ప్రపంచ ఫోటోగ్రఫీ పోటీల విజేతలకు అవార్డుల ప్రదానం

  • హాజరైన మంత్రి తలసాని, సి. ఎస్ సోమేశ్ కుమార్, స్పెషల్ సి.ఎస్ అర్వింద్ కుమార్
హైదరాబాద్, ఆగస్టు 25: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫోటోగ్రఫీ పోటీలలో విజేతలైన ఫోటోగ్రాఫర్లకు అవార్డుల ప్రధానోత్సవం నేడు హైదరాబాద్లో అట్టహాసంగా జరిగింది. ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ కూర్మాచలం అనీల్ లు హాజరయ్యారు. 

మొత్తం ఐదు విభాగాల్లో నిర్వహించగా ఈ ఫోటోగ్రఫి పోటీలకు 96 మంది ప్రెస్ ఫోటోగ్రాఫర్లు మొత్తం 1200 లకు పైగా ఎంట్రీలను పంపారు. ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ, శాస్త్ర సాంకేతిక పరంగా గణనీయమైన మార్పులు వచ్చినప్పటికీ ఫోటోలకు ఉన్న ప్రాధాన్యత తగ్గలేదని అన్నారు. గత స్మృతులు, చారిత్రను, తెలియచేసే ఫోటోలను తిరిగి చూస్తే ఒక్కసారిగా మనసు తేలికై సరికొత్త ఉత్సాహం లభిస్తుందని అన్నారు. జర్నలిస్టులతో సమానంగా ప్రెస్ ఫోటోగ్రాఫర్లు క్షేత్ర స్థాయిలో ఉత్సాహంగా వార్తా ఫోటోలను బందిస్తారని వీరికి మరింత గుర్తింపు రావాలని అన్నారు. ఫోటోగ్రఫీ పోటీల విజేతలకు అందించే నగదు పారితోషికాన్ని పెంచాలని తలసాని సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, వెయ్యి పదాలను ఒక్క ఫోటో తెలియచేస్తుందని అన్నారు. ఇప్పటికీ పలు ఫోటోలో ఎప్పటికీ మన మదిలో ఉంటాయని దీనికి ఉదాహారణగా ఆఫ్రీకా లో ఆకలితో అలమటించే ఒక బాలిక ను ఒక రాబందు ఎదురుచూసే ఫోటోను పేర్కొన్నారు. ఛాయా చిత్రాలకు భాషతో సంబంధం లేదని, ఫోటోలు అనేవి విశ్వజనీనమని పేర్కొన్నారు. స్వతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా స్వతంత్ర పోరాట స్ఫూర్తిని కలిగించేందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 552 సినిమా హాళ్లలో ప్రదర్శించిన గాంధీ చలన చిత్రాన్ని రికార్డు స్థాయిలో 22.37 లక్షల మంది విద్యార్థులు  తిలకించారని వెల్లడించారు. 

సమాచార శాఖ కమీషనర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ మాట్లాడుతూ, సమాచార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించగా ఈ ఫోటోగ్రఫీ పోటీలకు వచ్చిన ఎంట్రీలు ఈ ఎనిమిదేళ్ల అభివృద్ధి ప్రస్థానాన్ని తెలిపే విధంగా ఉన్నాయని అన్నారు. ఈ పోటీలకు వచ్చిన ఫోటోలను నగరంలోని పలు ప్రధాన ప్రాంతాల్లో ప్రదర్శించనున్నట్టు తెలిపారు. ఈ సందర్బంగా ఫోటో ప్రదర్శనను మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ప్రారంభించారు. సి.ఎస్ సోమేశ్ కుమార్, ఎఫ్.డీ.సి చైర్మన్ అనీల్ కూర్మాచలం లు వీక్షించారు. ఈ కార్యక్రమంలో సమాచార శాఖ డైరెక్టర్ రాజమౌళి, అడిషనల్ డైరెక్టర్ నాగయ్య కాంబ్లే, ఎఫ్.డి.సి జె.ఎం.డి కిషోర్ బాబు,  జాయింట్ డైరెక్టర్లు జగన్, శ్రీనివాస్, వెంకట రమణ, డీడీలు వెంకటేశ్వర్లు, రాజా రెడ్డి, ఫోటో విభాగం ఏ.డి బీమల్ దేవ్ తదితరులు పాల్గొన్నారు.  

More Press News