పథకాలే జనరంజకం.. పాలన జనవిరుద్ధం: జగన్ ప్రభుత్వ పాలనపై పవన్ కల్యాణ్

  • దశ దిశ లేని వైసీపీ వంద రోజుల పాలన
  • ఇసుకలో అధిక వసూళ్లు ఎటు పోతున్నాయి
  • పెట్టుబడి దారులను పంపించేస్తే నవరత్నాలకు సొమ్ములేవీ?
  • అమరావతి, పోలవరంలపై ఏమిటీ వైఖరి
  • పీపీఏలపై పంతం మానరా
  • వైసీపీ 100 రోజుల పాలనపై జనసేన నివేదిక విడుదల
  • పాత్రికేయుల సమావేశంలో జనసేన అధ్యక్షులు  పవన్ కల్యాణ్

“వైసీపీ మేనిఫెస్టోలో చెప్పిన నవరత్నాలు జనరంజకంగా ఉన్నాయి. పాలన మాత్రం జనవిరుద్ధంగా” ఉందని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు పేర్కొన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు చూసి వైసీపీ ప్రభుత్వంపై సంవత్సరం వరకు మాట్లాడే అవకాశం రాదనుకున్నాను కానీ.. మూడున్నర నెలల్లోనే వారు తీసుకున్న నిర్ణయాలు ప్రజలను ఇబ్బందులకు గురి చేసి, రాష్ట్ర అభివృద్ధిని ప్రశ్నార్థకంగా మార్చేశాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, విద్య, ఆరోగ్యం, జలవనరుల పంపిణీ వంటి కీలక అంశాలపై దృష్టి సారిస్తుందని, కానీ వైసీపీ 100 రోజుల పాలన చూస్తుంటే పారదర్శకత, దార్శనికత లోపించినట్లు కనిపిస్తోందని అన్నారు. శనివారం ఉదయం మంగళగిరి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పాలనపై 33 పేజీల నివేదిక విడుదల చేశారు. ఈ సమావేశంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ అర్హం ఖాన్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ.. "దిగజారిపోతున్న రాజకీయాలు చూసి చలించిపోయాను. ఈ వ్యవస్థను మార్చేందుకే జనసేన పార్టీని స్థాపించాను. 2019 సార్వత్రిక ఎన్నికల్లో దెబ్బ తిన్నా బలంగా నిలబడ్డాం అంటే దానికి కారణం దేశం, సమాజం కోసం సర్వస్వం ఇచ్చే శక్తి మాకు ఉంది కాబట్టి. అందుకే ఓటమి ఎదురైనా బలపడ్డాం తప్ప బలహీన పడలేదు. ప్రతిపక్షం అంటే పద్దతి పాడు లేకుండా ఇష్టం వచ్చినట్టు అధికార పక్షాన్ని తిట్టడం కాదు... విధానపరంగా జరుగుతున్న లోపాలు, అవకతవకలపై లోతైన పరిశీలన చేశాకే మాట్లాడతాం. *100 రోజుల్లో లక్షమంది ఉపాధి కోల్పోయారు తెలుగుదేశం పార్టీ ఓటమికి కారణాల్లో ఇసుక దోపిడీ ఒకటి. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ప్రైవేటు వ్యక్తులకు వెళ్లిపోయింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలతోపాటు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఒక మాఫియాలా ఏర్పడి ఇసుకను అడ్డగోలుగా దోచుకున్నారు. ఇసుక దోపిడి ఆపుతాం, పారదర్శక పాలనతో ప్రజలకు తక్కువ ధరకే ఇసుక అందిస్తామని హామీ ఇచ్చి వైసీపీ అధికారంలోకి వచ్చింది. టన్ను ఇసుక రూ. 375 అని చెప్పి, స్టాక్ యార్డుల్లో రూ. 900కు అమ్ముతున్నారు. అధికంగా వసూలు చేస్తున్న రూ. 525 ఎక్కడికి వెళ్తున్నాయో తెలియని పరిస్థితి. ప్రభుత్వ పెద్దలు మాట్లాడితే పారదర్శక పాలన అంటున్నారు. నిజంగా వైసీపీది పారదర్శక పాలనే అయితే టన్ను ఇసుక మీద అధికంగా వసూలు చేస్తున్న రూ. 525 ఎక్కడికి వెళ్తున్నాయో చెప్పాలి. రాష్ట్ర కార్మిక శాఖ దగ్గర నమోదైన భవన నిర్మాణ కార్మికుల సంఖ్య 19,34,158గా ఉంది. నమోదు కాని వారు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారిని కలుపుకొంటే దాదాపు 45 లక్షల మంది వరకు ఉంటారు. మూడు నెలలుగా ఇసుక సరఫరా నిలిచిపోవడంతో వీరికి ఉపాధి లేకుండాపోయింది. పనులు లేక పస్తులు ఉంటున్నారు. నిర్మాణ రంగం మీద ఆధారపడిన వ్యాపారాలు అన్నీ తీవ్ర నష్టాల్లో ఉన్నాయి. వైసీపీ 100 రోజుల పాలనలో దాదాపు లక్షమంది ఉపాధి కోల్పోయారు. ఇది పూడ్చలేని నష్టం. చిన్నపాటి ఇల్లు కట్టుకోవాలన్నా, ఉన్న ఇంటికి మరమ్మతు చేయించాలన్నా సాధ్యం కాని పరిస్థితి నెలకొంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగీ ఆదిత్యనాథ్ గారు 100 రోజుల్లో చాలా బలమైన నిర్ణయాలు తీసుకొని జనరంజకంగా అందిస్తే... ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ మాత్రం సరైన ఇసుక పాలసీని కూడా తీసుకురాలేకపోవడం వారి అసమర్ధతకు నిదర్శనం.

