నిరంతరం ప్రజల పక్షాన నిలిచేది జనసేన పార్టీయే: పవన్ కల్యాణ్

  • ప్రతి అంశం మీద సాధికారికంగా ప్రజల్లోకి వెళ్దాం 

  • జనసేన మేధో మధనంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్

జనానికి ఏ చిన్న ఇబ్బంది వచ్చిన మనదిగా భావించి అండగా నిలవాలి అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పారు. నిరంతరం ప్రజల పక్షాన నిలిచేది జనసేన పార్టీయే అన్నారు. గురువారం తూర్పుగోదావరి జిల్లా దిండిలో నిర్వహించిన జనసేన మేధోమధనం సమావేశాలు ప్రారంభమయ్యాయి. గురువారం రాత్రి ఈ సమావేశానికి పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ “జగన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన 100 రోజుల వరకూ ఏమీ మాట్లాడకూడదు అనుకున్నాం. కానీ పాలన విధానం మరోలా ఉంది. ఎప్పటికప్పుడు ప్రభుత్వ పనితీరును చూస్తున్నాం. దీనిపై సమగ్రంగా అధ్యయనం చేస్తున్నాం. మనం ప్రజలకు అండగా నిలవాలి. ప్రతి అంశం మీదా సాధికారతతో మాట్లాడదాం. ఇందుకు సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారితో చర్చిద్దాం. ఇలాంటి సమావేశాలు అవసరం” అన్నారు.

గురువారం ఉదయం సమావేశాలు మొదలయ్యాయి. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రారంభోపన్యాసం చేస్తూ “జనసేన పార్టీ విధి విధానాలు, పార్టీ భావజాలంతోపాటు ప్రజా సంబంధిత అంశాలపై మన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆలోచనలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి నాయకుడిపైనా ఉంది.  మన అధ్యక్షులు ఆలోచనలకు అనుగుణంగా నడచుకోవాలి. ప్రజలతో మమేకం కావాలి. పాలన ఏ విధంగా సాగుతుంది, పథకాల అమలు ఏమిటి, నిజమైన లబ్ధిదారులకు సక్రమంగా సంక్షేమ ఫలాలు చేరుతున్నాయో లేదో మనం ఎప్పటికప్పుడు పరిశీలించాలి. ఈ విషయంలో సరైన అవగాహన ఉండాలి.

ఇందుకు మేధోమధనం ఉపయోగపడుతుంది. పాలన అంశాలు, పథకాలు, ప్రభుత్వ పని తీరుపై స్పష్టమైన పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి. నేను తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి వివిధ అంశాలపై నిరంతరం పరిశీలన చేసి అధ్యయనం చేశాను. ఆ పరిజ్ఞానమే నేను సభాపతిగా ఎదిగేందుకు దోహదం చేసింది. మీరు ప్రజా సంబంధిత అంశాలపై సాధికారంగా మాట్లాడితే అది ప్రజలకు, మన పార్టీకి ఉపయుక్తంగా ఉంటుంది. అదే సమయంలో మన పార్టీపైనా, మన నాయకుడిపైన అసత్య ప్రచారాలకు పాల్పడితే బలంగా తిప్పికొట్టాలి. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ పార్టీ బలోపేతానికి అవసరమైన ప్రణాళికలను మన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సిద్ధం చేశారు.

ఎవరికి ఏ కష్టం వచ్చినా మనం ఉన్నాం, వారికి బాసటగా ఉంటామనే విశ్వాసం ప్రజల్లో ఉంది. పవన్ కల్యాణ్ విజయవాడ వచ్చినా వివిధ వర్గాలవారు తమ సమస్యలు చెబుతున్నారు” అన్నారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు పి.రామ్మోహన్ రావు మాట్లాడుతూ “పార్టీ నిర్మాణం అనేది ఒక అసాధారణ ప్రక్రియ. మన పార్టీ ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ఉదారమైన, ఉన్నతమైన భావాలు, త్యాగ శీలతల మేళవింపులతో జనసేన ఉంది. ఆ నమ్మకమే నన్ను ఈ పార్టీలోకి తీసుకువచ్చింది. ఈ ప్రాంతంలో జాతీయ రహదారులు తప్ప మిగిలిన ఏ రోడ్లు బాగోవు. తాగు నీరు అనేది లేదు. ప్రజలకు ఉన్న ఇలాంటి సమస్యలపై మనం బలంగా పోరాడాలి. ఎక్కడా మనం హింసాత్మక ఘటనల వైపు పోరాదు.

జనసేన అనేది ఒక శక్తివంతమైన పంథాను ఏర్పరచుకొంటుంది” అన్నారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద రావు మాట్లాడుతూ “పార్టీని ముందుకు తీసుకువెళ్లే క్రమంలో ఇలాంటి సమావేశాలు నాయకులకు దిశానిర్దేశం చేస్తాయి. ఈ సమావేశం నా నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. పవన్ కల్యాణ్ ఆలోచనలకు అనుగుణంగా ప్రజల పక్షాన ఉంటూ పార్టీని బలోపేతం చేస్తామ”న్నారు.  వివిధ అంశాలపై ఎస్.రాము, ఎ.కె.సాగర్, ప్రొఫెసర్ జి.ఎస్.చలం, ముప్పాళ్ళ సుబ్బారావు ఉపన్యసించారు.


More Press News