లెక్ట‌ర్ ఎం.వి.రెడ్డి తో క‌లిసి కూక‌ట్‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో గురువారం నాడు రూ. 101.69 కోట్ల వ్య‌యంతో చేప‌ట్టిన ప‌లు అభివృద్ది కార్య‌క్ర‌మాల‌ను కె.టి.రామారావు ప్రారంభించారు.

ముఖ్యంగా హైద‌రాబాద్ న‌గ‌రంలో డ‌బుల్ బెడ్‌రూం రంగంలో మూడో ప్రాజెక్ట్ అయిన చిత్తార‌మ్మ బ‌స్తీలో రూ. 9.34 కోట్ల వ్య‌యంతో నిర్మించిన 108 డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల‌ను నేడు ప్రారంభించి ల‌బ్దిదారుల‌కు అంద‌జేశారు. సెల్లార్, స్టిల్ట్‌, తొమ్మిది అంత‌స్తుల్లో ఒకొక్క డ‌బుల్ బెడ్‌రూం 560 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. రూ. 8.65 ల‌క్ష‌లతో ఒకొక్క డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం చేప‌ట్టి ల‌బ్దిదారుల‌కు మంత్రి కె.టి.ఆర్ అందించ‌డంతో ద‌శాబ్దాలుగా మురికివాడ‌ల్లో నివ‌సించిన త‌మ‌కు సంప‌న్నులు నివ‌సించే మాదిరి ప్ర‌మాణాల‌తో నిర్మించిన డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల గృహ‌ప్ర‌వేశం చేయ‌డంతో ల‌బ్దిదారులు ఆనందోత్స‌వాలు వెల్లివిరిసాయి. 

ఈ డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా మంత్రులు కె.టి.ఆర్, మ‌ల్లారెడ్డి, మేయ‌ర్ రామ్మోహ‌న్, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు ప్ర‌తి ఇంటికి వెళ్లి ల‌బ్దిదారుల‌తో క‌లిసి పాలు పొంగించి సామూహిక‌ గృహ‌ప్ర‌వేశం చేయించారు. ఈ ప్రారంభోత్స‌వానికి వ‌చ్చిన మంత్రివ‌ర్గ బృందానికి చిత్తార‌మ్మ‌బ‌స్తీ డ‌బుల్ బెడ్‌రూం ల‌బ్దిదారులు బ‌తుక‌మ్మ‌లు, బోనాలు, బాణాసంచాతో  ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. ఈ కార్య‌క్ర‌మంలో స్థానిక కార్పొరేట‌ర్ కొండూరు న‌రేంద్ర‌చార్య కూడా పాల్గొన్నారు.

రూ. 6.51 కోట్ల వ్య‌యంతో రెండు ఇండోర్ స్టేడియంల ప్రారంభం:

కూక‌ట్‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంతో పాటు ప‌రిస‌ర ప్రాంతాల యువ‌త క్రీడా సౌక‌ర్యాల‌కోసం జిహెచ్ఎంసి ఆధ్వ‌ర్యంలో రూ. 6.51కోట్ల వ్య‌యంతో నిర్మించిన రెండు ఇండోర్ స్టేడియాల‌ను మంత్రి కె.టి.ఆర్ ప్రారంభించారు. ఉద‌యం అయ్య‌ప్ప‌సొసైటి గాయ‌త్రిన‌గ‌ర్‌లో రూ. 86 ల‌క్ష‌ల వ్య‌యంతో నూత‌నంగా నిర్మించిన ష‌టిల్ ఇండోర్ స్టేడియాన్ని ప్రారంభించారు. అనంత‌రం కూక‌ట్‌ప‌ల్లి 6వ ఫేస్‌లో రూ. 5.65 కోట్ల వ్య‌యంతో అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో నిర్మించిన ఇండోర్ స్టేడియాన్ని ప్రారంభించారు. రెండు అంత‌స్తుల మేర నిర్మించిన ఈ ఇండోర్ స్టేడియంలో స్విమ్మింగ్ పూల్‌, బ్యాడ్మింట‌న్ కోర్టులు, కెఫెటేరియా, క‌రాటే త‌దిత‌ర ఇండోర్ గేమ్‌ల‌ను ఆడేందుకు సౌక‌ర్యం క‌ల్పించారు.

