భవన నిర్మాణ కార్మికుల కష్టాల పరిష్కారానికి రెండు వారాల గడువు ఇస్తున్నాం: పవన్ కల్యాణ్

•మీరు చేసిన తప్పులకు ప్రతి భవన నిర్మాణ కార్మికుడికీ రూ.50 వేలు ఇచ్చి తీరాలి 

•చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి 

•35 లక్షల మంది కార్మికులను రోడ్డునపడేసిన   వైసీపీ ఎమ్మెల్యేలకు జీతభత్యాలు తీసుకొనే హక్కు లేదు 

•గడువులోగా స్పందించకపోతే అమరావతి వీధుల్లో నడుస్తా... ఎవరు అడ్డుకొంటారో చూస్తా 

•భవన నిర్మాణ కార్మికుల కష్టం... ఆవేదన నా మనసుని బలంగా తాకాయి 

•ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలలోపే ప్రజలు ఎందుకు రోడ్డు మీదకు వస్తున్నారో ఆలోచించాలి 

•ప్రజలు రోడ్డు మీదకు వచ్చారంటే ప్రభుత్వం విఫలమైనట్లే 

•కష్టాల్లో ప్రజలకు మాత్రమే నేను దత్తపుత్రుడిని 

•ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళేవాళ్ళకు పాలించే అర్హత ఉందా?

•రెండున్నరేళ్లు జైల్లో ఉన్నవారు నాయకులు కావడం దురదృష్టం 

•వైసీపీలో ఉన్నది ప్రజాస్వామ్యం కాదు... ఏకస్వామ్యమే 

•విశాఖపట్నం లాంగ్ మార్చ్ సభలో జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ 

35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు నెలల తరబడి ఉపాధి లేక రోడ్డునపడ్డారు... వారి కష్టాలను రెండు వారాల్లోగా పరిష్కరించాలని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ గారు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. గడువులోగా ప్రభుత్వం స్పందించకపోతే అమరావతి వీధుల్లోనే భవన నిర్మాణ కార్మికులకు అండగా నడుస్తాను అని ప్రకటించారు. ఎవరు వచ్చి ఆపుతారో చూస్తాను... పోలీసులని పెట్టుకొంటారో, ఆర్మీని తెచ్చుకొంటారో అన్నారు. ప్రతి భవన నిర్మాణ కార్మికుడికీ రూ.50 వేలు చెల్లించాలి అని డిమాండ్ చేశారు. మంత్రుల జేబుల్లోంచి ఇవ్వక్కర లేదు... భవన నిర్మాణ కార్మికుల నిధి నుంచి ప్రభుత్వం తీసుకున్నది రూ.1200 కోట్లు ఉంది... అందులోంచి కార్మికులకు ఇవ్వండి అన్నారు. 36 మంది కార్మికులు చనిపోయారు... వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి అని స్పష్టం చేశారు.

ఇసుక లభ్యత లేకపోవడం మూలంగా అయిదు నెలల నుంచి ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికుల కష్టాలను అందరికీ తెలిపేందుకు ఆదివారం విశాఖపట్నంలో జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ గారు లాంగ్ మార్చ్ చేపట్టారు. మద్దిలపాలెం తెలుగుతల్లి విగ్రహం నుంచి జి.వి.ఎం.సి. గాంధీ విగ్రహం వరకూ ఈ మార్చ్ సాగింది. రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా తరలి వచ్చిన భవన నిర్మాణ కార్మికులు, జన సైనికులు, ఆడపడుచులు పాల్గొన్నారు. పవన్ కల్యాణ్ గారు ఆ జన సందోహంలో నడవడం అత్యంత కష్టమైంది. దాంతో వాహనంపైకి ఎక్కి జనానికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. మార్చ్ ముగిసిన చోట ఏర్పాటు చేసిన వేదిక నుంచి ప్రసంగించారు.

పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ “ప్రజల కష్టాలను అర్థం చేసుకోవాలి. అది నా బాధ్యతగా భావిస్తాను. ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు రోడ్డు మీదకు వస్తున్నారు. అంటే ప్రభుత్వం విఫలమైందనే అర్థం. భవన నిర్మాణ కార్మికుల్లో ఎంత ఆవేదన ఉందో రోడ్డు మీదకు వచ్చిన వారిని చూస్తే తెలుస్తుంది. ఇలా ఎందుకు వస్తున్నారో ఆలోచించాలి. ఇప్పటి వరకూ 36 మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. ఇంతమంది చనిపోవడం నాకు చాలా ఆవేదన కలిగించింది, ప్రభుత్వాలు ప్రాణాలు రక్షించాలి తప్ప ప్రాణాలు తీయకూడదు. పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుస్తుంది. ఒక కార్మికుడు సెల్ఫీ వీడియో పెట్టి ఆత్మహత్య చేసుకుంటున్నా అని చెప్పి చనిపోయాడు, అంతకంటే దౌర్బాగ్యం ఏమైనా ఉంటుందా? ప్రజల ఆవేదనే నన్ను రాజకీయాల్లోకి తీసుకువచ్చింది. సిఎం జగన్ అద్భుతంగా పాలన చేసి ఉంటే ఇలాంటి నిరసనలు తెలియచేయం కదా. 

•అభివృద్ధి ఆగిపోయింది 

ఇసుకను అందుబాటులోకి తీసుకురాకపోవడం వల్లే అభివృద్ధి ఆగిపోయింది. పాలనలో అనుభవం లేదు కాబట్టే వైసీపీ వాళ్ళు ఇసుకే కదా అని తేలిగ్గా మాట్లాడుతున్నారు. నిర్మాణ రంగం ఆగిపోతే అభివృద్ధి ఆగిపోతుంది. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా నిర్మాణాలు సాగుతుంటాయి. పాఠశాలలో చిన్న క్లాస్ రూమ్ అదనంగా కట్టాలి అన్నా – వివిధ విభాగాల కార్మికులు పని చేయాల్సి ఉంటుంది. నిర్మాణానికి అవసరమైన ఇసుకను దూరం చేస్తే అన్ని విభాగాలకీ పని లేకుండాపోతుంది. అందుకు అనుగుణంగానే అభివృద్ధి ఆగుతుంది. ఈ రంగం కుదేలైపోయి ఉంది. భవన నిర్మాణ కార్మికుల కష్టాలు, ఆవేదన నా మనసును బలంగా తాకాయి. నేను కష్టించే వాడిని, కష్టాన్ని అర్థం చేసుకునే వాడిని, అందుకే నేను నా జీవితం నేను చూసుకోలేక రాజకీయాల్లోకి వచ్చాను. కార్మికుల కష్టాలు బాధలు అర్థం చేసుకున్నవాడిని. 

•వర్షాలు, వరదలు ఏమైనా కొత్తా? మిగిలిన రాష్ట్రాల్లో ఎలా ఇసుక లభిస్తోంది?

15 రోజుల్లో ఇసుక పాలసీ అని చెప్పి, 45 రోజులైనా దానిపై మాట్లాడలేదు, చర్చలు జరగలేదు, అలా చేస్తూ సెప్టెంబర్ వరకు తీసుకొచ్చారు, ఇప్పుడు వర్షాలు, వరదలు అని అంటారు. సెప్టెంబర్ లో వర్షాలు ఇదే తొలిసారా రావటం, ముందే ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఇతర రాష్ట్రాల్లో వర్షాలు రాలేదా? అక్కడ ఇసుక లభ్యం అవుతోంది. అక్కడ కార్మికులు చనిపోతున్నారా, ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది. శ్రామికుడిలో నేను దేవుడిని చూస్తాను,  భవన నిర్మాణ కార్మికులు నాకు దేవుళ్ళతో సమానం. భవన నిర్మాణ కార్మికులు లేకపోతే జీవిత రథచక్రాలు ఆగిపోతాయి, వారిని కాపాడుకోలేకపోతే ఇబ్బందిపడతాం. భవన నిర్మాణ కార్మికులు అడిగేది పని, వారి పని వారు  చేసుకునేలా ఉంటే మాకు ఏమి అవసరం లేదు.

