తెలంగాణ విజయ డెయిరీ ఐస్ క్రీమ్ పార్లర్ ను ప్రారంభించిన మంత్రి తలసాని

రంగారెడ్డి: సోమవారం మాదాపూర్ లోని దుర్గం చెరువు మెట్రో స్టేషన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ విజయ డెయిరీ ఐస్ క్రీమ్ పార్లర్ ను రాష్ట్ర  పశు సంవర్ధక, మత్స, పాడి పరిశ్రమ అభివృద్ధి మరియు సినిమాటోగ్రఫీ శాఖ మాత్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఐస్ క్రిముకు మంచి డిమాండ్ ఉన్నందున  తెలంగాణ విజయా డైయిరీ తెలంగాణ బ్రాండుతో  ఐస్ క్రిములను మార్కెట్ లోకి విడుదల చేయడం జరిగిందని తెలిపారు. 8 రకాల ఐస్ క్రిములు వెనిలా, స్ట్రా బెర్రీ, బ్యూటర్ స్కాచ్, చాక్లెట్, బెల్జియం చాక్లెట్, మ్యాంగో, క్యారమిల్ నెట్స్, కేసరి బాదాం మరియు ఫ్రెంచ్ వెనిలా రకాలలో మార్కెట్లో విడుదల చేయడం జరిగిందని తెలిపారు.

తెలంగాణ విజయ డెయిరీకి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు నష్టాలలో ఉన్న విజయ డెయిరీ సంస్థ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేక చొరవతో 700 కోట్ల రూపాయల టర్నోవర్ కు సంస్థ చేరుకుందని చెప్పారు. విజయ డెయిరీ నుండి ప్రస్తుతం చేస్తున్న పాలు, పాల ఉత్పత్తులకు అదనంగా నాణ్యమైన నూతన ఉత్పత్తులను మార్కెట్ లోకి తీసుకొచ్చే లక్ష్యంతో రంగారెడ్డి జిల్లా రావిర్యాల్ గ్రామ పరిధిలో 40 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక టెక్నాలజీతో రూ.246 కోట్ల వ్యయంతో మెగా డెయిరీని నిర్మించడం జరుగుతుందని వివరించారు. విజయ డెయిరీకి పాలు పోసే పాడి రైతులను ప్రోత్సహించాలనే ఆలోచనతో లీటర్ పాలకు 4 రూపాయల ప్రోత్సాహకంను అందజేసే కార్యక్రమాన్ని నవంబర్ 2014 సంవత్సరంలో ప్రారంభించినట్లు, ఆ తర్వాత ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇతర సహకార డెయిరీలైన నార్మూల్ డెయిరీ, కరీంనగర్ డెయిరీ మరియు ముల్కనూరు మహిళ డెయిరీలలో పాల సేకరణ చేయుచున్న పాడి రైతులకు కూడా నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తున్నట్లు చెప్పారు.

ఇప్పటి వరకు రూ.343 కోట్లను ఈ పథకం క్రింద పాల ఉత్పత్తిదారులకు అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. సహకారం రంగంలో నిర్వహిస్తున్న విజయ డెయిరీ సంస్థకు వచ్చే లాభాలను వివిధ సంక్షేమ కార్యక్రమాలతో తిరిగి పాడి రైతులకే అందజేస్తున్నట్లు వివరించారు. అందులో భాగంగా పాడి పశువుల కొనుగోలుకు, విజయ పెళ్ళికానుక ఆర్ధిక సహాయం, దురదృష్టవశాత్తు పాడి రైతు మరణం సంభవిస్తే అంతిమ సంస్కార ఖర్చుల కోసం ఆర్ధిక సహాయం అందజేస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు సాధించిన, ఐఐటీ, జేఈఈ లో సీటు సాధించిన విద్యార్ధులకు నగదు బహుమతి, పాటు ప్రశంసా పత్రము అందిస్తున్నట్లు తెలిపారు. ఎక్కువ పాలు పోసే పాడి రైతుకు నగదు బహుమతితో పాటు ప్రశంసాపత్రాన్ని అందించడం ద్వారా పాడి రైతులు పాల ఉత్పత్తిని మరింత పెంచే విధంగా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.

1500 లీటర్లు అంతకన్నా ఎక్కువ పాలు పోసే పాడి రైతులకు గడ్డి కత్తిరించే యంత్రాలు, పాల క్యానులు, విద్యుత్ సబ్సిడీ, సబ్సిడీ ద్వారా దాణా, మినరల్ మిక్చర్ మరియు ఇన్సూరెన్స్ సబ్సిడీ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. పాడి ద్వారా ఆర్ధికాభివృద్ధి సాధించేందుకు సన్న చిన్న కారు రైతులకు మహిళా పాల ఉత్పత్తిదారుల పాడి పశువుల కొనుగోలు కోసం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, శ్రీనిధి బ్యాంకు ద్వారా, నాబార్డ్ ద్వారా ప్రాథమిక సహకార సంఘాల పరిధిలో విజయ పాడి రైతులకు ఋణాలు అందజేస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ యాదవ్ వివరించారు. పాల ఉత్పత్తి సామర్ధ్యం పెంపుకోసం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

అందులో భాగంగా వ్యాక్సినేషన్, నట్టల నివారణ మందుల పంపిణీ, సబ్సిడీపై గడ్డి విత్తనాల సరఫరా, మారుమూల ప్రాంతాల్లోని పశువులకు 1966 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పాడి రంగంపై ఆధారపడిన ప్రతి ఒక్కరు ఆర్ధిక స్వావలంభన సాధించేలా సహకారం అందిస్తున్నట్లు మంత్రి వివరించారు. పాడి రైతులకు అనేక విధాలుగా చేయూతను అందిస్తున్న విజయ డెయిరీకి పాలు పోయడం ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని లబ్దిపొందాలని పాడి రైతులను మంత్రి కోరారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణి దేవి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అధర్ సిన్హా, డైరెక్టర్ రాంచందర్, కార్పొరేటరులు అమిత్ పటేల్, జగదీశ్వర్ గౌడ్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

More Press News