మచిలీపట్నం పోర్టును తెలంగాణకు డ్రై పోర్టు చేస్తారా? 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.2 లక్షల 58 వేల కోట్ల అప్పుంది. వైసీపీ ప్రకటించిన మ్యానిఫెస్టో అమలు చేయాలంటే మరో రూ. 50 వేల కోట్లు అదనంగా కావాలి. ఒక వైపు అప్పులకు వడ్డీలు కడుతూ నవరత్నాలను అమలు చేయాలంటే డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయి. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులు వద్దని హెచ్చరిస్తున్నా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి నిర్ణయాల వల్ల పెట్టుబడుదారుల్లో విశ్వాసం కోల్పోతాం అని చెబుతున్నా వెనక్కి తగ్గడం లేదు. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ విషయంలో గత ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలు ప్రస్తుత ప్రభుత్వాలు గౌరవించాలి గానీ రద్దు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని జపాన్ దేశ రాయబారి శ్రీ కెన్జీ హిరమత్సు కేంద్రానికి రాసిన లేఖలో హితవు పలికారు. దేశవ్యాప్తంగా వాహన విక్రయాలు తగ్గిపోయి ఆటోమొబైల్ రంగం చిందరవందరగా ఉన్న తరుణంలో మన రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన కియా మోటార్స్ సంస్థ తన ప్లాంట్ లో కార్యకలాపాలు ప్రారంభించింది. ఆ సందర్భంలో వైసీపీ నాయకులు కియా సీఈవోను అవమానాలకు గురి చేశారు. డీప్ సీ వాటర్ పోర్ట్ అయిన మచిలీపట్నం నౌకాశ్రయం భవిష్యత్ ను అనిశ్చితిలోకి నెట్టివేశారు. పోర్ట్ కి సంబంధించిన ఒప్పందాల రద్దుతో మచిలీపట్నంలో పోర్టు ఆధారిత వాణిజ్యం, ఉపాధి అవకాశాలు దెబ్బతినే పరిస్థితి నెలకొంది. మచిలీపట్నం పోర్టును తెలంగాణపరం చేస్తున్నారనే వాదన ప్రజల్లో ప్రబలంగా ఉంది.

దోచేసిన లక్ష కోట్లు పెట్టుబడులుగా తెస్తారా..? 

పోలవరం టెండర్లు రద్దు చేశారు. అమరావతి నిర్మాణాలు నిలిపివేసి పెట్టుబడుదారుల్లో భయాందోళనలు సృష్టించారు. దీని కారణంగానే రూ. 24,000 కోట్ల పెట్టుబడితో 5 వేల మందికి ప్రత్యక్షంగా, 10 వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన ఆసియా పల్ప్ అండ్ పేపర్ (ఏపీపీ) అనే అంతర్జాతీయ సంస్థ తన ప్లాంట్ ను ప్రకాశం జిల్లా నుంచి మహారాష్ట్రకు తరలిస్తోంది. లోటు బడ్జెట్, నిధులు లేమి ఉన్న రాష్ట్రంగా మిగిలినప్పుడు పెట్టుబడులు ఆకర్షించే వాతావరణం, సంపద సృష్టించే పరిస్థితులు కల్పించాలి. అయితే ఇందుకు భిన్నంగా పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలను భయభ్రాంతులను గురి చేస్తే పెట్టుబడులు ఎక్కడ నుంచి వస్తాయి. జగన్ రెడ్డిగారు లక్ష కోట్లు దోచేశారని టీడీపీ వాళ్ళు ఆరోపించారు. ఆ లక్ష కోట్లు పెట్టుబడిగా తెస్తారా..?. పెట్టుబడిదారులను పంపించేసి కూడా పెట్టుబడులు వస్తాయని ధైర్యంగా ఉన్నారంటే మీకు వేరే చోట నుంచి డబ్బు వచ్చుండాలి. తెలిసి చేస్తున్నారో, తెలియక చేస్తున్నారో తెలియదు గానీ పాలనలో విజన్ లోపించింది. రాష్ట్రం ఇలానే ముందుకు సాగితే 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధించాలనే ప్రధానమంత్రి లక్ష్యం నీరుగారిపోతుంది. వైసీపీ ప్రభుత్వం నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెబుతోంది. ఈ 100 రోజుల కాలంలో ఎంతమంది ఉపాధి అవకాశాలు కోల్పోయిందీ, చిన్నపాటి ఉద్యోగాలు చేసుకుంటున్నవాళ్ళు ఎందుకు నిరాశానిస్పృహలకు లోనవుతున్నదీ గమనించాలి. గ్రామ వాలంటీర్లగా వైసీపీ కార్యకర్తలను నియమిస్తూ సమాంతర వ్యవస్థను తయారు చేస్తున్నారు. గ్రామ వాలంటీర్ల వ్యవస్థ కొరియర్ సర్వీసులా ఉంది. తెలుగుదేశం పార్టీని జన్మభూమి కమిటీలు ఎంతలా దెబ్బతీశాయో.. వైసీపీని కూడా గ్రామ వాలంటీర్ల వ్యవస్థ దెబ్బతీస్తుంది. పల్లె వాతావరణాన్ని పాడు చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. కిడ్నీ, తలసేమియా వ్యాధిగ్రస్తులకు రూ. 3 వేలు పింఛన్ ఇస్తామన్నారు. ఇస్తున్నారో లేదో తెలియదు. వైసీపీ అధికారంలోకి వస్తే బలమైన ఆరోగ్య పాలసీ తీసుకొస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద 4 వేల పై చిలుకు డెంగ్యూ, మలేరియా కేసులు నమోదైతే.. ఒక్క కృష్ణా జిల్లాలోనే ఈ సంఖ్య 8300. ఈ గణంకాలే చాలు సీజనల్ వ్యాధులపై ముందస్తు చర్యలు ఎంత చక్కగా ఉన్నాయో చెప్పడానికి.

రూ.300 కోట్ల నష్టం భరించేదెవరు? 

తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అవినీతి జరిగిందని చెప్పి పోలవరం టెండర్లను రద్దు చేశారు. దీంతో పనులు ఆగిపోయి రూ. 300 కోట్లు నష్టం వాటిల్లింది. పోలవరం ప్రాజెక్టు అధారిటీ నష్టం భరించనని చెప్పింది. ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారు..? వైసీపీ నాయకులు భరిస్తారా..? జగన్ రెడ్డి గారి సిమెంట్ ఫ్యాక్టరీల నుంచి డబ్బులు తెచ్చి పెడతారా..? లేక బొత్సగారు విజయనగరంలో ఆస్తులు అమ్మి భరిస్తారా..?. పారిశ్రామిక నగరంగా వైజాగ్ అభివృద్ది చెందుతోంది. వచ్చే 10 ఏళ్లలో నీరు దొరకని పరిస్థితి నెలకొంటుందని పర్యావరణ శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సమయంలో పోలవరం ఆపేస్తే రైతాంగంతోపాటు వైజాగ్ వాసుల తాగు నీటికి కూడా ఇబ్బందిపడే పరిస్థితులు నెలకొంటాయి. మరోవైపు జల వనరుల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. కృష్ణా వరదల సమయంలో సంబంధిత శాఖ ఎలాంటి సన్నద్ధత లేకుండా వ్యవహరించింది. కృష్ణా నదికి వరద వస్తుందని సెంట్రల్ వాటర్ కమిషన్ (సి.డబ్ల్యూ.సి.) వాళ్ళు జూలై చివరి వారంలోనే సమాచారం ఇచ్చారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించ లేదు. ఎందుకంటే వాళ్ల నాయకుడు అమెరికాలో ఉన్నాడు. మంత్రులు వేరువేరు పనుల్లో బిజీగా ఉన్నారు. ముందుగానే స్పందించినట్లయితే కరవు ప్రాంతమైన రాయలసీమలో చెరువులు, కుంటలు, పంటకాలువలు నీళ్లతో కళకళలాడేవి. వాటర్ మేనేజ్ మెంట్ తెలియక చివరకు సముద్రంలోకి వదిలేశారు. వరదల సమయంలో వైసీపీ మంత్రులు నడుచుకున్న విధానం చూస్తుంటే ఒక సామెత గుర్తొచ్చింది. కొబ్బరి చెట్టు ఎందుకెక్కావు అంటే దూడ గడ్డికోసం అన్న చందంగా వ్యవహరించారు. ఒక వైపు కృష్ణా పరివాహక ప్రాంతం మునిగిపోతుంటే దానిని పట్టించుకోకుండా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి చుట్టూ తిరిగారు వైసీపీ మంత్రులు. మంత్రుల్లా ప్రవర్తించ లేదు. ఒకవైపు రైతులు చచ్చిపోతుంటే.. వందలాది మంది జ్వరాల బారినపడుతుంటే బాధ్యతతో కాకుండా ఆకతాయితనంతో వ్యవహరిస్తున్నారు. రాజధాని అంటే నా దృష్టిలో 34 వేల ఎకరాలు, 26 వేల మంది రైతులు కాదు. రాజధాని అమరావతి అంటే 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవం. దీనిని వైసీపీ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి. రాజధానికి ఎంపిక అయిన ఈ ప్రాంతం భౌగోళికంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు అందుబాటులో ఉంటుంది. అంతే కాకుండా రాష్ట్ర ఆదాయంలో ఎక్కువ శాతం సమకూర్చేది విజయవాడ ప్రాంతం. అందువల్ల రాజధానిగా ఈ ప్రాంత ఎంపికను మేము కూడా సమర్ధిస్తున్నాం అని ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా తెలిపింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక బొత్సగారు క్యాపిటల్ గా గెజిట్ నోటిఫికేషన్ లేదు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ వారు తప్పు చేశారు అనుకోండి మీరు ఇప్పుడు గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వండి. వాళ్లు ఇవ్వలేదు కనుక మేము రాజధాని ప్రాంతాన్ని తరలిస్తాం అంటే కుదరదు. రాజధాని నిర్మాణాల కోసం ఇప్పటి వరకు రూ. 8 వేల కోట్లకు పైబడి ప్రజాధనం పెట్టుబడిగా పెట్టాం. ఇప్పుడు రాజధానిని తరలిస్తే ప్రజాధనం వృథా అవుతుంది. దీనిపై సమగ్రమైన ఆలోచన విధానం వైసీపీ ప్రభుత్వానికి లేదన్న సందేహాలు కలుగుతున్నాయి.

