మా పోరాటం రాజకీయ లబ్ది కోసం కాదు.. ప్రజా వ్యతిరేక విధానాలపై: పవన్ కల్యాణ్

* మీరు లారీలు అమ్ముకునే పరిస్థితి రాకుండా పోరాడుదాం

* ఇసుక ట్రాన్స్ పోర్టు లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో పవన్ కల్యాణ్

ఎన్నికల కోసమో, రాజకీయ లబ్ది కోసమో ప్రభుత్వంపై విమర్శలు చేయడం లేదని, ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసనగా రోడ్డు మీదకి రావాల్సి వస్తోందని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ అన్నారు. మీ బాధలను పది మంది దృష్టికి తీసుకువెళ్లి పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. శుక్రవారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఇసుక ట్రాన్స్ పోర్టు లారీ ఓనర్లు, డ్రైవర్లతో సమావేశం అయ్యారు. నూతన ఇసుక విధానం కారణంగా వారు పడుతున్న ఇబ్బందులను విన్నారు. 

అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. "నవంబర్ 3న విశాఖపట్నం వేదికగా లాంగ్ మార్చ్ భవన నిర్మాణ కార్మికుల కోసం మొదలుపెట్టినా, అనుబంధంగా ఇంకా ఎన్ని లక్షల మంది ఇబ్బందులు పడుతున్నారో చూస్తే దీన్ని మరింత బలంగా ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించాం. గత కొన్ని నెలలుగా ఇసుక విధానాల వల్ల జరిగిన నష్టాన్ని వింటూ ఉన్నాం. ఇసుక ఆపేయడం వల్ల ఇన్ని లక్షల మంది రోడ్డున పడటం చూస్తుంటే బాధ కలుగుతుంది. క్లీనర్ గా జీవితం మొదలుపెట్టి 33 సంవత్సరాలపాటు కష్టపడి ఓనర్ స్థాయికి వచ్చిన వ్యక్తులు, లారీల మీద ఎంతో కొంత బతుకుతున్నాం అన్న పరిస్థితుల్లో ప్రభుత్వ అస్థవ్యస్థ విధానాలు ఇబ్బంది పెడుతుంటే మీకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నాం. మీకు న్యాయం జరిగే వరకు మీ పక్షాన పోరాడుతాం. మీరు లారీలు అమ్ముకోకుండా, ఫైనాన్సర్లు మీ లారీలు లాక్కోకుండా మా వంతు చేయగలిగిన సహాయం మేం చేస్తాం అని అన్నారు. 

• ఉన్న వనరులు పక్కనపెట్టి కొత్త లారీలు కొనడం ఎందుకు?

ఇసుక లారీ ఓనర్స్ అసోసియేషన్ విజయవాడ ప్రెసిడెంట్ అన్నే చిట్టిబాబు మాట్లాడుతూ.. "ఆరు మాసాలుగా ఇసుక లేక రాష్ట్రంలో దుర్భర పరిస్థితులు ఉన్నాయి. వైసిపి ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఇసుక పాలసీ మమ్మల్ని జీరో చేసింది. లారీలకు జీపీఎస్ మెషిన్లు అమర్చమన్నారు. తీరా అమర్చాక మమ్మల్ని పక్కన పెట్టేశారు. ఆన్ లైన్ విధానం మీద చాలా మందికి అవగాహన లేదు. ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వం కొత్తగా 6 వేల లారీలు కొని అందులో ఇసుక తరలిస్తామంటూ జీవో. 486 జారీ చేశారు. ఉన్న వనరులు ఉపయోగించుకోకుండా కొత్తగా లారీలు కొనడం ఎందుకు?" అని ప్రశ్నించారు.

• ఇసుక అక్రమంగా హైదరాబాద్ తరలిపోతోంది

ఇబ్రహింపట్నం ఇసుక లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె. ధనరాజ్ మాట్లాడుతూ.. "జిల్లాలో 2 వేల ఇసుక రవాణా లారీలు ఉన్నాయి. కొత్తగా 6 వేల లారీలు ప్రభుత్వం కొంటే ఉన్న ఆపరేటర్లు ఏం చేయాలి? ఇప్పటికే ఫైనాన్సర్లు లారీలు లాక్కుపోతున్నారు. ఆ పెట్టుకునేది ఏదో మా లారీలే పెట్టుకునేలా చూడండి. ఇసుక మొత్తం అక్రమంగా పెద్ద లారీల్లో హైదరాబాద్ తరలిపోతోంది" అని తెలిపారు.

