మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి గతంలో ఏ ప్రభుత్వం చొరవ చూపలేదు: మంత్రి తలసాని

హైదరాబాద్: మత్స్యకారుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచించినంత గొప్పగా గడిచిన 70 సంవత్సరాలలో ఏ ప్రభుత్వం కూడా ఆలోచించలేదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో గంగపుత్ర, ముదిరాజ్ సంఘ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశంను మంత్రి శ్రీనివాస్ యాదవ్, రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, ఇతర మత్స్య శాఖ అధికారులతో కలిసి నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి గతంలో ఏ ప్రభుత్వం చొరవ చూపలేదని అన్నారు. సుహృద్భావ వాతావరణంలో సమావేశం నిర్వహించుకోవడం శుభపరిణామం అని పేర్కొన్నారు. మత్స్యకారులకు మేలు చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూతను అందిస్తుందని హామీ ఇచ్చారు. అవసరమైతే మత్స్యకారులకు మేలు చేసేందుకు చట్ట సవరణ చేసే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పారు. గంగపుత్రులు, ముదిరాజ్ లు కలిసికట్టుగా ఉంటే వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తుందని అన్నారు.

దీనికి అనుగుణంగా గంగాపుత్రులు, ముదిరాజ్ సంఘాల ప్రతినిధులు కమిటీగా ఏర్పడి ఏదైనా జిల్లాలలో సమస్యలు తలెత్తిన సందర్బాలలో వాటిని పరిష్కరించడానికి చొరవ చూపాలని మంత్రి పిలుపునిచ్చారు. పరస్పర సహకారం, సామరస్య ధోరణితో వ్యవహరించడం వలన అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలను పరిష్కారం లభిస్తుందని చెప్పారు. తద్వారా ప్రతి ఒక్కరికి లబ్ది చేకూరుతుందని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో గంగపుత్ర, ముదిరాజ్ సంఘ ప్రతినిధులు సూచించిన పలు అంశాలపై చర్చించడానికి తిరిగి ఆగస్టు 7వ తేదీన మరో సమావేశం నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్ ముదిరాజ్ మాట్లాడుతూ.. మత్స్యకారులంతా సమిష్టిగా ఉండటం వలన అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, అభివృద్దిని సాధించగలమని చెప్పారు. రాష్ట్రంలో నీటి వనరులు భారీగా పెరిగాయని, మత్స్య సంపద కూడా అదే స్థాయిలో పెరిగిందని మత్స్యకారులు ఐక్యంగా ఉండి సొసైటీలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ప్రభుత్వ లబ్ది పొందాలని కోరారు. గంగపుత్రులు, ముదిరాజ్ ల మధ్య ఉన్న మనస్పర్ధలు, అపోహలు తొలగిపోయేలా సామరస్య పూర్వక చర్చలు ఎంతో దోహదం చేస్తాయని ఆయన చెప్పారు.

ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ.. మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తుందని అన్నారు. మత్స్యకారులు ఐక్యంగా, సోదరభావంతో ఉండి ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకొని అభివృద్దిని సాధించాలని కోరారు. ఈ సమావేశంలో గంగపుత్ర, ముదిరాజ్ సంఘ ప్రతినిధులు దేశిని మల్లయ్య గంగపుత్ర, చొప్పర శంకర్ ముదిరాజ్, మోహనకృష్ణ, ధనంజయ్య, బుస్స మల్లేశం, గొడుగు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

More Press News