మ‌త్స్య‌కారుల ఉపాధి పెంపొందించేందుకు మోడ్ర‌న్ ఫిష్ మార్కెట్ ప్రారంభం:

కూక‌ట్‌ప‌ల్లిలో రూ. 2.78 కోట్ల వ్య‌యంతో నిర్మించిన‌ హోల్‌సేల్ మోడ్ర‌న్ ఫిష్ మార్కెట్‌ను రాష్ట్ర మున్సిప‌ల్ శాఖ మంత్రి కె.టి.రామారావు ప్రారంభించారు. 1,651 చ‌ద‌ర‌పు మీట‌ర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఫిష్ మార్కెట్ నిర్మాణానికి జాతీయ మ‌త్స్య అభివృద్ది సంస్థ రూ. 2.25 కోట్లు అందించ‌గా జిహెచ్ఎంసి వాటాగా రూ. 53.20 ల‌క్ష‌ల‌ను కేటాయించింది. మొత్తం 81 పిష్ స్టాల్స్ ఉన్న ఈ మార్కెట్‌లో రెండు హోల్ సేల్ స్టాల్‌, ఆరు డ్రై ఫిష్ స్టాల్స్‌, ఒక ఫుడ్ కోర్టుల‌ను కూడా ప్ర‌త్యేకంగా నిర్మించారు. ఈ మార్కెట్ నిర్మాణంతో మ‌త్స్య‌కారులు, ముదిరాజ్‌ల వ్యాపారాభివృద్దికి ప్ర‌ధాన కేంద్రంగా నిలువ‌నుంది.

ఆర్‌.ఓ.బి నిర్మాణంతో తీర‌నున్న ట్రాఫిక్ క‌ష్టాలు:

రూ. 83కోట్ల వ్య‌యంతో నిర్మించ‌నున్న రైల్వే ఓవ‌ర్ బ్రిడ్జి నిర్మాణ ప‌నుల‌కు మున్సిప‌ల్ శాఖ మంత్రి కె.టి.రామారావు కైత‌లాపూర్ వ‌ద్ద ప‌నుల‌ను ప్రారంభించారు. ఈ ఆర్‌.ఓ.బి నిర్మాణ ప‌నుల‌క‌య్యే రూ.83 కోట్ల వ్య‌యంలో రైల్వే శాఖ రూ. 18.06 కోట్ల‌ను కేటాయించ‌గా జిహెచ్ఎంసి ద్వారా ఈ ఆర్‌.ఓ.బి అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి రూ. 40కోట్లు, భూసేక‌ర‌ణ‌కు రూ. 25 కోట్లు ప్ర‌త్యేకంగా కేటాయించింది. 676 మీట‌ర్ల పొడవు, 16.61 మీట‌ర్ల వెడ‌ల్పుతో నాలుగు లేన్ల బై డైరెక్ష‌న‌ల్ ఆర్‌.ఓ.బి నిర్మాణం వ‌ల్ల జె.ఎన్‌.టి.యు జంక్ష‌న్‌, మ‌లేషియ‌న్ టౌన్ షిప్‌, హైటెక్ సిటీ ఫ్లైఓవ‌ర్‌, సైబ‌ర్ ట‌వ‌ర్‌ జంక్ష‌న్‌, మాదాపూర్‌, బాలాన‌గ‌ర్‌, స‌న‌త్‌న‌గ‌ర్ త‌దిత‌ర ప్రాంతాలవారికి సుల‌భంగా ప్ర‌యాణించే వీలవుతుంది. 


More Press News