కేజీ నుంచి పీజీ వరకు తెలుగు మాధ్యమ బోధన జనసేన విధానం: పవన్ కల్యాణ్
* 8వ తరగతి వరకు మాతృ భాష బోధన కేంద్రం విధానం
* వైసిపి సర్కారు కేంద్ర విధానానికి వ్యతిరేకంగా వెళ్తోంది
* ఆంగ్ల మాధ్యమం విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలి
* జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్
ఎల్.కె.జి. నుంచి పీజీ వరకు తెలుగు మాధ్యమంలోనూ చదువుకునే వెసులుబాటు ఇవ్వటమే జనసేన పార్టీ విధానం అని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ చెప్పారు. తెలుగు మాధ్యమం పూర్తిగా తొలగించడం పద్ధతి కాదు... ఆ మాధ్యమాన్ని కొనసాగిస్తూ, ఆ మాధ్యమంలో చదువుకొనే వారికి ప్రోత్సాహం ఇచ్చేలా తదుపరి ఎన్నికల ప్రణాళికను రూపొందిస్తాం అన్నారు. బుధవారం విజయవాడలో పవన్ కల్యాణ్ ని ఆయన నివాసంలో తెలుగు భాషోద్యమ సమాఖ్య అధ్యక్షులు డాక్టర్ సామల రమేష్ బాబు కలిశారు. ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టే దిశగా వైసిపి ప్రభుత్వం అడుగులు వేస్తున్న క్రమంలో మాతృ భాషను కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... "ఎల్.కె.జి. నుంచి పీజీ వరకు మాతృ భాషలో బోధన ఎలా అనే అంశంపై పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. జనసేన ప్రభుత్వం వచ్చాక కేజీ నుంచి పీజీ వరకూ తెలుగు మాధ్యమంలో చదివే వారికి రుసుములు ప్రభుత్వమే చెల్లించే విధానం తెస్తాం. కస్తూరి రంగన్ గారి నేతృత్వంలోని కమిటీ 2019 జాతీయ విద్యా విధానానికి సంబంధించిన ముసాయిదాను డాక్టర్ రమేష్ బాబు గారు మా దృష్టికి తీసుకువచ్చారు. ఒకటవ తరగతి నుంచి 8వ తరగతి వరకు మాతృ భాషలోనే బోధన చేయాలన్నది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని అమలు చేసేలోపే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఇంగ్లీష్ లో బోధన చేయాలనే విధానాన్ని తీసుకువచ్చింది. ఇది కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకం. ఇదే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాష విషయంలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. తెలుగు భాష మీద మక్కువతో రమేష్ బాబు గారు రెండు దశాబ్దాలుగా అమ్మనుడి అనే పత్రికను నడుపుతున్నారు. తెలుగు మాధ్యమ బోధనలో ఎలాంటి మార్పులు చేస్తే మంచి మార్పులు వస్తాయి అనే అంశంపై కూడా ఆయనతో మాట్లాడడం జరిగింది. పాఠశాలల్లో ఓ ఆహ్లాదకరమైన వాతారణంలో తెలుగు బోధన జరిపేలా చర్యలు తీసుకుంటాం" అని అన్నారు.
తెలుగు భాషోద్యమ సమాఖ్య అధ్యక్షులు డాక్టర్ సామల రమేష్ బాబు మాట్లాడుతూ తెలుగు జాతిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే సత్తా పవన్ కల్యాణ్ గారికి ఉందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తెలుగు భాషోద్యమ సమాఖ్య తరఫున వారికి కావల్సిన మద్దతు ఇస్తామని తెలిపారు. డాక్టర్ సామల రమేష్ బాబుతోపాటు విశ్రాంత అధ్యాపకులు డాక్టర్ వి. సింగారావు కూడా పవన్ కల్యాణ్ ని కలసిన వారిలో ఉన్నారు.