ప్రతీ అటవీ బ్లాకు ప్రాతిపదికన అటవీ పునరుద్ధరణ రాష్ట్రవ్యాప్తంగా జరగాలి: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

  • వంద శాతం అడవుల పునరుద్ధరణ ద్వారా రాష్ట్రం పర్యావరణ హితంగా మారుతుంది
  • అటవీ శాఖ సమీక్షా సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణలో ఉన్న అన్ని అటవీ ప్రాంతాలు, బ్లాకుల వారీగా వందశాతం పునరుద్ధరణ జరగాలనేది ప్రభుత్వ లక్ష్యమని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఇటీవల కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఇచ్చిన ఆదేశాలకు కొనసాగింపుగా ఇవాళ అరణ్య భవన్ లో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ప్రతీ అటవీ బ్లాకు ప్రాతిపదికగా అటవీ పునరుద్ధరణ కార్యాచరణ ప్రణాళిక (ఫారెస్ట్ రీజునవేషన్ యాక్షన్ ప్లాన్) జరగాలనేది సీఎం ఆకాంక్ష అని, ఆ మేరకు అటవీ శాఖ పనులను ముమ్మరం చేయాలని మంత్రి కోరారు. కంపా నిధుల వినియోగం, చేపట్టిన పనులు, ఫలితాలపై సమావేశంలో పీసీసీఎఫ్ (కంపా) లోకేష్ జైస్వాల్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. గత ఆరేళ్లుగా కేంద్రం నుంచి 1755 కోట్ల కంపా నిధులు (ప్రత్యామ్నాయ అటవీకరణ) విడుదల అయ్యాయని, ఇందులో 1497 కోట్ల పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. ఈయేడాది 750 కోట్ల నిధులతో పనులు లక్ష్యంగా పెట్టుకోగా, కేంద్రం నుంచి 459 కోట్ల పనులకు అనుమతి వచ్చిందని తెలిపారు.

అటవీ పునురుద్దరణ కోసం చేపట్టిన పనులు పారదర్శకంగా జరగాలని, పనుల నాణ్యతలో రాజీపడకుండా ఉండటంతో పాటు, ఆయా పనులు పూర్తి అయిన తర్వాత ఆడిట్ కూడా పకడ్బందీగా నిర్వహించాలని మంత్రి సూచించారు. ఎప్పటి కప్పుడు అప్ లోడ్ చేసిన కంపా పనుల వివరాలను వెబ్ సైట్ లో మంత్రి పరిశీలించారు. జంగల్ బచావో- జంగల్ బడావో నినాదం కింద అన్ని అటవీ ప్రాంతాల రక్షణకు కందకాల తవ్వకం, సహజ సిద్ధమైన బయో ఫెన్సింగ్ ఏర్పాటు, బ్లాక్ ప్లాంటేషన్, కలుపు మొక్కల నివారణ, బేస్ క్యాంపులు, వాచ్ టవర్లు ఏర్పాటు చేశామని, అన్ని మారుమూల అటవీ ప్రాంతాల్లో పర్యవేక్షణ కోసం సిబ్బంది వెళ్లేలా రోడ్లు వేస్తున్నామని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్. శోభ సమావేశంలో వెల్లడించారు.

ప్రభుత్వ ప్రాధామ్యాలకు అనుగుణంగా అన్ని జిల్లాల్లో కలెక్టర్ నేతృత్వంలో అటవీ పునరుద్ధరణ కార్యాచరణ ప్రణాళికలు సిద్దం అయ్యాయని, వాటి ప్రకారం పనులు జరిగేలా చూస్తామని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ. శాంతి కుమారి వెల్లడించారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో ఈ సమావేశాలు పూర్తి కావటంతో పాటు, నివేదికలు  తయారు అయ్యాయని తెలిపారు.

సమావేశంలో అటవీ శాఖ సంయుక్త కార్యదర్శి ప్రశాంతి, పీసీసీఎఫ్(సోషల్ ఫారెస్ట్రీ) ఆర్.ఎం.డోబ్రియల్, అదనపు పీసీసీఎఫ్ లు సిద్దానంద్ కుక్రేటీ, మోహన్ చంద్ర పర్గెయిన్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

More Press News