కష్టం అంటూ మా దగ్గరకు ఎవరు వచ్చినా వారి కష్టాలను తీర్చేందుకు జనసేన పనిచేస్తుంది, పదవులు మాకు ముఖ్యం కాదు. వైసీపీ నాయకులు వచ్చి వారు చేసిన ప్రచారాలను ప్రజలు నమ్మి నన్ను కూడా ఓడించారు, అయినా సరే పర్వాలేదు, నిజం నిలకడ మీద తెలుస్తుంది. ఓడిపోయిన వ్యక్తి వెనుక మేమున్నాం అని చెప్పిన మీ ప్రేమ కంటే గొప్ప పదవి ఏది లేదు. ప్రజల కష్టాలను అర్ధం చేసుకుని మాట్లాడితే అందరి మన్నన్నలు పొందుతాము తప్ప వారిని కష్టాలకు గురి చేస్తే కాదు.

•జగన్‌ ప్రభుత్వంలో డిబేట్లు లేవు..., ఆలోచనలు పంచుకోరు 

చంద్రబాబు నాయుడు గారు మీద కోపంతో లక్షల మంది కార్మికులను రోడ్డు పాల్జేయడం సమంజసమా? టీడీపీ ప్రభుత్వం ఇసుక విధానంలో తప్పొప్పులు ఉంటే సరిచేసి ముందుకు వెళ్ళాలి. అంతేతప్ప మొత్తం ఆపేస్తాం అంటే ఎలా? 15 రోజుల్లో ఇసుక పాలసీ అని చెప్పి, 45 రోజులైనా దానిపై మాట్లాడలేదు, చర్చలు జరగలేదు, అలా చేస్తూ సెప్టెంబర్ వరకు తీసుకొచ్చారు, ఇప్పుడు వర్షాలు, వరదలు అని అంటారు.  ముఖ్యమంత్రి వెంట ఉన్న అజయ్ కల్లం లాంటి ఆలోచనపరులకు ఈ సమస్య గురించి తెలియదు అనుకోవడానికి లేదు. వైసీపీలో ప్రజాస్వామ్యం లేదు. అక్కడ ఉన్నది ఏకస్వామ్యమే. జగన్ ప్రభుత్వంలో డిబేట్లు లేవు. ఆలోచనలు పంచుకోరు. పాలన ఇష్టానుసారం చేసుకుంటూపోతున్నారు. ఇప్పుడే ఇసుక కొరత ఎందుకు వచ్చింది?. దేశంలో ఎక్కడా లేనట్లుగా ఇక్కడే ఇసుక కొరత ఎందుకు ఉంది. కూలీలు ఎందుకు చనిపోతున్నారు?. జీవనాధారం పోయిందని ఆవేదనపడుతూ సెల్ఫీ వీడియోలు తీసి కూలీలు చనిపోతున్నారు. ఇంత కంటే దారుణం ఎక్కడైనా ఉంటుందా?. ఇంతమంది జనం ఆత్మహత్యలు చేసుకుంటుంటే వైసీపీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు జీతభత్యాలు తీసుకునే అర్హత లేదు. అయిదు నెలలపాటు జీతభత్యాలు తీసుకోకూడదు.

•జగన్ రెడ్డిగారిలా కార్మికులకు వేల కోట్లు లేవు 

వేల కోట్లు ఉన్నవాళ్ళకి కార్మికుల కష్టాలు తెలియవు. భవన నిర్మాణ కార్మికులెవరికీ జగన్ రెడ్డి గారిలా వేల కోట్ల ఆస్తులు లేవు. ఏ రోజు కూలీ ఆ రోజు తీసుకువెళ్తేనే ఇల్లు గడిచేది. ప్రజల సమస్యలపై మాట్లాడుతుంటే వైసీపీ మంత్రులు, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి గారు నాపై చంద్రబాబు దత్తపుత్రుడు, డి.ఎన్.ఏ., బి టీం అని మాట్లాడుతున్నారు. నేను చంద్రబాబు గారి దత్తపుత్రుడిని కాదు. కష్టాల్లో ఉన్న ప్రజలకే నేను దత్తపుత్రుడిని. సూట్‌కేస్ కంపెనీలు పెట్టే విజయసాయి రెడ్డికి కూడా సమాధానం చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అంబేద్కర్, కాన్షీరామ్ లాంటి మహామహులే ఓడిపోయారు. వారి స్ఫూర్తితోనే ముందుకు సాగుతున్నా. ఓడిపోవచ్చేమోగానీ నాలో చిత్తశుద్ధిలో నిబద్ధత ఉంది.