• ఇసుక లారీ ఓనర్ అంటే అప్పు కూడా పుట్టడం లేదు

లారీ ఓనర్ దుర్గారావు మాట్లాడుతూ.. "33 సంవత్సరాలు కష్టపడి క్లీనర్ స్థాయి నుంచి ఓనర్ స్థాయికి వస్తే వైసిపి ప్రభుత్వం చేసిన పనికి మళ్లీ వ్యవహారం మొదటికి వచ్చింది. కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వెళ్దామంటే పని ఇచ్చేవారులేరు. కిస్తీలు కట్టక లారీలు ఫైనాన్సర్లు తీసుకుపోతున్నారు. ఇసుక లారీ ఉంది అంటే అప్పు పుట్టడం లేదు. చావే శరణ్యం అనే పరిస్థితి వచ్చేసింది" అని అన్నారు.

• కలిస్తే గాలిని కూడా ఇసుకలో కలిపేస్తారు 

లారీ వర్కర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దుర్గారావు(పెప్సీ) మాట్లాడుతూ.. "ఇసుక మాఫియా ఎస్కార్టులు పెట్టి మరీ నెల్లూరు నుంచి విజయవాడ ఇసుక తెచ్చి అమ్ముతున్నారు. లారీలు ఆపితే ఎంపిలు, మంత్రుల నుంచి ఫోన్లు వస్తున్నాయి. చెత్తాచెదారం కలిసిన ఇసుక తెచ్చి టన్ను రూ. 2 వేలకు అమ్ముతున్నారు. ఇసుకలో కలిస్తే గాలిని కూడా అమ్మేసేలా ఉన్నారు. మీరు విశాఖ లాంగ్ మార్చ్ అన్న తర్వాత ప్రభుత్వ పెద్దల వెన్నులో వణుకు మొదలైంది. ఎలాంటి పోరాటం చేసినా మీ పోరాటంలో మేమూ ఉంటాం" అని అన్నారు. 

• విశాఖ లాంగ్ మార్చ్ కి బెజవాడలో సంఘీభావం

మరో లారీ ఓనర్ మాట్లాడుతూ "కొత్త ఇసుక పాలసీ కారణంగా నిర్మాణ రంగంతో పాటు దానికి అనుబంధంగా ఉన్న 36 విభాగాలు ఇబ్బందులు పడుతున్నాయి. డంపింగ్ యార్డులు పెట్టి అర్ధరాత్రి హైదరాబాద్ కి తరలించుకుపోతున్నారు. ఆన్ లైన్ వ్యవహారం కూడా మాఫియాలాగా తయారయ్యింది. 400 టన్నులు స్టాక్ యార్డుకి వస్తే 10 నిమిషాల్లో మాయం అయిపోతోంది. పాత మద్యం పాలసీని ముందుకు తీసుకువెళ్తూనే కొత్త పాలసీ తీసుకువచ్చిన ప్రభుత్వం., ఇసుక పాలసీని ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది. మీరు స్పందించాక ఎమ్మెల్యేలు, మంత్రులు మీడియా ముందుకు వచ్చి ఇసుక ఫుల్లుగా ఉందంటూ స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. నదిలో ఎంత ఇసుక ఉంటే ఉపయోగం ఏంటి? విశాఖలో మీరు బలంగా పోరాటం చేయండి. సంఘీభావంగా లారీ ఓనర్లంతా విజయవాడలో నిరసన తెలుపుతాం" అన్నారు.

 పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ " రవాణా రంగంలో ఇన్ని వేల మంది ఉపాధి కోల్పోవడం బాధాకరం. ప్రభుత్వ చర్యలు ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయి" అన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు బత్తిన రాము, అక్కల గాంధీ పాల్గొన్నారు.


More Press News