అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలి: మంత్రి జగదీష్ రెడ్డి
- ఆరు దశాబ్దాలుగా అభివృద్ధి ని నిర్లక్ష్యం చేశారు
- ప్రజల భాగస్వామ్యం లేకనే వచ్చిన నిధులు దుర్వినియోగం అయ్యాయి
- కాగితాల మీద లెక్కలు చూపారు... ప్రజలకు మొండి చెయ్యి చూపారు
- మొక్కల పెంపకం అందరి బాధ్యత
- గ్రామాల వారిగా కూరగాయల సాగు చెయ్యాలి
- సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి పురపాలక సంఘం పరిధిలో 4 వ విడత పట్టణ ప్రగతిని ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి పురపాలక సంఘం పరిధిలోని మూడో వార్డులో గురువారం ఉదయం ఆయన నాలుగో విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం స్థానిక శాసనసభ్యుడు డాక్టర్ గాధరి కిశోర్ కుమార్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ 2014 కు పూర్వం ప్రజల భాగస్వామ్యం లేకపోవడంతో వచ్చిన నిధులన్నీ దుర్వినియోగం అయ్యాయన్నారు. కాగితాల మీద ఉన్న లెక్కలు చూస్తే గుండె తరుక్కపోతుందని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చే నాటికి మొక్కల పెంపకం అంటేనే అటవీశాఖకు మాత్రమే పరిమితం చేశారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుండే హరితహారం పేరుతో మొక్కల పెంపకంపై దృష్టి సారించడమే కాకుండా అన్ని శాఖల ఉద్యోగులను, అబాలగోపాలం నుండి పండుముదసలి వరకు భాగస్వామ్యం చేశారన్నారు. భవిష్యత్ తరాలకు ఆక్షిజన్ అందించాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఒక మొక్కను ఇంటికి ఆరు మొక్కలను విధిగా నాటాలని ఆయన విజ్ఞప్తి చేశారు. చివరికి పోలీసులను కూడా అభివృద్ధి పనులలో భాగస్వామ్యం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందని ఆయన కొనియాడారు.
అంతకు ముందు ఆయన మూడో వార్డులో ఇంటింటికి పాదయాత్ర ద్వారా పర్యటిస్తూ పర్యావరణం పరిరక్షణ, మొక్కల పెంపకం,పారిశుధ్యం వంటి అంశాలపై మహిళలతో మాట్లాడుతూ అవగాహన కల్పించారు. ఆ తరువాత అదే వార్డులో మంత్రి జగదీష్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, స్థానిక శాసనసభ్యుడు గాధరి కిశోర్ కుమార్, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిలు వేరువేరుగా మొక్కలు నాటారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ పోతరాజు రజనీ రాజశేఖర్, వైస్ ఛైర్మన్ రఘునందన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ అశోక్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్ సరిత తదితరులు పాల్గొన్నారు.