రెండున్నరేళ్లు జైళ్లో ఉన్న నాయకులు కూడా విమర్శిస్తున్నారు. స్వతంత్ర్య పోరాట నాయకుడిలా, లేదా పౌరహక్కులను కాపాడే నాయకుడిలా జైలుకెళ్లలేదు. సూట్‌కేసు కంపెనీలు పెట్టి జైలుకెళ్లారు. మంత్రి కన్నబాబు ఎలా వచ్చాడో తెలుసు. నాగబాబు తీసుకువస్తే రాజకీయా ల్లోకి వచ్చాడు. వాళ్ళ బతుకులు తెలుసు. టీడీపీకి టీం బి అంటున్నారు. ఇక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులతో నేను విభేదించాను, వారు నాకు సమాధానం చెప్పారు. కానీ మేము కలవలేదు. ఎన్నికల ముందు కలిసిపోయి కొన్ని సీట్లు తీసుకోవచ్చు. కానీ అలా చేయలేదు. నేను ఆశయానికి కట్టుబడేవాడిని. ప్రత్యేక హోదా అనే ఆశయానికి కట్టుబడే నేను మోదీతో విభేదించా. నన్ను మోదీ చాలా ప్రేమగా పిలిచేవారు. నాకంటూ కొన్ని ఆశయాలు ఉన్నాయి. అందుకే రాజకీయ వ్యూహం వేయలేదు. జన సైనికులు, ఆడపడుచులు రాజకీయ వ్యూహంతో వెళ్ళమని చెప్పి అనుమతించారు. 

•చర్యకు ప్రతిచర్య ఉంటుంది 

కూల్చివేతలతో మొదలుపెట్టిన ప్రభుత్వం కూలిపోతుంది. ఇది కర్మ సిద్ధాంతం కాదు..చర్యకు ప్రతిచర్య ఉంటుంది. ప్రజల్ని మీరు ఎలా చూస్తారో.. వాళ్లు మిమ్మల్ని అలానే చూస్తారు. 151 సీట్లు వచ్చిన నాయకులు కూడా దీనికి అతీతులు కాదు. ప్రతి శుక్రవారం కోర్టులకు వెళ్లే మీరు జనాలను పాలిస్తారా? వాళ్ళకు ఆ అర్హత ఉందా?

ఒక సమస్యపై అన్ని పక్షాలు కలసి రావాలి అనే రాజకీయ పార్టీలు అన్నింటినీ ఆహ్వానించాం. కష్టపడి పని చేసే కార్మికులకు కులం ఏమిటి? కులాలు, వర్గాలుగా చూడకూడదు. భవన నిర్మాణ కార్మికుల కోసం చేపట్టిన ఈ కార్యక్రమానికి తొలుత సంఘీభావం తెలిపిన బిజెపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారికి, టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుగారికి, వామపక్ష నేతలు రామకృష్ణ గారికి, మధు గారికి, లోక్ సత్తా, బిఎస్పీ నేతలకి, మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు గారికి, అచ్చన్నాయుడు గారికి కృతజ్ఞతలు. విశాఖపట్నంలో  ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేపట్టిన జనసేన నాయకులకు అభినందనలు. తమిళనాడు సి.ఎస్.గా చేసిన రామమోహనరావు గారు, మహారాష్ట్ర కేడర్ లో చేసిన తోట చంద్ర శేఖర్ గారితో ఇసుక విధానంపై సమగ్రంగా చర్చిస్తాం.

ఈ కార్యక్రమంలో విద్యుత్ షాక్ కి గురైన రమణారెడ్డి అనే భవన నిర్మాణ కార్మికుడుని వెంటనే ఆరిలోవ ఆసుపత్రికి తరలించారు. ఆయన క్షేమంగానే ఉన్నారు అని సమాచారం వచ్చింది” అన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న 36 మంది కార్మికులకు ఆత్మశాంతి చేకూరాలి అని మౌనం పాటించారు.


More Press News