పరిశుభ్ర పురపాలికలే లక్ష్యంగా పట్టణ పారిశుద్ధ్య ప్రణాళికలు: మంత్రి కేటీఆర్

•జిల్లా కలెక్టర్లతో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమావేశం

•పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాలతో ప్రత్యేక ప్లాన్

•వారం రోజుల్లో ప్లాన్ తయారు చేసి పురపాలక శాఖకు సమర్పించాలి

•స్వచ్ఛ్ సర్వేక్షణ్ మార్గదర్శకాల మేరకు పారిశుద్ధ్య సిబ్బంది, వాహనాలు సమకూర్చుకోవాలి

•పంచాయితీ సిబ్బందికి ప్రభుత్వం కల్పిస్తున్న భీమా మాదిరే పురపాలక సిబ్బందికి ప్రభుత్వ భీమా సౌకర్యం

•ప్రతి పట్టణంలో డంప్ యార్డ్ లు, డ్రైరిసోర్స్ కలెక్షన్ సెంటర్ల, మానవ వ్యర్ధాల నిర్వహాణ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాలి

•ఇంటింటి నుంచి తడి-పొడి చెత్త సేకరణపైన ప్రత్యేక దృష్టి చేపట్టాలి

•డంప్ యార్డులు లేని చోట్ల భూసేకరణకు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశం

•పట్టణాల్లో జనాభా అవసరాల మేరకు పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం చేపట్టాలి

•నగరాల్లో మరిన్నిషీ-టాయిలెట్లను నిర్మించాలి 

•ప్రతి మున్సిపాలీటీకి గ్రీన్ ప్లాన్ కూడా ఉండాలి. ఇందులో భాగంగా నర్సరీతోపాటు, ఒక గ్రీన్ లంగ్  స్పేస్ (పార్క్) ఏర్పాటు చేయాలి

•పట్టణ తాగునీటి వనరుల ఆడిట్ చేసుకోవాలన్న మంత్రి


తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాలను పరిశుభ్రంగా మార్చే లక్ష్యంతో ప్రణాళికలు ప్రారంభించుతున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. మొన్నటిదాకా జరిగిన 30 రోజుల గ్రామ పంచాయితీ ప్రణాళిక ద్వారా మంచి ఫలితాలు వచ్చాయని, ఈ కార్యక్రమ స్పూర్తితో పట్టణాల్లో ఇదే మాదిరి కార్యక్రమాన్ని త్వరలో చేపట్టనున్నట్లు తెలిపారు. ఈరోజు సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో మంత్రి విడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ పారిశుద్ద్యంపైన ప్రతి పురపాలిక, పట్టణ పారిశుద్ద్య ప్రణాళిక (సిటి శానిటేషన్ ప్లాన్) తయారు చేయాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమీషనర్లకు ఆదేశాలు జారీ చేశారు.

చెత్త సేకరణ నుంచి రిసైక్లింగ్ వరకు అన్ని వివరాలను ఈ ప్రణాళికలో ఉంచాలన్నారు. స్వచ్చ సర్వేక్షన్ మార్గదర్శకాల మేరకు పురపాలికల్లో ఉండాల్సిన పారిశుద్ద్య కార్మికుల సంఖ్య, వాహనాల సంఖ్య ఉండేలా చూడాలన్నారు. ఇంటింటి (డోర్ టూ డోర్) నుంచి తడి-పొడి చెత్త సేకరణ పైన ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇప్పటికే పాత మున్సిపాలీటీల్లో స్వచ్చ్ ఆటోలు ఇచ్చామని, ఇంకా అవసరం ఉంటే వాహనాలను, సిబ్బందిని పెంచుకోవచ్చని మంత్రి తెలిపారు. ప్రతి పారిశుద్ధ్య కార్మికునికి యూనిఫాంతోపాటు అవసరం అయిన రక్షణ సామాగ్రిని సమకూర్చాలన్నారు. ప్రతి కార్మికునికి పియఫ్, ఈయస్ ఐ వంటి సౌకర్యాలను కల్పించేలా ఆయా ఎజెన్సీలను ఆదేశించాలన్నారు. పంచాయితీ సిబ్బందికి ప్రభుత్వం కల్పిస్తున్న భీమా మాదిరే పురపాలక సిబ్బందికి ప్రభుత్వం భీమా సౌకర్యాన్ని కల్పిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.

ప్రతి పట్టణానికి ఒక డంప్ యార్డ్ ఉండాలని, డంప్ యార్డ్ లేని చోట దానికోసం స్ధల సేకరణలు కలెక్టర్లు వేంటనే చర్యలు తీసుకోవాలన్నారు. డ్రైరిసోర్స్ కలెక్షన్ సెంటర్ (డిఆర్ సిసి) ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి పట్టణం ఇప్పటికే అన్ని పురపాలికలు ఒపెన్ ఢిపెకెషన్ ప్రీ (ఒడియప్) సాధించాయని, కొత్తగా మున్సిపాలిటీలుగా మారిన వాటిల్లోనూ ఒడియఫ్ సాధించేలా చూడాలన్నారు. ప్రతి పట్టణంలో ఉన్న పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహాణపైన దృష్టి సారించాలని, అవసరం అయిన చోట్ల మరిన్ని నిర్మాణం చేయాలన్నారు.

దీంతోపాటు ప్రతి నగరంలో మహిళల కోసం ప్రత్యేక షీ-టాయిలెట్స్ నిర్మాణం చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని పెట్రోల్ బంకులు, రెస్టారెంట్లలోని టాయిలెట్స్ ని ప్రజలు ఉపయోగించుకునేందుకు అవకాశం ఇవ్వాలని, ఈమేరకు వాటి యజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. దీంతోపాటు అందుబాటులో ఉన్న టాయిలెట్స్ సైన్ బోర్డులను సైతం ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతం వరంగల్, సిరిసిల్లలో మాదిరి ప్రతి పట్టణంలో మానవ వ్యర్ధాల ట్రీట్ మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసుకునే లక్ష్యంతో పనిచేయాలన్నారు. ప్రతి పట్టణానికి సంబంధించిన సమగ్రమైన సిటి శానిటేషన్ ప్లాన్ తయారు చేసి, వారం రోజుల్లో డైరెక్టర్ మున్సిపల్ అడ్మిష్ట్రేషన్ కు (సిడియంఏ) సమర్పించాలన్నారు.

నూతన పురపాలక చట్టాన్ని అమలు చేయడంలో కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు. ఈ చట్టంలో పేర్కొన్నట్లుగా గ్రీన్ యాక్షన్ ప్లాన్ తయారు చేయాలన్నారు. పట్టణాల్లో పచ్చదనాన్ని పెంచేందుకు పురపాలిక బడ్జెట్ లో 10శాతం ఈ గ్రీన్ బడ్జెట్ కు కేటాయించాల్సి ఉంటుందన్నారు. దీంతోపాటు ప్రతి పట్టణంలో నర్సరీ ఏర్పాటు చేసుకోవాలన్నారు. పట్టణంలో లేదా పట్టణాలకు దగ్గరలో గ్రీన్ లంగ్ స్పేస్ (పెద్ద పార్కులను) ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించాలన్నారు. పట్టణాల్లో ఉన్న తాగునీటి వనరుల మధింపు (ఆడిట్) చేయాలన్నారు.

ఈ సమావేశంలో పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, సిడియంఏ శ్రీదేవి, వాటర్ వర్క్స్ మేనేజింగ్ డైరెక్టర్ దానకిశోర్ పాల్గొన్నారు.


More Press News