పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వే అప్ అండ్ డౌన్ ర్యాంప్ లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్: పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వేపై రూ.22.08కోట్ల వ్యయంతో నిర్మించిన అదనపు ర్యాంపులను శనివారం మధ్యాహ్నం ఉప్పర్ పల్లి వద్ద మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ జి.విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ లత, అత్తాపూర్ కార్పోరేటర్ సంగీత, ఎమ్మెల్సీలు వాణి దేవి, పట్నం మహేందర్ రెడ్డి, ఎగ్గె మల్లేశం, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెలే కాలే యాదయ్యలతోపాటు రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, హెచ్ఎండిఎ మెట్రోపాలిటన్ కమిషనర్ అరవింద్ కుమార్, హెచ్ఎండిఎ సెక్రెటరీ బి.ఎం. సంతోష్, హెచ్ఎండిఎ చీఫ్ ఇంజనీర్ బి.ఎన్.రెడ్డి, ఎస్ఈలు యూసుఫ్ హుస్సేన్, పరంజోతి, ఈఈ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

డౌన్ అప్ ర్యాంపుల ప్రారంభోత్సవం సందర్భంగా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ చేత రిబ్బను కత్తిరింపజేశారు.

మెహదీపట్నం నుంచి రాజేంద్రనగర్ అరాంఘర్ వరకు 11.6 కి.మీ పొడువైన పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వే కి ఇరువైపుల ఎక్కి, దిగేందుకు ర్యాంపులను హెచ్ఎండిఎ నిర్మిస్తున్నది. గతేడాది ఫిబ్రవరి నెల్లో అదనంగా ఆప్ అండ్ డౌన్ ర్యాంపుల నిర్మాణం ప్రారంభించారు.

రూ.22.08 కోట్లతో ఈ రెండు ర్యాంపుల నిర్మాణం సాగుతుండగా, పనులు పూర్తయ్యాయి. మెహదీపట్నం నుంచి ఎయిర్ పోర్టుకు వెళ్లే మార్గంలో పిల్లర్ నెం.161 వద్ద ఎక్స్ ప్రెస్ వే పైకి ఎక్కేలా,  ఎయిర్ పోర్టు నుంచి వస్తున్న క్రమంలో అత్తాపూర్ వద్ద దిగేలా పిల్లర్ నెం.163 దిగేందుకు ఈ ర్యాంపులను హెచ్ఎండీఏ నిర్మించింది.

కొత్తగా నిర్మించిన పీవీఎన్అర్ ఎక్స్ ప్రెస్ వే అప్ అండ్ డౌన్ ర్యాంపుల ద్వారా రాకపోకలతో వాహనదారులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది.

,

More Press News