తెలంగాణలో జాతీయ భద్రతా కళాశాల ప్రతినిధి బృందం పర్యటన

  • తెలంగాణలో పర్యటిస్తున్న జాతీయ భద్రతా కళాశాల (నేషనల్ డిఫెన్స్ కాలేజ్- ఢిల్లీ) ప్రతినిధి బృందం
  • క్షేత్ర పర్యటనలో భాగంగా హరితహారంపై అధ్యయనం, అర్బన్ ఫారెస్ట్ పార్కుల సందర్శన
హైదరాబాద్: క్షేత్ర పర్యటనలో భాగంగా 15 మందితో కూడిన జాతీయ భద్రతా కళాశాల (నేషనల్ ఢిఫెన్స్ కాలేజీ ఢిల్లీ)బృందం తెలంగాణలో పర్యటిస్తోంది. ఎయిర్ వైస్ మార్షల్ తేజ్ బీర్ సింగ్ నేతృత్వంలోని ఈ బృందంలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కు చెందిన అధికారులు ఉన్నారు. ఇండోనేషియా, ఫిలిఫ్పైన్స్, బర్మాకు చెందిన సైనిక అధికారులు కూడా సభ్యులుగా ఉన్నారు.

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నఅభివృద్ధి, సంక్షేమ పథకాలను వీరు అధ్యయనం చేస్తున్నారు. చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ తో సమావేశమైన ఈ టీమ్ ఆయన సూచనల మేరకు మొదటగా తెలంగాణకు హరితహారం, అర్బన్ ఫారెస్ట్ పార్కులపై అధ్యయనం చేశారు.

మేడ్చల్ జిల్లా కండ్లకోయ అర్బన్ ఫారెస్ట్ పార్కును సందర్శించారు. పెరిగిన పట్టణ ప్రజల అవసరాలకు తగినట్లుగా, పర్యవరణ హితంగా తీర్చిదిద్దిన ఆక్సీజన్ పార్కును చూసిన కేంద్రం బృందం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. పార్కులో వాకింగ్ ట్రాక్, యాదాద్రి మోడల్ ప్లాంటేషన్ (మియావాకి విధానం), బట్లర్ ఫ్లై పార్కు, ఔషధ మొక్కల గార్డెన్, వాకింగ్ ఎవియరీ, ఓపెన్ క్లాస్ రూమ్, పిల్లల ఆటస్థలం, ఇతర సౌకర్యాలను సభ్యులు ఆసక్తిగా గమనించారు.

తెలంగాణకు హరితహారం ద్వారా అమలుచేస్తున్న జంగల్ బచావో జంగల్ బడావో కార్యక్రమాలను జాతీయ బృందానికి పీసీసీఎఫ్ ఆర్.ఎమ్ డోబ్రియల్ వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం ద్వారా చేపట్టిన పనులు, పురోగతిపై ప్రజెంటేషన్ ఇచ్చారు. అటవీ పునరుద్ధరణ ద్వారా సాధించిన ఫలితాలను వీడియా దృశ్యాల ద్వారా ప్రదర్శించారు.

భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణాన్ని అందించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని జాతీయ భద్రతా కళాశాల బృందం అభినందించింది. హరితహారం చాలా మంచి కార్యక్రమం అని, అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్ది చాలా బాగుందని ఎయిర్ వైస్ మార్షల్ తేజ్ బీర్ సింగ్ అన్నారు. హరిత సంకల్పంతో స్ఫూర్తి మంతంగా పనిచేస్తున్న అటవీ శాఖను, అధికారులను, సిబ్బందిని ఎయిర్ కమెరోడ్ అమిత్ గురుభక్సానీ అభినందించారు.

గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న హైదరాబాద్ కు పర్యావరణ అవసరాలను తీర్చే విధంగా అటవీ శాఖ కృషి చేయటం అభినందనీయం అని బృందంలోని సభ్యులు అభిప్రాయపడ్డారు.

కార్యక్రమంలో హైదరాబాద్ చీఫ్ కన్జర్వేటర్ ఎం.జె అక్బర్, మేడ్చల్ జిల్లా అటవీ అధికారి వెంకటేశ్వర్లు, డీఎఫ్ఓ అశోక్, రేంజ్ ఆఫీసర్ శ్రీదేవి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

More Press News