ఆధునిక హంగులతో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆప్కో షోరూమ్ ప్రారంభం

ఆధునిక హంగులతో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆప్కో షోరూమ్ ప్రారంభం
  • చేనేత బకాయిల విడుదలకు ప్రభుత్వం సన్నద్ధం 
  • గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆప్కో షోరూమ్ ప్రారంభించిన గుడివాడ
  • ఆధునిక అవసరాలకు అనుగుణంగా చేనేత వస్త్రాల రూపకల్పన: ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి
అమరావతి: చేనేత కార్మికులకు రానున్నది స్వర్ణయుగమేనని పరిశ్రమలు, చేనేత, జౌళి శాఖ మంత్రి గుడివాడ అమర్ నాధ్ అన్నారు. ప్రభుత్వం రానున్న రోజుల్లో చేనేత సంఘాలకు, కార్మికులకు ఉన్న అన్నిరకాల బకాయిలను విడుదల చేయాలని నిర్ణయించిందని స్పష్టం చేశారు. విజయవాడ (గన్నవరం) అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆప్కో షోరూమ్ ను మంత్రి అమర్ నాధ్ బుధవారం ప్రారంభించారు. 

ఈ సందర్భంగా గుడివాడ మాట్లాడుతూ నేత కార్మికుల కోసం ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తుందని, వారి అవసరం కోసం మరిన్ని పధకాలు తీసుకువచ్చేందుకు సైతం వెనకాడవద్దని ముఖ్యమంత్రి ఆదేశించారని పేర్కొన్నారు. ఆప్కోకు పూర్వవైభవం తీసుకువచ్చే క్రమంలో నూతన వెరైటీలు, డిజైన్లు అందుబాటులో ఉంచటం అనుసరణీయమన్నారు. ముఖ్యమంత్రి మానస పుత్రికగా ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తున్న నేతన్న నేస్తం పథకం ఇతర రాష్ట్రాలకు సైతం మార్గదర్శకంగా ఉందన్నారు.

ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి మోహన రావు మాట్లాడుతూ చేనేత వస్త్రాలను ప్రజలలోకి మరింతగా తీసుకువెళ్లే క్రమంలో నూతన షోరూమ్ ల ఏర్పాటుకు నాంది పలికామన్నారు. ఇటీవల గుంటూరు, ఒంగోలు, కడపలలో షోరూమ్ ప్రారంభించామని, విజయవాడ పిన్నమనేని పాలీ క్లీనిక్ రోడ్డులో కూడా నూతనంగా మెగా షోరూం రానుందని వివరించారు. చేనేత జౌళి శాఖ సంచాలకురాలు, ఆప్కో ఎండి చదలవాడ నాగరాణి మాట్లాడుతూ విక్రయ కేంద్రాల విస్తరణలో భాగంగా తెలంగాణాలో కూడా నూతన షోరూంల ఏర్పాటు చేస్తున్నామన్నారు. తిరుపతి విమానాశ్రయంతో పాటు శ్రీ వెంకటేశ్వరుని సన్నిధి తిరుమలలో కూడా షోరూమ్ లు సిద్దం అవుతున్నాయన్నారు. వినియోగదారుల ఆదరణ మేరకు అన్ని రకాల వస్త్రాలు ఆప్కో షోరూమ్ లలో లభించేలా ప్రణాళికాబద్దంగా వ్యవహరిస్తున్నామన్నారు.  కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ సంయుక్త సంచాలకులు కన్నబాబు, ఆప్కో మార్కెటింగ్ మేనేజర్ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

More Press News