ఆర్థిక కార్యకలాపాలు పుంజుకునేలా తగు చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లను కోరిన తెలంగాణ సీఎస్

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం బిఆర్ కెఆర్ భవన్ లో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వేగవంతంగా అభివృద్ధి పయనంలో పయనించడానికి ఆర్థిక కార్యకలాపాలు పుంజుకునేలా బ్యాంకర్లు తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

రాష్ట్రంలో ప్రజల వినియోగం పెరిగేలా లోన్ మేళాలు, షాపింగ్ మాల్స్, బ్యాంకు కౌంటర్లు, కొనుగోళ్ళ కోసం ఇంటరెస్ట్ రిబేట్లు, రుణ దరఖాస్తుల సరళీకరణ, రుణాల కోసం కొత్త పథకాలు, సత్వర నిర్ణయాలు తీసుకోవాలని బ్యాంకర్లను కోరారు.

రాష్ట్రంలో చేపట్టిన కోవిడ్ నియంత్రణ చర్యలు వివరించడంతో పాటు ఇటీవల లాన్సెట్ జర్నల్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రశంసించిన విషయాన్ని బ్యాంకర్లకు తెలిపారు. వినియోగదారులు వాహనాలు, కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, దుస్తులు విరివిగా కొనుగోలు చేసేలా బ్యాంకులో మరింతగా రుణాలు అందించాలని బ్యాంకర్లను కోరారు. ఆర్థిక వ్యవస్ధ వేగంగా పుంజుకునేలా రుణాలను డ్రైవ్ మోడ్ లో అందించాలన్నారు.

ఈ సమావేశానికి ముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రిటేయిలర్లు, షాపింగ్ మాల్స్, టూర్ ఆపరేటర్లు, హాస్పిటాలిటి రంగానికి సంబంధించిన ప్రతినిధులను రాష్ట్ర ఆర్థిక వ్యవస్ధ పుంజుకోవడానికి తీసుకోవాల్సిన విషయాలపై చర్చించి, సలహాలను కోరారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వారికి కొనుగోళ్ళ పెంపుకు పలు రాయితీలు ప్రకటించాలని, కోవిడ్ నియంత్రణకు ప్రొటోకాల్ పాటించి వినియోగదారులను పెద్ద మొత్తంలో ఆకర్షించాలని కోరారు.

ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణారావు, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం రిజ్వీ, ఎస్సీడీడీ కార్యదర్శి రాహుల్ బొజ్జా, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేశ్ కుమార్, సిసిటి నీతూ కుమారి ప్రసాద్, హైదరాబాద్ కమీషనర్ ఆఫ్ పోలీస్ అంజనీకుమార్, సివిల్ సప్లయి కమీషనర్ అనిల్ కుమార్, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. 

More Press News