76 శాతం కొనుగోళ్లు పూర్తి: తెలంగాణ పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్
- 60 లక్షలు దాటిన కొనుగోళ్లు
- 12 జిల్లాల్లో 656 కేంద్రాలు మూసివేత
- వాహనాలను సమకూర్చని రవాణా కాంట్రాక్టర్లు బ్లాక్ లిస్టు
- రేషన్ డీలర్లు గన్నీ సంచులను ప్రభుత్వానికి అప్పగించాల్సిదే
- ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్షించిన పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి
ఇప్పటి వరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశాం, ఇంకా ఎంత వస్తుంది, రైతులకు ఎంత చెల్లించాం, ఎన్ని రోజుల్లో చెల్లిస్తున్నాం, అందుబాటులో ఉన్న గన్నీ సంచులు ఎన్ని, ఇంకా ఎన్ని అవసరం వంటి అంశాలపై జిల్లాలవారీగా సుదీర్ఘంగా సమీక్షించారు.
అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ “రాష్ట్రంలో 52.76 లక్షల ఎకరాల్లో వరిపంట సాగైందని ఎకరానికి 25 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి అంచనా ప్రకారం కోటి 29 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అవుతుంది, ఇందులో సీడు, స్థానిక అవసరాలు, రైతులు తమ అవసరాలకు ఉంచుకునేది, రైసు మిల్లర్లు, ఇతర వ్యాపారస్తులు కొనుగోలు చేయగా మిగిలిన ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేస్తోంది. దీని ప్రకారం 80 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా లక్ష్యానికి అనుగుణంగానే ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సలహాలు, సూచనలు, మార్గదర్శకాలు, ఆదేశాల మేరకు పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్ గారి ఆధ్వర్యంలో కరోనా, లాక్ డౌన్ లో కూడా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు జరుపుతున్నాం. ఇప్పటి వరకు 8.82 లక్షల మంది నుండి రూ. 11,414 కోట్లు విలువ చేసే 60.50 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేశాం, 76 శాతం కొనుగోళ్లు పూర్తి చేయడం జరిగింది.
గత ఏడాది ఇదే సమయానికి 52.73 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా ఈ ఏడాది 60.50 లక్షల మెట్రిక్ టన్నులు అంటే దాదాపు 8లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా కొనుగోలు చేయడం జరిగింది. ఇంకా 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉంది.
కొనుగోళ్లు ముగియడంతో నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, యదాద్రి, వనపర్తి 12 జిల్లాల్లో 656 కొనుగోలు కేంద్రాలను మూసివేయడం జరిగింది. ధాన్యం కొనుగోళ్లు పూర్తయిన కొనుగోలు కేంద్రాల్లో మిగిలిపోయిన గన్నీ సంచులను అవసరమైన కేంద్రాలను తక్షణం తరలించాలని అధికారులను ఆదేశించడం జరిగింది. గన్నీ సంచుల వినియోగంలో పారదర్శకత మరింత పెరగాలి.
ఒప్పందం ప్రకారం రవాణా వాహనాలను ఏర్పాటు చేయని కంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని అదనపు కలెక్టర్లను అదేశించడం జరిగింది. ధాన్యం రవాణా కంట్రాక్టర్లను టెండర్ల ద్వారా జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్లు నియమిస్తారు. రాబోయే రోజుల్లో రవాణా కంట్రాక్టర్ల ఎంపిక మరింత పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం.
రేషన్ డీలర్ల తమ వద్ద మిగిలిపోయిన గన్నీ సంచులను ఆశించిన విధంగా పౌరసరఫరాల సంస్థకు అప్పగించండం లేదు. ప్రతి నెల 30 లక్షల గన్నీ సంచులకు గాను మార్చిలో 9.44 లక్షలు, ఏప్రిల్ నెలలో 7.90 లక్షల సంచులు మాత్రమే అప్పగించారు. ఒక్కో గన్నీ సంచి ధరను కూడా రూ.18 నుండి రూ.21కి పెంచడం జరిగింది. రాష్ట్రంలో భారీగా ధాన్యం దిగుబడులు పెరుగుతున్నాయి. గన్నీ సంచుల వినియోగం కూడా భారీ పెరుగుతోంది. ప్రభుత్వ ప్రాధాన్యతలను గుర్తించి గన్నీ సంచులను పౌరసరఫరాల సంస్థకు విక్రయించాలని రేషన్ డీలర్లను ఆదేశిస్తున్నాం. ఈ విషయంలో అధికారులు మరింత చొరవ చూపించాలన్నారు.
కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు లోబడి (తేమ శాతం 17) తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు.
ముఖ్యమంత్రిగారికి కృతజ్ఞతలు :
రేషన్ డీలర్లు, ఎల్ పిజి డీలర్లు, సిబ్బంది, పౌరసరఫరాల ఉద్యోగులు, సిబ్బందిని ఫ్రంట్ లైన్ వారియర్స్ క్రింద గుర్తించి వ్యాక్సిన్ ఇవ్వాలని తాము చేన విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూల నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
సూపర్ స్పైడర్ల కింద గుర్తించి వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు.