గ్లకోమా గురించి విశ్లేషణాత్మకంగా తెలుసుకుందాం: డాక్టర్ బి. ప్రణతి
- డాక్టర్ బి. ప్రణతి Sr. Consultant & Head of Department of Ophthalmology
- Cataract, Glaucoma & Refractive Surgeon కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్
గ్లకోమా అంటే ఏంటి?
దీర్ఘకాలికంగా కంటిలో ఒత్తిడి పెరిగి దృష్టి నాడి దెబ్బతిని క్రమంగా కంటిచూపు క్షిణిస్తుంది. ఇలాంటి లక్షణాలు ఉంటే గ్లకోమా వ్యాధి అని అంటారు.
మన దేశంలో గ్లకోమా తీవ్రత:
భారతదేశంలో ఒక కోటి పన్నెండు లక్షలమంది ప్రజలు గ్లకోమా బారినపడగా, అందులో పన్నెండు లక్షలమంది పూర్తిగా చూపుకోల్పోయారు. మన దేశంలో సుమారు 90 శాతం కేసులు ఇంకా నమోదు చేయబడలేదు అని ఓ అంచన.
ఎవరు పరీక్ష చేయించుకోవాలి?
- 40 ఏళ్లు పైబడినవారు.
- అధిక మయోపియా మరియు అధిక హైపర్‌మెట్రోపియా ఉన్న వ్యక్తులు.
- మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు.
- కుటుంబంలో ఎవరికైనా గ్లకోమా ఉన్నా.. పూర్వం కంటికి దెబ్బలు తగిలినవారు.
- దీర్ఘ కాలంగా స్టెరాయిడ్స్ (steroids) మాత్రలు మరియు కంటి చుక్కల మందు వాడేవారు.
గ్లకోమా లక్షణాలు:
- చాల సమయాల్లో చూపు కోల్పోయేవరకు ఏ లక్షణాలు కనిపించవు. అందుకే ఈ వ్యాధిని అదృశ్య శత్రువు” అంటారు.
- ఒక కంటికి లేదా రెండు కళ్ళకి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటాయి.
- మీ పరిధీయ దృష్టి నష్టం ( పక్క చూపు తగ్గడం) క్రమంగా మొదలై, కొన్ని సంవత్సరాల్లో పూర్తి చూపు కోల్పోయే ప్రమాదం ఉంది.
- కంటిలో లేదా కంటి చుట్టూ నొప్పి రావచ్చు.
- హఠాత్తుగా కన్ను ఎర్రబడడంతో పాటు తలనొప్పి, కన్ను నొప్పి ఉంటుంది.
గ్లకోమా అని ఎలా నిర్ధారిస్తారు?
- పైన చెప్పబడిన లక్షణాలు మీకు ఉంటే వెంటనే, సమీపంలో ఉన్న కంటి వైద్యులని సంప్రదించండి.
- క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలి. ఈ పరీక్షల్లో మీ కంటి చూపు, కంటిలోని ఒత్తిడి, దృష్టి నాడి యొక్క స్థితి పరీక్షిస్తారు.
- కంటి వైద్యునికి మీకు గ్లకోమా ఉన్నట్టు అనిపిస్తే నిర్ధారిత పరీక్షలు కొన్ని ఉదాహరణకి ఓసిటీ (OCT), దృష్టి క్షేత్ర పరీక్షా (visual field examination) చేయిస్తారు. వీటి ద్వారా ఏరకమైన గ్లకోమా ఉందో నిర్ధారించి, చికిత్స విధానం నిర్ణయిస్తారు.
గ్లకోమా చికిత్స:
- గ్లకోమా వ్యాధికి మొదట చుక్కల మందులు, లేజర్ వంటివి చేసి కంటిలోని ఒత్తిడిని తగ్గించడానికి లేదా నియంత్రించడానికి ప్రయత్నిస్తారు. లేసర్ లేదా చుక్కల మందులతో ఒత్తిడి తగ్గకపోతే శస్త్ర చికిత్స చేయాల్సివస్తుంది.
- చికిత్స మొదలుపెట్టిన తరువాత ఏడాదికి ఒకసారి తప్పక కంటి పరీక్ష, కంటిలోని ఒత్తిడి పరీక్ష, దృష్టి క్షేత్ర పరీక్ష చేయించుకోవాలి.
- చాలా మంది ఈ వ్యాధి గురించి సరైన అవగాహన లేకపోవడం వలన తమ చూపు కోల్పోతున్నారు.
- నేడే గ్లకోమా గురించి తెలుసుకోండి. ముందుచూపుతో వ్యవహరించండి. అంధత్వాన్ని నివారించుకోండి.