ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ సమావేశం!

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని అన్ని ప్రాంతాలకు సాగునీరు, అన్ని గ్రామాలకు తాగునీరు అందించే సమగ్ర ప్రణాళిక రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. నిజాం సాగర్, సింగూరులో నీటి లభ్యత తక్కువగా ఉన్నందు వల్ల, ఆ ప్రాజెక్టుల పరిధిలోని గ్రామాలకు ఈ ఏడాది మంచినీరు అందించడానికి ప్రత్యామ్నాయ, తాత్కాలిక ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. సాగునీరు, తాగునీరు, పోడు భూముల సమస్యను ప్రజలతో చర్చించి, శాశ్వతంగా పరిష్కరించేందుకు వచ్చే నెలలో రెండు రోజుల పాటు ఉమ్మడి నిజామాబాద్ లో పర్యటించనున్నట్లు సీఎం వెల్లడించారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి గురువారం అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ఛాంబర్ లో సమావేశమయ్యారు. మంత్రులు వేముల ప్రశాంత రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ విప్ గంప గోవర్థన్, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్థన్, ఎ.జీవన్ రెడ్డి, హనుమంతు షిండే, బిగాల గణేష్ గుప్తా, సురేందర్, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు, కార్యదర్శి స్మితా సభర్వాల్, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, నీటి పారుదల శాఖ ఇఎన్సీ మురళీధర్ రావు, ఎస్ఇలు శంకర్, సుధాకర్ రెడ్డి, ఆర్.డబ్ల్యు.ఎస్. ఇఎన్సీ కృపాకర్ తదితరులు పాల్గొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎస్సారెస్పీని లింక్ చేసినందు వల్ల భవిష్యత్తులో ఎస్సారెస్పీ ఆయకట్టుకు ఢోకా ఉండదని సీఎం అన్నారు. గుత్ప, అలీసాగర్ ల మాదిరిగానే లిఫ్టులు పెట్టి బాన్సువాడ, ఆర్మూరు, బాల్కొండ నియోజవర్గాలకు సాగునీరు అందివ్వాలని సీఎం చెప్పారు. దీనికోసం తక్షణం సర్వే జరిపి, లిఫ్టులు ఎక్కడ పెట్టి, ఏఏ గ్రామల పరిధిలో ఎన్ని ఎకరాలకు నీరందించవచ్చో తేల్చాలని నీటి పారుదల శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. ప్రతీ ఏటా 90 టిఎంసిలకు తక్కువ కాకుండా ఎస్సారెస్పీని నింపాలని ప్రభుత్వం నిర్ణయించినందున, దీని నుంచి ఎంత వీలయితే అంత ఆయకట్టుకు నీరివ్వాలని చెప్పారు.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో జలాశయాలు నిండి, సాగు, తాగునీరుకు ఢోకా లేని స్థితి నెలకొందని, కానీ సింగూరు, నిజాంసాగర్ లకు మాత్రం చాలినంత నీరు రాలేదన్నారు. దీంతో ఈ రెండు ప్రాజెక్టుల పరిధిలోని గ్రామాలకు ఈ సారి మంచినీరు అందించడానికి ప్రత్యామ్నాయ, తాత్కాలిక ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. హెచ్ఎండబ్ల్యుఎస్ నుంచి, పరిగి నుంచి, కోమటి బండ నుంచి, ఎస్ఆర్ఎస్పి నుంచి.. ఇలా ఎలా వీలయితే అలా వీలయినన్ని గ్రామాలకు నీరు అందించాలని, మిగతా చోట్ల ట్యాంకర్ల ద్వారా, బోర్ల ద్వారా నీరందించాలని చెప్పారు. ఈ ఒక్క ఏడాదే సింగూరు, నిజాంసాగర్ పరిధిలో ఈ సమస్య ఉంటుందని, వచ్చే ఏడాది నాటికి మల్లన్న సాగర్ ద్వారా ఈ రెండు ప్రాజెక్టులకు నీరందుతుందని చెప్పారు. ప్రజలు ఈ వేసవిలో ఇబ్బంది పడకుండా ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయాలని చెప్పారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కొన్ని చోట్ల పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు ఇబ్బందులున్నాయని, అటవీ - రెవెన్యూ శాఖ మధ్య కూడా వివాదాలున్నాయని సీఎం అన్నారు. వచ్చే నెలలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండు రోజులు పర్యటించి స్థానికులతో చర్చించి అటవీ సంబంధమైన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని సీఎం చెప్పారు. అదే సందర్భంలో సాగునీటి కోసం, మంచినీటి కోసం శాశ్వత ప్రాతిపదికన చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతామని సీఎం వెల్లడించారు.
 

More Press News