అనాథల సంక్షేమాన్ని ఈ ప్రభుత్వం మానవీయ కోణంలో చూస్తుంది: తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ

  • దేశం గర్వించేలా, రాష్ట్రాలు అనుసరించేలా అనాథలకోసం నూతన విధానం రూపకల్పనకు మేథోమథనం
  • అనాథలుగా వచ్చిన వారు కుటుంబంగా మారే వరకు ప్రభుత్వమే తల్లిదండ్రిగా బాధ్యతలు
  • అనాథలు, అనాథ ఆశ్రమాలు, కోవిడ్ వల్ల అనాథలుగా మారిన వారిపై రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన వేసిన కేబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశం అభిప్రాయాలు
(హైదరాబాద్, ఆగస్టు 07): తెలంగాణ రాష్ట్రంలో అనాథలు, అనాథ ఆశ్రమాలు, కోవిడ్ వల్ల అనాథలు అయిన వారి స్థితిగతులు ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన వేసిన క్యాబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వమే తల్లిదండ్రిగా మారి అనాథల సంరక్షణ, సంక్షేమం, భవిష్యత్ బాధ్యతలు తీసుకునేందుకు దేశంలోనే అత్యుత్తమమైన, ఆదర్శవంతమైన విధానాన్ని రూపొందించి ప్రభుత్వానికి అందించాలని అభిప్రాయపడింది.

మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో నేడు కేబినెట్ సబ్ కమిటీ మొదటి సమావేశం జరిగింది. దీనికి మంత్రులు కేటీఆర్, ఇంద్ర కరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు.

అనాథల సంక్షేమాన్ని మానవీయ కోణంలో ఈ ప్రభుత్వం చూస్తుందని, ఎంత ఖర్చు అయినా భరిస్తుందని, ఈ సబ్ కమిటీ ద్వారా ప్రతిపాదించే పాలసీ దేశం మొత్తం గర్వించే విధంగా, ఇతర రాష్రాలన్నీ అనుసరించే విధంగా ఉండే విధంగా సూచిస్తామని కమిటీ ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది.

తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే అనేక రంగాల్లో దేశానికి ఆదర్శవంతంగా ఉందని, ఈ అనాథల కోసం అమలు చేసే విధానం వీటన్నింటిని మించి ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అనాథగా ఈ ప్రభుత్వ సంరక్షణలోకి వచ్చిన పిల్లలు ఎదిగి, స్థిరపడి తల్లిదండ్రులుగా మారే వరకు, కుటుంబంగా తయారు అయ్యే వరకు ప్రభుత్వమే వారికి తల్లిదండ్రులుగా అన్ని రకాల బాధ్యతలు తీసుకునే విధంగా కొత్త విధానం వచ్చేందుకు ప్రతిపాదిస్తామని చెప్పారు.

ఇందుకోసం న్యాయపర ఇబ్బందులు లేకుండా చూసి పకడ్భందీగా ఈ విధానాన్ని రూపొందించేలా ప్రతిపాదనలు చేస్తామన్నారు.

పాత చట్టాలకు మార్పులు చేయడం, పాత విధానాన్ని సవరించడం కాకుండా సంపూర్ణంగా, సమగ్రంగా కొత్త విధానం, కొత్త చట్టం ఉండే విధంగా ఈ సబ్ కమిటీ కసరత్తు చేసి ప్రతిపాదనలు చేస్తుందన్నారు.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వివిధ వర్గాలకు అమలవుతున్న సంక్షేమ పథకాల కంటే గొప్పగా, మరింత ఎక్కువగా అనాథల సంరక్షణ కోసం అమలయ్యే విధంగా రానున్న నూతన విధానాన్ని సూచిస్తామన్నారు.

ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిశు విహార్ లు, హోమ్స్, ఆశ్రమాలను పటిష్టంగా తయారుచేస్తూ, ప్రైవేట్ ఆధ్వర్యంలో సేవా దృక్పథంతో గొప్పగా నిర్వహిస్తున్న అనాథ ఆశ్రమాలను ప్రోత్సహించే విధంగా ఈ కమిటీ తన సూచనలు సమర్పిస్తుందన్నారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో సభ్యులు పరిశీలించి అభిప్రాయాలు క్రోడీకరించాలని సమావేశంలో నిర్ణయించారు.

ఈ సమావేశానికి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్ కన్వీనర్ గా వ్యవహరించారు. సమావేశానికి వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.


More Press News