బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సమాజానికి హృదయపూర్వక శుభాకాంక్షలు: మంత్రి కొప్పుల ఈశ్వర్

  • ఇస్లాం శాంతి, సహనం, దయ, కరుణను బోధిస్తున్నది: మంత్రి కొప్పుల ఈశ్వర్
  • మైనారిటీల సంక్షేమం సముద్ధరణకు కేసీఆర్ చిత్తశుద్ధితో ముందుకు సాగుతున్నరు: మంత్రి కొప్పుల ఈశ్వర్
  • 204 గురుకులాల ద్వారా మైనారిటీలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నం: మంత్రి కొప్పుల ఈశ్వర్
హైదరాబాద్: బక్రీద్ పండుగ సందర్భంగా తెలంగాణ వాసులు,దేశ విదేశాలలో నివసిస్తున్న తెలంగాణ బిడ్డలైన ముస్లిం సోదర సోదరీమణులకు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ముస్లింలు రంజాన్ ( ఈదుల్ ఫితర్) మాదిరిగానే బక్రీదు (ఈదుల్ అధా )ను కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని ఒక ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు. ఇస్లాం ధర్మాన్ని ప్రపంచంలో కోట్లాది మంది అవలంభిస్తున్నారని, ఇది శాంతి, సహనం, దయ, కరుణ, ప్రేమ, ఐకమత్యం, మానవత్వాన్ని బోధిస్తున్నది వివరించారు. ఆర్థిక స్థోమత కలిగిన వారు ఈ పండుగ సందర్భంగా మేకలు, గొర్రెలను ఖుర్బానీ ఇచ్చి మాంసాన్ని పేదలు, బంధుమిత్రులకు పంచి పెడతారని, విందు భోజనం పెడతారని, తమ పూర్వీకులను కొలుస్తారని తెలిపారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ సుపరిపాలనలో మైనారిటీలు, అన్ని వర్గాల ప్రజలు ఎలాంటి అభద్రతకు లోను కాకుండా సుఖ సంతోషాలతో ప్రశాంతంగా జీవిస్తున్నారని కొప్పుల పేర్కొన్నారు. తమ ప్రభుత్వం 204 గురుకుల పాఠశాలల ద్వారా మైనారిటీలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నదని.. రంజాన్ సందర్భంగా విందులు ఏర్పాటు చేస్తూ, పేదలకు దుస్తులు అందజేస్తున్నామని వివరించారు. విదేశాలలో ఉన్నత విద్యా కోర్సులు చదివేందుకు ఆసక్తి చూపే యువతకు 20లక్షల చొప్పున ఉచితంగా అందిస్తున్నామని మంత్రి ఈశ్వర్ చెప్పారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు షాదీ ముభారక్ పథకం ద్వారా లక్షా 116 రూపాయలు ఉచితంగా ఇస్తున్నామని, దీంతో బాల్య వివాహాలు పూర్తిగా తగ్గిపోయి ఉన్నత విద్యావంతులవుతున్నారని కొప్పుల వివరించారు. బక్రీదు పండుగను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ప్రశాంత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో జరుపుకోవలసిందిగా ముస్లిం సమాజాన్ని మంత్రి కోరారు.


More Press News