మనిషి ప్రాణాలను కాపాడే అవయవ, రక్త దానం: మంత్రి ఆర్ కె రోజా

నేటి యువతలో సమాజానికి సేవ చేయాలనే అకాంక్ష ఉందని తదనుగుణమైన వేదికల అవశ్యకత ఉందని  రాష్ట్ర పర్యాటక, భాషా సాంస్కృతిక, యువజనాభ్యుదయ శాఖ మంత్రి ఆర్ కె రోజా అన్నారు. దేశ భవిష్యత్తు నేటి యువత మీదే ఆధారపడి ఉందన్నారు. విజయవాడలోని కే.బి.ఎన్ కళాశాలలో రాష్ట్ర యువజన సేవల శాఖ నేతృత్వంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని బుధవారం మంత్రి రోజా ప్రారంభించారు.  ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ మనిషి ప్రాణాలను కాపాడే రక్తాన్ని దానం చేస్తున్న విద్యార్థులు మానవతా వాదులన్నారు. ఒకరు ఇచ్చే రక్తం మరొకరికి ప్రాణాన్ని నిలుపుతుందని రక్తదానంతో పాటు నేత్ర, అవయువదానం పై కూడా అవగాహనా కలిగి ఉండాలన్నారు. కరోనా సమయంలో రక్తదాన శిబిరాలు నిర్వహించలేకపోయామని అందువల్ల రక్త నిల్వలు తగ్గి పోయాయని, ఆరోగ్యవంతంగా ఉన్న ప్రతీ ఒక్కరూ రక్తాన్ని దానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.  రక్తదాన శిబిరంలో 500 మంది విద్యార్థులు రక్తాన్ని దానం చేయటం శుభపరిణామమన్నారు. ప్రతి విద్యార్థి సమాజం పట్ల శ్రద్ద బాధ్యతతో మెలగాలని చదువుతో పాటు సమాజ సేవలో విద్యార్థులు చురుకుగా పాల్గొనాలని సూచించారు. రాష్ట్రంలో యువజన సేవల శాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది 48 రక్త దాన శిబిరాలను నిర్వహించి 2,395 యూనిట్ల రక్తాన్ని దాతల నుండి సేకరించామన్నారు.
 
 యువత అభిరుచులకు అనుగుణంగా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు మంచి కార్యక్రమాలను రూపొందించి అన్ని రంగాల్లోనూ యువత అభివృద్ధి చెందేలా కార్యాచరణ అమలు చేస్తున్నారన్నారు.  నేటి యువతకు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి యూత్ ఐకాన్ అని మంత్రి రోజా అన్నారు.  యువజన సేవల శాఖ 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువత సాధికారిత కోసం కృషి చేస్తుందన్నారు. యువత సర్వతో ముఖాభివృద్దికి, వారి శక్తి సామర్ధ్యాలను దేశ పునంనిర్మాణం వైపు నడిపించడానికి అనేక యువజన సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు యువతలో వ్యక్తిత్వ వికాసం. భావ వ్యక్తీకరణ, వృత్తి నైపుణ్యం పై శిక్షణ అందించి వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందన్నారు.  యువతలో వృత్తి పరమైన నైపుణ్యాన్ని పెంపొందించుటకు ఆంధ్ర ప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతీ గ్రామంలోను ఒక యువజన సంఘాన్ని ఏర్పాటు చేసి యువతకు సామజిక సేవపట్ల ఆసక్తి కల్పించేలా చర్యలు చేపట్టామన్నారు.  మాదక ద్రవ్యాల వల్ల చెడు పరిణామాలు, ఈవ్ టీజింగ్, సైబర్ క్రైం, దిశా చట్టం పై అవగాహనా కల్పించడం ద్వారా యువతను ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దుతున్నామన్నారు. యువతకు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ పోటీలను నిర్వహించి వారిని ప్రోత్సహిస్తున్నామని మంత్రి ఆర్.కె. రోజా అన్నారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు మాట్లాడుతూ కే.బి.ఎన్ కాలేజీ విద్యార్థులు సేవ కార్యక్రమాలలో ముందంజలో ఉంటారని, యువత సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు.
 
రాష్ట్ర ప్రభుత్వ క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి వాణి మోహన్ మాట్లాడుతూ యువతను చైతన్య పరుచటం ద్వారా సమాజ సేవలో వారిని భాగస్వాములను చేస్తున్నామన్నారు.  యువత శక్తి సామర్ధ్యాలను దేశ, రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడేలా యువజన సర్వీసుల శాఖ అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. యువజన సేవల శాఖ సంచాలకురాలు చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుండే నేటి విద్యార్థులు సేవా కార్యక్రమాలలో పాల్గొనేలా అవసరమైన తోడ్పాటును అందిస్తున్నామన్నారు. ఈ రక్తదాన శిబిరంలో కెబిఎన్తో పాటు గుంటూరు జెకెసి, హిందూ ఫార్మసీ కాలేజ్, పాలిటెక్నిక్ కళాశాల, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, ధనేకుల ఇంజినీరింగ్ కాలేజ్, విఆర్ సిద్దార్ధ ఇంజినీరింగ్ కాలేజ్, ఎస్.ఆర్.కె. ఇంజినీరింగ్ కాలేజ్, ఈఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజ్ లకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, రాష్ట్ర సాంస్కృతిక అకాడమీ చైర్ పర్సన్ శ్రీ లక్ష్మి, రాష్ట్ర దృశ్య కళల అకాడమీ చైర్ పర్సన్ సత్య శైలజ, సాంస్కృతిక శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామ కృష్ణ, కే.బి.ఎన్ కళాశాల ప్రిన్సిపాల్ నారాయణరావు, కరస్పాండెంట్ శ్రీనివాసరావు, నగరంలోని కార్పొరేటర్ లు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

More Press News