2023 మార్చిలోగా ఆరాంఘర్-జూపార్క్ ఆరు లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి: తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్

  • బహదూర్ పుర, ఆరాంఘర్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను ఆకస్మికంగా తనికీ చేసిన సీఎస్ సోమేశ్ కుమార్
హైదరాబాద్, జనవరి 19: వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్.ఆర్.డి.పి)లో భాగంగా చేపట్టిన బహదూర్ పుర ఫ్లైఓవర్, ఆరాంఘర్ నుండి జూపార్క్ వరకు చేపట్టిన 4.08 కిలోమీటర్ల అతిపెద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులను వేగవంతం చేసి, లక్ష్యాని కన్నా ముందుగానే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. బహదూర్ పుర జంక్షన్ లో చేపట్టిన పలు నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేడు ఆకస్మికంగా తనికీ చేశారు.

జీహెచ్ఎంసీ కమీషనర్ డిఎస్ లోకేష్ కుమార్, ఈ.ఎన్.సి జియాఉద్దీన్, ప్రాజెక్టు సిఇ దేవానంద్ హాజరైన ఈ పరిశీలన సందర్బంగా, సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. రూ. 69 కోట్ల వ్యయంతో చేపట్టిన 690 మీటర్ల పొడవుగల ఫ్లైఓవర్ నిర్మాణ పనులు మార్చ్ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అదే విధంగా, హైదరాబాద్ ఓల్డ్ సిటీ వాసులకు, ముఖ్యంగా జూ పార్క్ సందర్శకులకు ఎంతగానో ఉపయోగపడే ఆరాంఘర్ నుండి జూ పార్క్ వరకు నిర్మిస్తున్న అతిపొడవైన ఫ్లై ఓవర్ పనులను కూడా నియమిత లక్ష్యానికన్నా ముందుగానే పూర్తి చేయాలన్నారు.

ఈ ఆరాంఘర్ - జూ పార్క్ ఫ్లై ఓవర్ నిర్మాణానికి సేకరించాల్సిన మొత్తం 163 ఆస్తులలో మరికొన్ని ఆస్తుల సేకరించాల్సి ఉన్నందున ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం పనులకు అంతరాయం కలుగుతోందని ఇంజనీర్లు వివరించగా, ఫ్లైఓవర్ మౌలిక డిజైనింగ్ కు అంతరాయం కాకుండా కొన్ని ఆస్తుల సేకరణ చేయకుండానే నిర్మాణాన్ని పూర్తి చేయాలని సీఎస్ సూచించారు. ఆరాంఘర్- జూపార్క్ ఆరులేన్ల ఫ్లైఓవర్ నిర్మాణం పనులు ఏవిధమైన అవాంతరాలు లేకుండా జరిగేందుకు విధ్యుత్ పంపిణి సంస్థ, అర్బన్ బయోడైవర్సిటీ, జలమండలి తదితర విభాగాలతో సమన్వయంతో పని చేయాలని సోమేశ్ కుమార్ ఆదేశించారు. ఈ పర్యటనలో చార్మినార్ జోనల్ కమీషనర్ అశోక్ సామ్రాట్, ఎస్.ఈ. దత్తు పంత్ తదితర అధికారులు పాల్గొన్నారు.

More Press News