రైతు కన్నీరు రాష్ట్రానికి క్షేమం కాదు 

రైతు లేకపోతే రాజుకు కూడా కూడు ఉండదంటారు. అలాంటి రైతే విత్తనాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నాడు. విత్తనాల కోసం క్యూలైన్లలో గంటల తరబడి నిలబడి ఇద్దరు మృత్యువాత పడ్డారు. రాయలసీమకు రావాల్సిన విత్తనాలు ఎక్కడో కర్ణాటకలో దర్శనమిచ్చాయి. విత్తనాలు కొరతపై ప్రశ్నిస్తే సంబంధిత మంత్రి వాయితీసి ఇవ్వడానికి ఇవేమైనా ఇడ్లీలా అంటారు. రోజూ అన్నం తింటున్నప్పుడు రైతు గుర్తురాడా..?. రైతు కష్టం తెలియదా..?. మూలాలు మర్చిపోయారా...? . విత్తనాలు ఇవ్వకపోగా కనీసం సానుభూతి చూపకుండా వెటకారమా..?. వైసీపీ మంత్రులకు ఒకటే చెబుతున్నా.. రైతులతో కన్నీరు పెట్టిస్తే అధోగతి పాలవుతారు. రైతు కన్నీరు రాష్ట్రానికి క్షేమం కాదు.

బీరు విక్రయాల్లోనే ప్రగతి 

రాష్ట్రంలో అధిక శాతం విద్యాలయాల్లో మరుగుదొడ్లు లేవు. మరుగుదొడ్లు ఉన్న చోట పారిశుద్ధ్య కార్మికులను తీసేశారు. వయసొచ్చిన ఆడపిల్లలు ఎక్కడి వెళ్తారు..?. మంత్రులకు కూడా పిల్లలు ఉన్నారు కదా. మానవత్వం లేకపోతే ఎలా..?. కళాశాలల్లో మరుగుదొడ్లు లేక చాలామంది బిడ్డలు చదువులు మధ్యలోనే ఆపేస్తున్నారు. అమ్మ ఒడి పథకం కింద ప్రతి తల్లికి రూ. 15 వేలు ఇస్తామంటున్నారు. ఒక తల్లికి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నా ఒక్కరికే ఇస్తామంటున్నారు. ఇంట్లో పిల్లల మధ్య చిచ్చు పెట్టేలా ఉంది ఈ పథకం. రాష్ట్ర ప్రభుత్వం ఈ మూడున్నర నెలల్లో ఏదైనా అభివృద్ధి సాధించింది అంటే అది మద్యపానం విక్రయాల్లోనే. మద్యం విక్రయాలు తగ్గిపోయాయి అని ప్రభుత్వం చెబుతోంది. మరి ఆదాయం ఎలా పెరిగింది. ప్రభుత్వ రాబడి చూస్తే బీర్ సేల్స్ 13 శాతం పెరిగింది. తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రి బీర్ హెల్త్ డ్రింక్ అంటే దానిని వైసీపీ నాయకులు ప్రమోట్ చేస్తున్నట్లుంది. భవిష్యత్తులో విస్కీని ప్రోటీన్ షేక్ గా, బ్రాందీని బోర్నవిటాగా తీసుకెళ్తారేమోనని అనిపిస్తోంది. మద్యం మీద ఆదాయం ప్రభుత్వానికి అవసరం లేదని చెబుతూనే.. ఆదాయాన్ని దాచేస్తున్నారు. దీన్ని చూస్తుంటే ఎంతవరకు సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తారన్న దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

