బాలల హక్కుల సంరక్షణ కోసం ఈ ప్రభుత్వం ఎంతవరకైనా పనిచేస్తుంది: తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్

  • సీఎం కేసిఆర్ మహిళలు, బాలల సంక్షేమ, అభివృద్ధి కోసం పని చేస్తున్నారు

  • బాలల హక్కుల కమిషన్ గురించి విస్తృతమైన ప్రచారం చేయాలి

  • కనీసం హక్కులు తెలియకుండా జీవితాన్ని కోల్పోతున్న బాలల కోసం మనసు పెట్టి పని చేయాలి

  • తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ రాష్ట్ర స్థాయి సమావేశంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలోని బాలల హక్కులు, సంక్షేమం, సంరక్షణ కోసం ఎంతవరకు వెళ్లి అయినా పనిచేస్తుందన్న నమ్మకాన్ని కల్పించాల్సిన బాధ్యత మన మీద ఉందని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బాలల హక్కుల సంరక్షణ రాష్ట్ర కమిషన్ నూతనంగా ఏర్పాటైన సందర్భంగా నేడు మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి సమావేశంలో ఆమె ప్రసంగించారు. 

ముఖ్యమంత్రి కేసిఆర్ ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని, ముఖ్యంగా బాలలు, మహిళలకు ఎలాంటి లోటు ఉండకుండా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా జోగినపల్లి శ్రీనివాస్ రావు నేతృత్వంలో ఈ కమిషన్ ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్రంలో పిల్లలకు కచ్చితంగా మేలు జరుగుతుందన్న నమ్మకం తనకుందన్నారు. 

రాష్ట్రంలో చాలామంది బాలలు విధివంచితులుగా ఉన్నారని, వారు చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నారని ఆవేదన చెందారు. వారి హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత మనకు ఉందని,బాలలకు మనమంతా తోడుగా ఉన్నామన్న నమ్మకం కల్పించాలని కోరారు. బాలల చట్టాలను మనం చిత్తశుద్ధితో అమలు చేయగలిగితే మన రాష్ట్రంలో బాలలకు మంచి భవిష్యత్ అందించగలమని, మన ఆలన పాలన కోసం ఎదురు చూస్తున్న వారిని చేరుకుని, వారికి కావల్సిన చేయుత ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. 

మనతో వారి సమస్యలను చెప్పుకోలేని, నోరు లేని చిన్న పిల్లల సంరక్షణను చేసే బాధ్యత మనమీద ఉన్నప్పుడు మానవత్వంతో వారిని దగ్గరికి తీసుకోవాలన్నారు.

తానేప్పుడు పుట్టిన రోజు జరుపుకోలేదని, అయితే ఈసారి మంత్రి అయిన సందర్భంగా నా శాఖలోని చిన్న పిల్లలతో పుట్టిన రోజు చేసుకోవాలని అనుకుని శిశు విహార్ లో వారితో గడిపినప్పుడు నాకు చాలా సంతృప్తి నిచ్చిందని గుర్తు చేసుకున్నారు. శిశువిహార్ పిల్లలను కలిసినప్పుడు, వారి పరిస్థితిని చూసినప్పుడు, వారికోసం ఇంకా చాలా చేయాలన్న బాధ్యత కనిపించిందన్నారు. 

చిన్న పిల్లల సంక్షేమం, హక్కుల కోసం పనిచేస్తున్న యునిసెఫ్ తో సమన్వయం చేసుకుని మనం బాలల సంరక్షణ, హక్కుల పరిరక్షణ చేయాలి, వారికున్న అనుభవాన్ని వినియోగించుకుని మన దగ్గర ఉన్న లోపాలను సవరించుకుని బాలలకు మరింత మేలు చేసే విధంగా మన కమిషన్ పనితీరు ఉండాలని ఆశిస్తున్నాను అన్నారు.

ఇప్పటికీ ఇంకా చాలామంది తమ ఆర్ధిక పరిస్థితులు బాగులేక  ఎదిగిన అమ్మాయిలను పెళ్లి పేరుతో ప్రలోబాలకు లొంగి పంపించివేస్తున్నారని, ఇలాంటి దురాగతాలను అరికట్టాల్సిన బాధ్యత ఉందన్నారు.

కనీస హక్కులు లేకుండా ఉంటున్న పిల్లలకు అన్ని స్థాయిల్లో మనం అండగా ఉంటామన్న ధీమా కల్పించాలని, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మనకోసం ఉందని అందరికీ తెలిసేలా ప్రచారం చేయాలని సూచించారు. వెనుకబడిన జిల్లాల్లో రాష్ట్ర స్థాయి సమావేశాలు పెట్టి పిల్లల సమస్యలు గుర్తించి, పరిష్కరించే ప్రణాళికలు రూపొందించాలన్నారు. 

ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ జోగినపల్లి శ్రీనివాసరావు, సభ్యులు అంజన్ కుమార్, చిట్టిమల్ల రాగజ్యోతి, శోభారాణి, అపర్ణ, ఎడ్లపల్లి బృందాదర్ రావు, ఏ. దేవయ్య,  మహిళా-శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జగదీశ్వర్, బాల నేరస్తుల సంక్షేమం, సంస్కరణలు, వీధి బాలల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ, ఇతర అధికారులు పాల్గొన్నారు.


More Press News