భవన నిర్మాణ కార్మికుల కోసం జనసేన డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు: పవన్ కల్యాణ్ ప్రకటన

  • 15, 16 తేదీల్లో ఏర్పాటు

  • అడ్డాల్లో కార్మికులు చేరే చోట శిబిరాల ఏర్పాటు

  • భవన కార్మికులకు మేమున్నాం అన్న భరోసా 

  • ప్రభుత్వం కళ్ళు తెరిపించడమే మా ఉద్దేశం

  • ఏడుగురికి ఎక్స్ గ్రేషియా ఇచ్చి చేతులు దులుపుకున్నారు

  • జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటన

పనులు లేక పస్తులుంటున్న భవన నిర్మాణ కార్మికుల కోసం డొక్కా సీతమ్మ స్ఫూర్తితో జనసేన పార్టీ తరఫున డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్టు పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఈ నెల 15, 16 తేదీల్లో (శుక్రవారం, శనివారం) జనసేన నాయకులు, కార్యకర్తలు భవన నిర్మాణ కార్మికుల కోసం డొక్కా సీతమ్మ శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరారు. శుక్రవారం హైదరాబాద్ ప్రశాసన్ నగర్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో శిబిరాల ఏర్పాటుకు సంబంధించి ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. 

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. "ఆకలితో ఉన్న వారికి  పని కల్పించి కడుపు నింపాల్సిన ప్రభుత్వమే... భవన నిర్మాణ కార్మికుల ఉపాధి పోగొట్టి వారి కడుపు మాడ్చేసింది. విశాఖలో వారికి మద్దతుగా చేపట్టిన లాంగ్ మార్చ్ విజయవంతంగా సాగింది. విశాఖ ప్రెస్ మీట్ లో భవిష్యత్తులో భవన నిర్మాణ కార్మికులకు అండగా శిబిరాలు ఏర్పాటు చేస్తాం అని చెప్పాం. అందులో భాగంగా జనసేన నాయకులు, జనసైనికులు వారికి మరింత అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. పస్తులుంటున్న కార్మికుల కోసం మనకి చేతనైన సహాయం, మనకి పరిమితమైన వనరులే ఉన్నాయి. మనం ఎంత సహాయం చేయగలిగితే అంత చేద్దాం.

శిబిరాలు ఏర్పాటు చేయడం వెనుక ముఖ్య ఉద్దేశం మాది ఒక పార్టీ అయినప్పటికీ, 35 లక్షల మందికి పైగా జీవితాల్ని పోషించలేనప్పటికి భవన నిర్మాణ కార్మికులకు మేమున్నాం అన్న భరోసా కల్పించడం, ప్రభుత్వానికి కళ్లు తెరిపించడం. జనసేన శ్రేణులు, నాయకులు మనవంతు సాయంగా కొంత కృషి చేసి ఆహార సదుపాయాన్ని ఏర్పాటు చేద్దాం.

* ఓదార్పు యాత్రలో లక్షలు ఇచ్చారు:

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఐదు నెలలుగా వారు ఉపాధి కోల్పోయారు. 40 నుంచి 50 రోడ్డు ప్రమాదం అత్యంత బాధాకరం మంది చనిపోయారు. లక్షలాది మంది రోడ్డున పడ్డారు. వారి భవిష్యత్తుని అగమ్యగోచరంగా మార్చారు. వారికి మద్దతుగా మేం భారీ ర్యాలీ చేస్తే కంటి తుడుపు చర్యగా ఓ ఏడు మందికి ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. చనిపోయింది 40 నుంచి 50 మంది అని భవన నిర్మాణ కార్మిక సంఘాలు చెబుతుంటే మీరు ఇచ్చింది ఏడుగురికి మాత్రమే. మరి ఓదార్పు యాత్రలో ఏ లెక్కలతో 1200 మంది చనిపోయారని చెప్పారో తెలియదు. కాని వారి ఇళ్లకు వెళ్లి లక్షల రూపాయలు ఇచ్చారు. ఈ రోజున మేం మీ పార్టీ సొమ్మో,  మీ సొంత డబ్బో అడగడం లేదు. ఇల్లు కట్టుకొనే ప్రతి ఒక్కరు సెస్ కడతారు. అది భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికి వెళ్తుంది. ఆ సంక్షేమ నిధి నుంచి చనిపోయిన మిగిలిన కార్మికుల కుటుంబాలకు కూడా రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి. మీరు రాజకీయంగా ఎదుగుదామనుకున్న సమయంలో ఓదార్పు యాత్రలకు 1200 మంది గుర్తుకొస్తారు. ఇప్పుడు మాత్రం చనిపోయినవారిని గుర్తించరు.

* రంగులే వేసుకుంటారో... పేర్లే పెట్టుకొంటారో.. మీ ఇష్టం 

మీ వల్ల వారు జీవన భృతి కోల్పోయారు. మీరు తీసుకున్న నిర్ణయం వల్ల జీవనోపాధి కోల్పోయి ఆకలితో పస్తులుంటున్నారు. అలాంటి వారి కోసం డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో మేము ఆహార శిబిరాలతో అండగా ఉంటున్నాం.. మేమే చేయగలిగినప్పుడు అపరిమితమైన నిధులు ఉన్న మీరు ఎందుకు చేయలేరు.? వారి కోసం మీరు ఆహార కేంద్రాలు పెట్టండి. దానికి మీరు ఏ రంగులు వేసుకున్నా ఏ పేరు పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు. భవన నిర్మాణ కార్మికులు పస్తులు ఉండకూడదు. ప్రభుత్వం వారికి అండగా ఉండాలి. ఒక వేళ అలా చేయలేని పక్షంలో ఇచ్చిన మాట మేరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం" అన్నారు.


More Press News