రైతులకు ఉచితంగా పాడి ఆవులను పంపిణీ చేసిన మంత్రి హరీశ్ రావు!

  • సిద్దిపేట నియోజకవర్గంలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్న 200 మంది రైతులకు ఉచితంగా పాడి ఆవుల పంపిణీ కార్యక్రమం

ఏ పుణ్య కార్యం చేసినా, పూజ చేసిన గో పూజ ముఖ్యం.. ఆవుల పంపిణీ చక్కటి కార్యక్రమం.. రైతులంతా సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపాలి.. రైతులందరికీ శుభం జరగాలని ఆ దేవునికి ప్రార్థిస్తున్నా.. ఈ పాడి ఆవుల పాల వల్ల రైతులకు మంచి గిట్టుబాటు ధర వస్తుందని, దాంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం లభిస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు.

జిల్లా కేంద్రమైన సిద్ధిపేట పత్తి మార్కెట్ యార్డులో మంగళవారం ఉదయం పశువైద్య, పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో నియోజక వర్గంలోని పలు గ్రామాల లభ్దిదారులకు పాడి ఆవుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, జిల్లా జెడ్పి చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, పశు సంవర్థక శాఖ ఏడీ రాంజీ, నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ మేరకు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలకు చెందిన సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న రైతులతో మంత్రి హరీశ్ రావు మాటామంతి కలిపి తాము పండించిన పంటల సాగు తీరుతెన్నులపై ఆరా తీస్తూ.. వారితో మమేకమై మాట్లాడారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్ని కార్యక్రమాలు చేసినా ఇలాంటి కార్యక్రమాలే అధిక సంతృప్తిని ఇస్తాయని పేర్కొన్నారు. ఈ మంచి కార్యక్రమానికి స్ఫూర్తినిచ్చిన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సిద్ధిపేట నియోజక వర్గం పరిధిలో 263 మంది రైతులు సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారని సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులందరికీ ఆవులను ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. పంపిణీ చేసిన ఆవులను తల్లిలాగా చూసుకోవాలని కోరారు. ఉచితంగా పంపిణీ చేసిన ఈ ఆవులను జాగ్రత్తగా కాపాడుకోవాలంటూ.. ఆవులను అమ్మినా, నిర్లక్ష్యంగా వ్యవహరించినా వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టంగా చెప్పారు.

సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు ఇలాంటి ప్రోత్సాహం నిరంతర ప్రక్రియగా కొన సాగుతుందన్నారు. సేంద్రియ పంటల విక్రయానికి ప్రత్యేక యాప్ ఏర్పాటు చేసి, త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చి ఆ యాప్ లో రైతుల పూర్తి వివరాలు పొందుపరుస్తామని చెప్పుకొచ్చారు. రైతు బజారులో సేంద్రియ ఉత్పత్తుల విక్రయాలకు ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం.. కానీ నిజంగా ఈ పాడి ఆవుల పంపిణీ కార్యక్రమం నా మనస్సుకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు. సేంద్రియ వ్యవసాయం చేసే రైతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గత కొంత కాలంగా సిద్ధిపేట నియోజకవర్గంలో పని చేస్తూ రావడం జరిగిందని, నియోజకవర్గం పరిధిలోని 7 గ్రామాలకు చెందిన 263 మంది రైతు కుటుంబాలు మూడేళ్లుగా సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారని గుర్తించినట్లు తెలుపుతూ.. ఈ 263 మంది రైతులలో ఇప్పటికే 112 మంది రైతులకు ఆవుల ఇవ్వడం జరిగిందని, మరో 151 మంది సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులకు ఆవులను అందిస్తున్నట్లు, అలాగే గుడుంబా పని ఉపాధిగా చేస్తున్న లంబాడి అక్కాచెల్లెళ్లకు, అన్నదమ్ములకు సైతం 52 మందికి ఈ పాడి ఆవులను దానం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

