ఈనెల 6న ప్రొబేష‌న‌రీ ఐపీఎస్ అధికారుల శిక్ష‌ణ ముగింపు ప‌రేడ్‌

  • ముఖ్య అతిథిగా హాజ‌రుకానున్న‌ కేంద్ర హోంశాఖ స‌హాయ‌మంత్రి నిత్యానంద్ రాయ్‌
హైద‌రాబాద్: 72వ బ్యాచ్ ప్రోబేష‌న‌రీ ఐపీఎస్ అధికారుల శిక్ష‌ణ కార్య‌క్ర‌మం ముగింపు సంద‌ర్భంగా ఈనెల 6న స‌ర్దార్ వల్ల‌భాయ్ ప‌టేల్ జాతీయ పోలీసు అకాడ‌మీలో పాసింగ్ ఔట్ ప‌రేడ్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు అకాడ‌మీ డైరెక్ట‌ర్ అకుల్ క‌ర్వాల్ తెలిపారు. ఈ కార్య‌క్ర‌మానికి కేంద్ర హోంశాఖ స‌హాయ‌మంత్రి నిత్యానంద్ రాయ్ ముఖ్యఅతిథిగా హాజ‌ర‌వుతార‌ని ఆయ‌న వెల్ల‌డించారు.

బుధ‌వారం అకాడ‌మీలో నిర్వ‌హించిన విలేఖ‌రుల స‌మావేశంలో అకుల్ క‌ర్వాల్ మాట్లాడుతూ.. మొత్తం 144 ఐపీఎస్ ట్రైనీలు శిక్ష‌ణ పూర్తిచేసుకున్నార‌ని, ఇందులో 33 మంది మ‌హిళా ఐపీఎస్ ట్రైనీలు ఉన్నార‌ని తెలిపారు. ఈ శిక్ష‌ణ‌లో మ‌న ట్రైనీ  ఐపీఎస్ అధికారుల‌తో పాటు నేపాల్ కు చెందిన 10 మంది, రాయ‌ల్ బూటాన్ నుంచి 12, మాల్దీవులు నుంచి 7, మార్షియ‌స్ నుంచి 5 గురు మొత్తం విదేశాల‌కు చెందిన 34 మంది పోలీసు అధికారులు శిక్ష‌ణ పూర్తి చేసుకున్నార‌ని వివ‌రించారు. శిక్ష‌ణ పూర్తి చేసుకున్న ఐపీఎస్ ట్రైనీల‌లో తెలంగాణ కేడ‌ర్‌కు చెందిన న‌లుగురు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ కేడ‌ర్ కు చెందిన న‌లుగురు కూడా ఉన్నారు.

ఈసారి ఐపీఎస్ శిక్ష‌ణలో ప్ర‌థ‌మ‌, ద్వితీయ స్థానాల‌నూ ఇద్ద‌రు మ‌హిళా అధికారులే సాధించార‌ని ఆయ‌న వెల్ల‌డించారు. రంజితా శ‌ర్మ‌, శ్రేయ గుప్తా తొలి రెండు స్థానాల‌లో నిలిచార‌ని తెలిపారు. బెస్ట్ ఆల్‌రౌండ‌ర్ కేట‌గిరిలో నిలిచిన‌ రాజ‌స్థాన్ కేడ‌ర్ కు చెందిన రంజితా శ‌ర్మకు ప్ర‌ధాన‌మంత్రి బేట‌న్ మ‌రియు హోంమంత్రిత్వ‌శాఖ రివాల్వ‌ర్ అవార్డు అందుకోనున్నారు.

అలానే త‌మిళ‌నాడు కేడ‌ర్‌కు చెందిన శ్రేయ గుప్తాను శ్రీ బుబానంద మిశ్రా స్మార‌క ట్రోఫీ వ‌రించింది. శిక్ష‌ణ ఐపీఎస్ అధికారులు తొలుత 15 వారాల పౌండేష‌న్ కోర్సు, అనంత‌రం 30 వారాల తొలివిడ‌త ప్రాథ‌మిక శిక్ష‌ణ, 28 వారాల‌ జిల్లా స్థాయిలో ప్రాక్టిక‌ల్ శిక్ష‌ణ‌తో పాటు జాతీయ పోలీసు అకాడ‌మీలో రెండోవిడ‌త‌గా 29 వారాల శిక్ష‌ణ పూర్తిచేసుకున్న‌ట్లు డైరెక్ట‌ర్ తెలియ‌జేశారు. విలేక‌రుల స‌మావేశంలో జాతీయ పోలీసు అకాడ‌మీ డైరెక్ట‌ర్ అకుల్ క‌ర్వాల్ తో పాటు జాయింట్ డైరెక్ట‌ర్ లు ఎన్. మ‌ధుసూద‌న్ రెడ్డి,  అమిత్ గార్గ్‌, అసిస్టెంట్ డైరెక్ట‌ర్ వంశీకృష్ణ పాల్గొన్నారు.

More Press News