రెండు కేసులను సీబీఐకి అప్పగించాలి 

రాష్ట్రంలో శాంతిభద్రతలు లేకపోతే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. పద్మశ్రీ పురస్కార గ్రహీత, ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్, మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ప్రస్తుత ఛైర్మన్ శ్రీ మోహన్ దాస్ పాయ్ గారు మన రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడుల విధానంపై వెలిబుచ్చిన అభిప్రాయాలను తప్పనిసరిగా పరిశీలించాలి. ప్రభుత్వ టెర్రరిజం వల్ల కొత్త పరిశ్రమలు రావనీ, ఇలాగైతే ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి కుంటుపడుతుందని శ్రీ మోహన్ దాస్ పాయ్ చెప్పిన విషయాన్ని ప్రతి ఒక్కరూ లోతుగా విశ్లేషించుకోవాలి. విశాఖపట్నంలో జగన్ రెడ్డి గారిపై కోడికత్తితో దాడి జరిగితే దీని వెనక ఎవరో ఉన్నారు.. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. జగన్ రెడ్డిగారు ప్రమాణస్వీకారం రోజునే దాడి చేసిన వ్యక్తి బయటకు వచ్చాడు. జగన్ రెడ్డి గారి సొంత చిన్నాన్నను హత్య చేశారు. 30 మందితో విచారణ బృందాన్ని వేసినా కేసు కొలిక్కి రాలేదు. ఈ రెండు కేసులపై నిర్దేశిత కాలంలో పోలీస్ శాఖ స్పష్టమైన వివరణ ఇవ్వాలి. లేకపోతే అఖిలపక్షం ఏర్పాటు చేసి ఈ కేసులను సీబీఐకి ఇవ్వాలని డిమాండ్ చేస్తాం. వైసీపీ ప్రభుత్వం ఈ మూడున్నర నెలల్లో సాధించింది ఏంటి అంటే.. మూడున్నరేళ్లు సాము చేసి మూలన ఉన్న ముసలమ్మను కొట్టిన చందంగా ప్రభుత్వ ప్రజావేదికను కూలగొట్టడం. ప్రభుత్వానికి ఇచ్చిన 100 రోజుల గడుపు ముగిసింది. ప్రతి విషయాన్ని జనసేన పార్టీ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. నివేదికలో పెట్టిన ప్రతి అంశంపై స్పష్టమైన వివరణ వైసీపీ నాయకులు ఇవ్వాలి. అవరసరమైతే రాజకీయ పోరాటాలు చేస్తాం" అన్నారు.

రహస్య జీవోల మతలబేమిటి: నాదెండ్ల మనోహర్

జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ... "రాష్ట్ర ప్రజల కోసం జనసేన పార్టీ నిలబడింది, వారి కోసం నిరంతరం పోరాడుతోంది అన్నారు. ముఖ్యమంత్రి గారి డ్యాష్ బోర్డులో మనం చూస్తే...అన్ని శాఖల సమాచారం అరకొరగా ఉంది. ఆర్థిక శాఖకు సంబంధించిన సమాచారం లేదు. ఆర్థిక శాఖ వెబ్ సైట్‌ను అందుబాటులో లేకుండా‌ చేయడం ద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తెలియకుండా చేస్తున్నారు. 100 రోజుల కాలంలో రాష్ట ప్రజలకు తెలియకుండా రహస్య జీవోలను జారీ చేశారు. రాష్ట్రంలో గృహ నిర్మాణ పథకం పూర్తిగా కుంటుబడింది. గత నెలలో ఎన్ని గృహాలు నిర్మించారో తెలుసుకునేందుకు ప్రభుత్వ వెబ్ సైట్ లో చూశాం. కేవలం 476 గృహాలు నిర్మించారు. ప్రతి నెల లక్ష గృహాల నిర్మాణాలు చేపట్టాలని టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఇంత తక్కువగా ఎందుకు నిర్మించారో ప్రజలకు సమాధానం చెప్పాలి. మౌఖిక ఆదేశాల ద్వారా సంక్షేమ కార్యక్రమాలు నిలిపివేశారు. రెండు లక్షల మంది ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజన పథకం అర్ధంతరంగా ఆపేశారు. దీంతో గ్రామీణ ప్రాంతం విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నీతి అయోగ్ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం అనవసరమైన ఖర్చులు చేస్తోందని స్వయంగా నీతి అయోగ్ వైస్ ఛైర్మన్ ఇటీవల వ్యాఖ్యానించార"ని ఆయన గుర్తు చేశారు.

More Press News