గోవులు గోదానం విషయంలో నలుగురికి కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉన్నదని, నాకు ఈ ఆలోచన కలిగించి సాయం చేసిన గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డికి ముందుగా ధన్యవాదాలు తెలిపారు. నంగునూరు మార్కెట్ కమిటీ చైర్మన్ సోమిరెడ్డి, పశువైద్యాధికారి రాంజీ, బాల సుందరం 5 జతల బట్టలు తీసుకుని పోయి వాళ్లు.. లేబర్ లా ఫీల్ కాకుండా నేను అధికారి అని కాకుండా చాలా ఓపికగా ఉంటూ తెచ్చేందుకు కృషి చేశారని కొనియాడారు. అక్కడ కర్ణాటక మిలిటరీ వాళ్లు లెటర్ కావాలని అడిగారని.., వాస్తవానికి మన జిల్లా కలెక్టర్ 15 రోజుల నుంచి జ్వరంతో ఉన్నారని.., ఆ రోజు రాత్రి 10 గంటలకు ఫోన్ చేసి జిల్లా కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వమని కోరగానే వెంటనే స్పందించి గంటలోపు వాట్సాప్ ద్వారా పంపి అక్కడి మిలటరీ అధికారులతో మానిటరింగ్ చేసిన జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా పోలీసు యంత్రాంగాన్ని అందించి కర్ణాటక రాష్ట్రం బెలగాం నుంచి సిద్ధిపేటకు ఆవులను సురక్షితంగా తెప్పించిన పోలీసు కమిషనర్ జోయల్ డేవీస్ కు ధన్యవాదాలు తెలిపారు.

మనం సెంటిమెంట్ గా గృహ ప్రవేశం చేసేటప్పుడు మొదట అడుగు పెట్టేది ఆవుతోనే కాబట్టి.., ఆవు పేడ, మూత్రం ఉపయోగించి పూజా కార్యక్రమాలు చేస్తుంటామని, దేవుడికి మొక్కి ఆ దేవుడిని శుద్ధి చేసే పవిత్రమైన కార్యక్రమంలా ఇవాళ మనం చేసుకుంటున్నామని., మీరంతా వినియోగించుకోవాలని కోరారు. మీ ఇళ్లకు వెళ్లాక ఆవులను గోరువెచ్చని నీళ్లతో బాగా కడిగి శుద్ధి చేసి మంచి పూజ చేసి పచ్చిగడ్డి, అవసరమైన దాణా పెట్టాలని సూచించారు. నియోజక వర్గం పరిధిలో 7 గ్రామాల్లో పశువైద్యాదికారి పది రోజుల పాటు ప్రతి రోజు పర్యవేక్షణ చేయాలని అక్కడికక్కడే వారికి ఆదేశాలు ఇచ్చారు. ప్రతి ఆవు విలువ లక్ష రూపాయలు ఉంటుందని, మీ ఆవులకు వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్లు ఇన్సూరెన్స్ చేస్తారని., బాల వికాస సంస్థ వారి సమన్వయంతో ఆవులు పొందిన లభ్దిదారులకు ఇన్సూరెన్స్ చేయించుకోవాలని కోరారు.

ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ గ్రూపు ఏర్పాటు చేయండి:

ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ గా గ్రూపు ఏర్పాటు చేయాలని, ఈ గ్రూపు క్రియేట్ చేసి సిద్ధిపేట సేంద్రీయ ఉత్పత్తుల పరిశ్రమల విషయం పై ఓ బ్రాండింగ్ ఉంటుందని చెప్పారు. కొంత మంది దాతల సహకారంతో సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు తప్పకుండా సాయం అందిస్తామని, ఇదొక నిరంతర ప్రక్రియగా కొనసాగుతూ ఉంటుందని., మిగతా గ్రామాలు రైతులు కూడా ముందుకు వచ్చి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు ప్రజల ఆరోగ్య రక్షణలో భాగస్వాములు అయ్యేలా సేంద్రీయ వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని కోరారు. ఈ సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులను అమ్మడానికి రైతుబజారులో ఒక స్టాల్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

మీ అందరికీ ఆ భగవంతుడు మంచి పాడి పంటలు, మంచి ఆరోగ్యం కలిగి ఉండేలా అందరికీ మంచి జరగాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈ మేరకు మొత్తం 273, ఆవులకు గాను ఇవాళ 202 ఆవులను పంపిణీ చేస్తున్నామని, పశువులు దూర ప్రయాణం చేశాయని., కాబట్టి రైతులు ఆవులను జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లాలని., ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా రైతులకు పంపిణీ చేస్తున్నామని లక్కీ డ్రా టోకెన్ సిస్టం ద్వారా లబ్దిదారులకు టోకెన్లను అందజేశారు. పశువుల సంతలో పాడి ఆవులకు ప్రత్యేక పూజలు జరిపి లభ్దిదారులకు అందజేశారు.

More Press News