ప్రణాళికా శాఖ దృష్టికి పెదపాలపర్రు సమస్య: కలెక్టర్ నివాస్
- రాష్ట్ర కమిటీ దృష్టికి పెదపాలపర్రు సమస్య
- గ్రామస్ధులకు హామీ ఇచ్చిన కలెక్టర్ నివాస్
పెదపాలపర్రు ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షుడు బొప్పన ప్రసాద్ కలెక్టర్ కు సమస్యను వివరిస్తూ ప్రస్తుతం ఐదు కిలోమీటర్ల దూరంలో గుడివాడ రెవిన్యూ డివిజన్ కేంద్రం కలిగిన తాము, విభజన వల్ల ఏలూరు వెళ్లాలని తద్వారా 70 కిలోమీటర్ల దూరం ప్రయాణించవలసి వస్తుందన్నారు. మరోవైపు తమ గ్రామం చుట్టుపక్కల గుడివాడ రూరల్ మండలం ఉన్నప్పటికీ, తాము మాత్రం ముదినేపల్లి మండలంలో ఉండటం వల్ల ఏలూరు జిల్లాగా మారిపోవలసి వస్తుందన్నారు. తమ అన్ని అవసరాలు గుడివాడతో ముడిపడి ఉన్నాయని తమ గ్రామాన్ని గుడివాడ రూరల్ మండలంలో కలిపి, కృష్ణా జిల్లాలోనే కొనసాగించేలా చూడాలని విన్నవించారు.
గ్రామస్ధుడు చిలుకూరి ఫణి కుమార్ మాట్లాడుతూ భవిష్యత్తులో జోన్ల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని, తల్లి దండ్రులు ఏలూరు జిల్లాలో, విద్యార్దులు కృష్ణా జిల్లాలో ఉంటారని పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో కలెక్టర్ మాట్లాడుతూ పెదపాలపర్రు గ్రామాన్ని గుడివాడ రూరల్ పరిధిలో విలీనం చేసే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు. తుదినిర్ణయం రాష్ట్ర స్ధాయిలోనే జరుగుతుందని స్పష్టం చేశారు. కలెక్టర్ ను కలిసిన వారిలో కెడిసిసి బ్యాంకు మాజీ జిఎం కొరిపల్లి కృష్ణ ప్రసాద్, చళ్లగుళ్ల శ్రీకాంత్, సంకురాత్రి మాధవరావు తదితరులు ఉన్నారు.