మహంకాళి బోనాల ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు: మంత్రి తలసాని

హైదరాబాద్: ఈ నెల 25 వ తేదీన జరిగే మహంకాళి బోనాల ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనానికి భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ప్రభుత్వపరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. బుదవారం సికింద్రాబాద్ లోని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయ ఆవరణలో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తో కలిసి ఈ నెల 25 వ తేదీన జరిపే బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం నిర్వహించే మహంకాళి అమ్మవారి బోనాలను గత సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా నిర్వహించలేకపోయామని, ఈ సంవత్సరం ఘనంగా నిర్వహించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులను దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లను అవసరమైన ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.

ముఖ్యంగా భక్తుల క్యూ లైన్ కోసం పటిష్టమైన భారికేడ్లను ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా వాటర్ వర్క్స్ అధికారుల ఆధ్వర్యంలో భక్తులకు త్రాగునీటి ప్యాకెట్ లను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. కరోనా నేపథ్యంలో ఆలయ పరిసరాలలో సోడియం హై పో క్లోరైడ్ ను స్ప్రే చేయడం జరుగుతుందని, అదే విధంగా ఆలయానికి వచ్చే రహదారులలో అవసరమైన చోట్ల వెంటనే మరమ్మతు పనులను చేపట్టాలని జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిని మంత్రి ఆదేశించారు.

25న అమ్మవారి బోనాలు, 26న రంగం నిర్వహించడం జరుగుతుందని, భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయానికి వచ్చే ప్రధాన రహదారి నుండి ట్రాపిక్ మళ్లింపు చేపట్టాలని ట్రాపిక్ ఏసీపీ వినోద్ ను మంత్రి ఆదేశించారు. భక్తులకు తమ సేవలు అందించేందుకు స్వచ్చందంగా ముందుకొచ్చే సంస్థల సభ్యులకు ప్రత్యేక ఫోటో గుర్తింపు కార్డులను అందజేయాలని పోలీసు అధికారులను మంత్రి ఆదేశించారు. బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం ప్రభుత్వం వివిధ ఆలయాలకు అందించేందుకు 15 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని, 11వ తేదీన బోనాలు నిర్వహించే గోల్కొండ పరిధిలోని ఆలయాలకు 12వ తేదీన, ఈ నెల 25వ తేదీన బోనాలు నిర్వహించే సికింద్రాబాద్ లోని వివిధ ఆలయాలకు 19వ తేదీన ప్రభుత్వ ఆర్ధిక సహాయం చెక్కులను అందజేయడం జరుగుతుందని మంత్రి వివరించారు.

అదే విధంగా ఆగస్టు 1వ తేదీన బోనాలు నిర్వహించే హైదరాబాద్ పరిధిలోని ఆలయాలకు 26వ తేదీన ప్రభుత్వ ఆర్ధిక సహాయం చెక్కులను అందజేయడం జరుగుతుందని మంత్రి శ్రీనివాస్ యాదవ్  వివరించారు. ప్రభుత్వం అందించే ఆర్ధిక సహాయం కోసం ఆయా ఆలయాల కమిటీ సభ్యులు స్థానిక ఎమ్మెల్యేలకు లేదా దేవాదాయ శాఖ అధికారులకు కాని తమ దరఖాస్తులను అందజేయాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలు అన్ని రకాల పండుగలను ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారని శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు.

అన్ని వర్గాల ప్రజలు తమ పండుగలను ఎంతో ఘనంగా జరుపుకోవాలనేది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆకాంక్ష అని పేర్కొన్నారు. లక్షలాది మంది పాల్గొనే బోనాల ఉత్సవాలలో ప్రజలు కరోనా నిబంధనలను పాటిస్తూ ఉత్సవాలను జరుపుకోవాలని కోరారు.

ఈ సమావేశంలో కార్పొరేటర్లు మహేశ్వరి, సుచిత్ర, దీపిక, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఎం&హెచ్ఓ డాక్టర్ వెంకట్, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణ, ఆలయ ఈఓ మహేందర్ రెడ్డి, ఈఈ శివానంద్, అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు, మహంకాళి ఏసీపీ రమేష్, ట్రాపిక్ ఏసీపీ వినోద్, వాటర్ వర్క్స్ డైరెక్టర్ కృష్ణ, జీఎం రమణారెడ్డి, ఆర్& బీ ఎస్ఈ పద్మనాభరావు, ఈఈ రవీంద్ర మోహన్, ట్రాన్స్ కో ఎస్ఈ రవికుమార్, ఆర్టీసీ ఆర్ఎం యుగేందర్ తదితర అధికారులతో పాటు మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్, పలు స్వచ్చంద సంస్థల నిర్వాహకులు పాల్గొన్నారు.


More Press News